హైలైట్స్:
- గతేడాది జూన్, జులై లో 2.9 లక్షల రిజిస్ట్రేషన్లు
- ఈ ఏడాది జూన్, జూలై లో 2.55 లక్షలు మాత్రమే
- ఆదాయం రూ.2,200 నుంచి రూ.2,600 కు పెరుగుదల
విధాత, హైదరాబాద్:
తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్ పక్కాగా ఉందని లీగల్ ఒపీనియన్ ఇచ్చిన తరువాత, హైడ్రా కార్యాలయంలో రూఢీ చేసుకున్న తరువాతే ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు లే అవుట్లలో కూడా అంతగా ఇళ్ల స్థలాలు విక్రయం కావడం లేదని రియల్టర్లు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ, భూముల విలువలు సవరించడం మూలంగా గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 20 శాతం పెరగడం ఊరటనిచ్చే అంశం. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత తొలిసారి 2026 జూన్ 5 నుంచి సవరించిన భూముల విలువలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సవరణ తరువాత ఎక్కువగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి అత్యధికంగా ఆదాయం సమకూరింది.
గతేడాది జూన్ జూన్ 5వ తేదీ నుంచి జూలై నెలాఖరు వరకు 2.9 లక్షల రిజిస్ట్రేషన్లు కాగా రూ.2,200 కోట్ల ఆదాయం తెలంగాణ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విభాగం ఖాతాలో చేరాయి. గతేడాది జరిగిన రిజిస్ట్రేషన్లతో పోల్చితే ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి జూలై నెలాఖరు వరకు 2.55 లక్షల రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదు అయ్యాయి. అంటే సుమారు 35 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఆదాయ పరంగా గత సంవత్సరంతో పోల్చితే 20 శాతం పెరుగుదల కన్పించడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నది. ఈ పరిస్థితిని పరిశీలిస్తే తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది అనేదానికి ఉదాహారణ అని పలువురు రియల్ వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల మౌలిక సదుపాయాల కల్పన ను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి, ఫ్యూచర్ సిటీ పేరుతో చేస్తున్న ఆర్బాటం, టీడీఆర్ ను కఠినతరం చేయడం వంటి పనుల మూలంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయ్యిందనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఫ్యూచర్ సిటీ అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మూలంగా నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలలో కొనుగోలు దారులు గతంలో మాదిరి ముందుకు రావడం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దేశంలో ఎక్కువగా ఉపాధి కల్పించే రంగాలలో ఒకటిగా రియల్ రంగం ఒకటిగా ఉంది. హైదరాబాద్ లో నాలుగు లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్, 3 కోట్ల చదరపు అడుగుల రెసిడెన్షియల్ స్పేస్ ఖాళీగా పడి ఉంది. నిర్మాణం చేసిన వాటిని విక్రయించుకోలేక, సిబ్బందికి వేతనాలు చెల్లించలేక పలు సంస్థల యాజమాన్యాలు నానా పాట్లు పడుతున్నాయి. తెచ్చిన అప్పులపై భారం పెరగడం తప్ప, ఫ్లాట్లు అమ్ముడుపోవడం లేదని రియల్ వ్యాపారులు నిట్టూర్చుతున్నారు. దీనికి తోడు ఇరాన్ అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా విదేశీ మారకద్రవ్యం తగ్గుముఖం పట్టింది. క్రూడాయిల్ ధరలు పెరగడం మూలంగా ముడిసరకుల ధరలు కూడా పెరిగాయి. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం జూన్ 5వ తేదీ నుంచి భూముల విలువలు సవరించడం మూలంగా రిజిస్ట్రేషన్ చార్జీలు తడిసి మోపెడు అవుతున్నాయి. భూముల మార్కెట్ విలువలు సవరించిన తరువాత లావాదేవీలు పరిశీలిస్తే తగ్గుముఖం పట్టాయనే దానిపై ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు బిల్డర్ల పరిస్థితి ఉండగా, ప్రభుత్వం మాత్రం రిజిస్ట్రేషన్లు తగ్గినా, ఆదాయం పెరిగిందనే ధీమాతో ఉంది.