సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి భూముల అమ్మకానికి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైడ్రా పరిరక్షించిన కొన్ని ప్రభుత్వ భూములతో పాటు రాయదుర్గ్ ఐటీ నగరంలోని 10 ఎకరాలకు పైగా స్థలాన్ని, కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డుప్లాట్లను విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. రాయదుర్గ్ ఐటీ నగర్ లో ఎకరానికి కనీస ధర రూ. 175 కోట్లుగా నిర్ణయించారు. దీని ద్వారా సుమారు రూ. 2,500 కోట్లు సమకూరే అవకాశం ఉంది. కేపీహెచ్‌బీ ఫేజ్- 15లోని ఇరవై నాలుగు హౌసింగ్ బోర్డ్ ప్లాట్లను కూడా ఇ-వేలంకు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా సుమారు రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
హైడ్రా సుమారు రూ. 60,000 కోట్ల నుండి రూ. 90,000 కోట్ల విలువైన దాదాపు 2,665 ఎకరాల ప్రభుత్వ భూమినిస్వాధీనం చేసుకుని పరిరక్షించినట్లు ప్రకటించింది. చట్టపరమైన వివాదాలు లేని, ప్రజా ప్రయోజనాలకు తక్షణమే అవసరం లేని భూభాగాలను అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా గాజులరామారంలో 317 ఎకరాలు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 840 ఎకరాలు, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు చెందిన మరో 923 ఎకరాల భూములు అమ్మాలని నిర్ణయించినట్లుగా సమాచారం. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించిన కొద్ది రోజులకే, హైడ్రా స్వాధీనం చేసుకున్న భూములను అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ ఉపసంఘం.. భూములు అమ్మి ప్రభుత్వానికి నెలకు రూ.1,000 కోట్లు ఆదాయం ఇవ్వాలని హెచ్ఎండీఏ, టీజీఐఐసీలకు నిర్ధేశించినట్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నెలకు వెయ్యి కోట్ల టార్గెట్ చేరుకోవడం అసాధ్యమని హెచ్ఎండీఏ, టీజీఐఐసీలు చేతులెత్తేసిన నేపథ్యంలో ..భూముల అమ్మకాలతో నిధుల సమీకరణపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని మంత్రివర్గం ఉప సంఘం ఆదేశించిందని , లక్ష కోట్ల నిధులు సేకరించే ప్రక్రియలో ప్రభుత్వ భూములు అమ్మేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేలంపాటలు, దీర్ఘకాలిక లీజుల ద్వారా సుమారు 5,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలన్న వ్యూహంతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆరోపిస్తుండటం ఆసక్తికరం.