• Telugu News
  • /Telangana

హైడ్రా కమిషనర్‌ను బదిలీ చేయాల్సిందే: హైకోర్టు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కేసులో చట్టపాలనపై కీలక వ్యాఖ్యలు చేసింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 01, 2026, 1:55 pm IST
Read Time: 3 mins
హైడ్రా కమిషనర్‌ను బదిలీ చేయాల్సిందే: హైకోర్టు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ బదిలీ విషయంలో తగ్గేదే లేదన్న రీతిలో హైకోర్టు కీలక ఉత్తర్వులు వెల్లడించింది. రంగనాథ్ ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని.. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎస్‌కు సూచించింది. చట్టపాలన మాత్రమే కొనసాగాలని.. వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని హైకోర్టు ఈ సందర్బంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

హైడ్రా, శాంతాశ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కేసులో శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. హైడ్రా కమిషనర్‌ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది సుస్పష్టమని అందులో ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్ధమని తెలిపింది. రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని.. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎస్‌కు సూచించింది.

ఇప్పటికే పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవిలో కొనసాగించడానికి వీలులేదని ఇటీవలే హైకోర్టు స్పష్టం చేసింది. రంగనాథ్‌పై ఏడాదిన్నరకాలంలోనే ఏకంగా 63 కోర్టు ధికరణ కేసులు దాఖలవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆయన ఏ స్థాయిలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారో స్పష్టం అవుతున్నదని పేర్కొన్నది. కోర్టు ఆగ్రహానికి గురైన రంగనాథ్‌ అఫిడవిట్‌ ద్వారా కోర్టుకు క్షమామపణలు చెప్పారు. అయినప్పటికి ఆయన వ్యవహారశైలిపై సంతృప్తి చెందని న్యాయస్థానం ఆయనను బదిలీ చేయాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది.