రికార్డులు బద్దలు..హైదరాబాద్ లో ఎకరం రూ.264కోట్లు

హైదరాబాద్ ఐటీ కారిడార్ రాయదుర్గంలోని పాన్‌మక్తాలో పరిధిలో ఉన్న సర్వే నంబర్ 83/1 లోని 5.25 ఎకరాల స్థలానికి తెలంగాణ పారిశ్రామిక ప్రాథమిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ఈ వేలంలో ఎకరం ధర రూ.264 కోట్లకు అమ్ముడుపోయి దేశంలోనే అత్యధిక ధరగా రికార్డు సృష్టించింది. వరుసగా జరుగుతున్న వేలాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 21, 2026, 7:30 pm IST
Read Time: 6 mins
రికార్డులు బద్దలు..హైదరాబాద్ లో ఎకరం రూ.264కోట్లు

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వం వేలం వేస్తున్న భూములు రికార్డు ధరలు పలుకుతూ..ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఐటీ కారిడార్ రాయదుర్గంలోని పాన్‌మక్తాలో పరిధిలో ఉన్న సర్వే నంబర్ 83/1 లోని 5.25 ఎకరాల స్థలానికి తెలంగాణ పారిశ్రామిక ప్రాథమిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ఈ వేలంలో ఎకరం ధర రూ.264 కోట్లకు అమ్ముడుపోయి దేశంలోనే అత్యధిక ధరగా రికార్డు సృష్టించింది. ఎంఎస్‌ఎన్‌ రియాలిటీ సంస్థ అధిక ధర చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకుంది. రూ. 1,386 కోట్లకు మొత్తం 5.25 ఎకరాలనూ ఆ సంస్థే దక్కించుకుంది.

వేలంలో కనీస ధర రూ.175 కోట్లు, డిపాజిట్‌ రూ.10కోట్లుగా టీజీఐఐసీ నిర్ణయించింది. బిడ్డర్లు డిపాజిట్‌ చెల్లించి ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొన్నారు. ఖరీదైన భూమి కావడంతో స్థిరాస్తి సంస్థలు పోటీపడి బిడ్డింగ్‌ దాఖలు చేశాయి. చివరికి ఎంఎస్‌ఎన్‌ సంస్థ అధిక ధర చెల్లించి ఈ భూమిని దక్కించుకుంది. మల్టీ-యూజ్ జోన్‌గా ఉన్న ఈ భూమి కోసం పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు తీవ్రంగా పోటీపడ్డాయి.

ఈ భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ చారిత్రక రాతి కట్టడాలు ఉన్నాయని, దుర్గం చెరువుకు సమీపంలో ఉన్నాయని, యాజమాన్య హక్కుల వివాదాలు ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. అయితే, వేలం ప్రక్రియను నిలిపివేసేందుకు న్యాయస్థానాలు నిరాకరించాయి. ఈ ప్లాట్లు రక్షిత వారసత్వ ప్రాంతాలు, బఫర్ జోన్ల పరిధిలోకి రావని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సరికొత్త రికార్డులతో దూసుకెళ్లున్న రియల్ రంగం..

ఇదే సర్వే నంబర్ 83/1లో గత మే 2026లో టీజీఐఐసీ నిర్వహించిన 6.29 ఎకరాల భూమి ఈ వేలంలో ఎకరం రూ. 237 కోట్లు పలికి అప్పటివరకు దేశంలోనే అత్యధిక రికార్డుగా నిలిచింది. ఆ రికార్డును పాన్ మక్తా వేలం అధిగమించింది. జూన్ 2026న అదే సర్వే నెంబర్ లో మరో 5.09 ఎకరాల ప్లాట్ వేలంలో ఎకరం రూ. 204 కోట్లకు అమ్ముడుపోయింది. అంతకుముందు అక్టోబర్ 2025న రాయదుర్గంలోనే నిర్వహించిన ఓ వేలంలో ఎకరం ధర రూ.177 కోట్లు పలికింది. వరుసగా జరుగుతున్న వేలాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది.

రాయదుర్గం ప్రాంతం మైండ్ స్పేస్, నాలెడ్జ్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు అత్యంత సమీపంలో ఉండటం. కీలకమైన వ్యాపార కారిడార్లలో పెద్ద విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు చాలా తక్కువగా అందుబాటులో ఉండటం, బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు భారీ సంస్థలు ముందుకు రావడం, టవర్ల నిర్మాణాలకు అనుమతులు వంటివి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి.

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్, నాలెడ్జ్ సిటీ, కోకాపేట ప్రాంతాల్లో గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వ వేలాల్లో భూముల ధరలు నిరంతరం రికార్డులను తిరగరాస్తున్నాయి. టీజీఐఐసీ నిర్వహించిన రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలంలో నమోదైన తాజా రికార్డు ధరతో హైదరాబాద్‌ భూముల ధరల వ్యవహారం దేశ రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనంగా మారింది.