• Telugu News
  • /National

దేశంలో పడిపోయిన ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్‌లో వృద్ధి !

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 6 శాతం తగ్గినా హైదరాబాద్‌లో మాత్రం 15 శాతం వృద్ధి నమోదైంది. క్యూ2లో హైదరాబాద్‌లో 13,196 ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు ప్రాప్‌టైగర్ నివేదిక తెలిపింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 22, 2026, 4:19 pm IST
Read Time: 5 mins
దేశంలో పడిపోయిన ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్‌లో వృద్ధి !

దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాలలో ఇళ్ల విక్రయాలు పడిపోవడం రియల్ ఎస్టేట్ రంగానికి ప్రతికూలంశంగా కనిపిస్తుంది. అయితే హైదరాబాద్, చెన్నై నగరాల్లో మాత్రం వృద్ది నమోదవ్వడం ఈ నగరాల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊరటనిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎనిమిది ప్రధాన నగరాలు ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరు, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో ఏప్రిల్-జూన్ (క్యూ2) త్రైమాసికంలో నివాస గృహాల విక్రయాలు 6 శాతం తగ్గి 91,729 యూనిట్లకు పరిమితమైనట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్‌టైగర్ తన రియల్ ఇన్‌సైట్ నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ నగరాల్లో ఇళ్ల విక్రయాల సంఖ్య 97,674 యూనిట్లుగా ఉంది. ఇక హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో మాత్రం వృద్ధి నమోదైంది. ఈ మేరకు ప్రాప్‌టైగర్‌ నివేదిక వెల్లడించింది.

ఎందుకు తగ్గాయి..?

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పశ్చిమాసియా యుద్ధ మేఘాలు, ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనలతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అవలంబించడమే ఇళ్ల విక్రయాలకు పడిపోవడానికి కారణమని ప్రాప్‌టైగర్‌ నివేదిక పేర్కొంది. 2026 మెుదటి 3 నెలల్లో దేశంలోని టాప్ 8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 4 శాతం మేర పడిపోయాయని నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ చేయడం గమనార్హం. అయితే అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య కూడాహైదరాబాద్, చెన్నై నగరాలు వరుస రెండు త్రైమాసికాలలోనూ సానుకూల వృద్ధిని కనబరచడం విశేషం. ఏప్రిల్-జూన్ (క్యూ2) త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 15 శాతం పెరిగి 13,196 యూనిట్లకు చేరడం గమనార్హం. అలాగే చెన్నైలో అత్యధికంగా 36 శాతం వృద్ధితో అమ్మకాలు 7,183 యూనిట్లకు పెరిగాయి.

ప్రాప్ టైగర్ నివేదిక ప్రకారం..ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో విక్రయాలు 7 శాతం తగ్గి 24,112 యూనిట్లకు చేరగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 7 శాతం తగ్గి 9,352 యూనిట్లకు పరిమితమయ్యాయి. పుణెలో అత్యధికంగా 21 శాతం క్షీణత నమోదై 12,642 యూనిట్లు కాగా, బెంగళూరులో 9 శాతం తగ్గి 14,186 ఇళ్లు అమ్ముడయ్యాయి. అహ్మదాబాద్‌లో 20 శాతం, కోల్‌కతాలో 9 శాతం మేర అమ్మకాలు క్షీణించాయి. ఆయా నగరాలలో ఇళ్ల అమ్మకాలు కొద్దిగా తగ్గినప్పటికీ భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ బలహీనపడలేదని, మరింత స్థిరత్వంగా మారుతోందని ప్రాప్‌టైగర్ సీఈవో ప్రకాష్ తేజ్వానీ వ్యాఖ్యానించారు. నగరాల్లో చదరపు అడుగు ధర రూ.10,000 కంటే పైనే స్థిరంగా కొనసాగుతోందని, పండుగల సీజన్ నాటికి డిమాండ్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.