సామాన్యులను నగరం మధ్య నుంచి నిషేధిస్తున్నారు. సామాన్యులే కాదు, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కూడా ఊరు బయటకు ఎక్కడో దూరంగా వెళ్లి నివాసాలు చూసుకోవలసిన దుస్థితి తలెత్తుతున్నది. గతంలో అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఇళ్ల నిర్మాణం జరిగేది. హౌసింగ్ బోర్డు ఆ పని చేసేది. చిన్నవి, మధ్య తరగతివి, ఎగువ మధ్య తరగతివి ఇళ్లు నిర్మించేవారు. కొన్నేళ్ల నుంచి హౌసింగ్ బోర్డును చంపేసి భూములను సంపన్న వర్గాలకు అమ్ముకోవడం మొదలుపెట్టారు. అన్ని ప్రభుత్వాలదీ అదే పని.
సైబరాబాద్ సంపన్నులకు మాత్రమే రిజర్వు చేయబడుతున్నది. ధరల రిగ్గింగు అడ్డూ అదుపు లేకుండా జరిగిపోతున్నది. సైబరాబాద్ రిచ్ అండ్ ఫేమస్ వర్గాల నగరంగా రూపాంతరం చెందుతున్నది. ప్రభుత్వ భూములన్నీ హరించుకుపోతున్నాయి. ఒకప్పుడు ఎకరా స్థలంలో లక్ష చదరపు అడుగుల నిర్మాణం మాత్రమే జరిగేది. ఇప్పుడు ఎనిమిది లక్షలు, పది లక్షలు చదరపు అడుగులు కడుతున్నారు. అయినా ధరలు మాత్రం ధనిక వర్గాలు మాత్రమే కొనగలిగే విధంగా పెడుతున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇండిపెండెంట్ ఇండ్లు అయితే ఎకరాకు 8, లేక 24 మంది మనుషులు, అపార్టుమెంట్లు అయితే ఎకరాకు సుమారు 24 ఫ్లాట్స్ లేక 99 మంది మనుషులు జీవించడం ఆరోగ్యకరం. భారత జాతీయ భవన నిర్మాణ నియమావళి(ఎన్‌బీసీఐ) ప్రకారం హెక్టారు విస్తీర్ణంలో 150 నుంచి 350 మంది, ఎకరా విస్తీర్ణంలో 60 నుంచి 150 మంది వరకు నివసించే విధంగా నిర్మాణాలు జరగాలి. అంతేకాదు ప్రతిమనిషికి నాలుగు చదరపు మీటర్ల ఓపెన్ ప్లేస్-పార్కులు, ఆటస్థలాలు, ఇతర ప్రజోపయోగ స్థలాలు ఉండాలని కూడా ఎన్‌బీసీ మార్గదర్శకాలు. ఈ ప్రమాణాల ప్రాతిపదికగా చూస్తే నగరంలో ఎన్ని ఆకాశహర్మ్యాలు జీవన యోగ్యంగా ఉన్నాయో అర్థం అవుతుంది. దేశంలో భూ వైశాల్యం, నిర్మించాల్సిన భవన విస్తీర్ణం నిష్ఫత్తి(ఎఫ్ఏఆర్)ని పాటించని మహానగరాలు -హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరిలే. వరుస ప్రభుత్వాలు నగరాన్ని కాంక్రీటు మహారణ్యంగా మార్చేస్తున్నాయి.
ఇంకా విషాదం ఏమంటే ఈ ఆకాశ హర్మ్యాలమధ్య ఒక్కటంటే ఒక్క పార్కు లేదు. చెట్టు చేమ లేవు. వేలంలో కొన్న బిల్డర్లు ఎంత భూమి కొంటె అంత భూమికి సెల్లార్లు తవ్వి, ఆ పైన అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. భవనాల ముందువైపు 4.5 మీటర్లు మిగిలిన మూడు వైపులా మూడేసి మీటర్లు వదిలి సెల్లార్లు తవ్వాలి. ఊపిరి తీసుకునేంత స్థలం, అందరికీ ప్రాణవాయువు ఇవ్వగలిగిన చెట్లు ఏవీ అక్కడ కనిపించవు. మహా అయితే అందమైన క్రోటన్లు పెట్టి అదే పచ్చదనం అని చూపెడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ నగరాలు ఢిల్లీ మాదిరిగా మరో గ్యాస్ ఛాంబర్ గా మారబోతు న్నాయి. పౌర సమాజం ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్ తరాలకు నగరంలో ఇంచు భూమి కూడా మిగలదు. ప్రజల ఆస్తులను తెగనమ్ముతూ, ప్రజలను నగర బహిష్కృతులను చేసే ఈ దుర్మార్గపు విధానాలకు అడ్డుకట్ట పడాలి.
హైలైట్స్:
- కట్టా శేఖర్‌రెడ్డి ఫేస్‌బుక్ నుంచి తీసుకున్న వ్యాసం.