విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా అనామలీస్, అన్-మ్యాపింగ్ విభాగాల ఓటర్లకు సోమవారం నుంచి దశలవారీగా నోటీసుల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో నోటీసులు అందుకునే ఓటర్లు 92.87 లక్షల మంది ఉండగా.. అనామలీస్‌లో 60.51 లక్షలు, అన్-మ్యాపింగ్‌లో 32.36 లక్షల మంది ఉన్నారు.ఈ నెల 17నే ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసినప్పటికి పలు కారణాలతో నోటీసుల ప్రక్రియలో ఆలస్యమైంది. సోమవారం నుంచి బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు అందిస్తున్నారు.
నోటీసులకు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాల్సిందే
నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని, వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఓటు తొలగించే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. నోటీసుల జారీ కోసం ప్రత్యేక యాప్ ఏర్పాటు చేశారు. ఓటరుకు నోటీసు ఇచ్చిన ఫొటోను బీఎల్‌వోలు యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో రోజుకు 200 మందికి వివరణ ఇచ్చేందుకు స్లిప్పులను జనరేట్ చేస్తున్నారు. నోటీసు స్లిప్‌లో.. ఏ తేదీన నోటీసులు ఇచ్చారు? ఏ సమయానికి వెళ్లాలి? ఏ కారణంతో ఇచ్చారు? తదితర వివరాలను పొందుపరుస్తారు.
రోజూ మూడు స్లాట్లను ఏర్పాటు చేశారు. ఏ స్లాట్‌కు ఓటరు హాజరు కావాలో కూడా చెబుతారు. ఆ సమయానికి ఓటరు వెళ్లి ఈఆర్వో/ఏఈఆర్వో ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ఆ రోజు వెళ్లలేకపోతే.. ఆ తర్వాత వెళ్లి, కారణం వివరిస్తే.. మరో తేదీకి నోటీసులను జనరేట్ చేస్తారు. ఆ రోజు మాత్రం ఓటరు కచ్చితంగా వెళ్లి అవసరమైన ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో 11 రకాల కార్డుల్లో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందని ఈసీ స్పష్టం చేసింది. ఇంటి పేరు, పేర్లలో తప్పులున్న ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య ఓల్డ్ సిటీలో అధికంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఎక్కువ మంది ఓటర్లకు నోటీసులు జారీ కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్‌మ్యాపింగ్ ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
ఆన్ లైన్ లోనూ చెక్ చేసుకోవచ్చు..
నోటీసులు జారీ, సమాధానాల కోసం గ్రామీణ జిల్లాల్లో ఇప్పటికే ఈఆర్వోలతోపాటు ఏఈఆర్వోలను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నోటీసులు అందుకునే వారు ఎక్కువగా ఉండడంతో అదనంగా ఏఈఆర్వోలను నియమిస్తున్నారు. వీఐపీ, ఎన్‌ఆర్‌ఐ, సెలబ్రిటీలకు ఎక్కడైనా నోటీసులు వస్తే వారు నేరుగా ఈఆర్వో ముందు హాజరు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ధ్రువపత్రాలను సేకరించే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్ ముసాయిదా జాబితాలో పేరు ఉందా? నోటీసుల జాబితాలో ఉన్నారా? వంటి అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
కేంద్ర ఎన్నికల వెబ్‌సైట్ voters.eci.gov.in లోకి వెళ్లాలి. అందులో submit doc ument against notice issued అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి ఫోన్ నంబరు లేదా ఎపిక్ నంబరును ఇస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేయడం ద్వారా నోటీసు జాబితాలో పేరు ఉంటే.. అందులో చూపిస్తుంది.పేరు, ఎపిక్ నంబరు, మీ నియోజకవర్గం, రాష్ట్రం, నోటీసులకు సమాధానం ఇచ్చే తేదీ, పోలింగ్ బూత్ వివరాలు కనిపిస్తాయి.