• Telugu News
  • /States

ఎల్‌నినోపై యుద్ధానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

ఎల్‌నినో ప్రభావం వల్ల తెలంగాణలో ఏర్పడే సవాళ్లను ముందుగానే అంచనా వేసి, వివిధ శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు రాష్ట్ర స్థాయి సమగ్ర కార్యాచరణ నివేదికను నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు. రైతులకు నష్టం తగ్గించేలా నీటి వినియోగంలో పొదుపు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, నాణ్యమైన విత్తనాల అందుబాటు, పశుగ్రాస భద్రత, ఉద్యాన పంటల విస్తరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు వంటి అంశాలకు నివేదికలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Reported by: Jagan Mohan Talluri | రాష్ట్రాలు | Edited by: విధాత తెలంగాణ డెస్క్ | Jul 30, 2026, 7:50 pm IST
Read Time: 8 mins
ఎల్‌నినోపై యుద్ధానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

హైలైట్స్:

  • నిపుణుల కమిటీ కీలక సిఫారసులు
  • కార్యాచరణ కోసం రూ.802.92 కోట్ల నిధులు
  • సీఎం రేవంత్‌రెడ్డికి చిన్నారెడ్డి సమగ్ర నివేదిక

విధాత, హైదరాబాద్:

ఎల్‌నినో ప్రభావం వల్ల తెలంగాణలో ఏర్పడే సవాళ్లను ముందుగానే అంచనా వేసి, వివిధ శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు రాష్ట్ర స్థాయి సమగ్ర కార్యాచరణ నివేదికను నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు. రైతులకు నష్టం తగ్గించేలా నీటి వినియోగంలో పొదుపు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, నాణ్యమైన విత్తనాల అందుబాటు, పశుగ్రాస భద్రత, ఉద్యాన పంటల విస్తరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు వంటి అంశాలకు నివేదికలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. గురువారం జూబ్లీహిల్స్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం బోధి సెంటర్ లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నివేదికను చిన్నారెడ్డి అందజేశారు. అనంతరం సచివాలయం మీడియా సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ నివేదికలో తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల కార్యాచరణ ప్రణాళికలతో పాటు రైతుల జీవనోపాధి పరిరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, పశుగ్రాస భద్రత, గ్రామీణ ఉపాధి కల్పన వంటి అంశాలపై సమగ్ర సిఫార్సులు చేశామని తెలిపారు.

రాష్ట్రంలో సాధారణ నైరుతి రుతుపవనాల వర్షపాతం 740.60 మిల్లీమీటర్లు కాగా, జూలై 27 నాటికి 234.80 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదై, సాధారణంతో పోలిస్తే సుమారు 30 శాతం లోటు నమోదైనట్లు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో పాటు భూగర్భ జలమట్టం కూడా గణనీయంగా పడిపోయినట్లు నివేదికలో వివరించామన్నారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గినందున, నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలకు బదులుగా కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, నూనెగింజలు, కూరగాయలు, పశుగ్రాస పంటలు వంటి ప్రత్యామ్నాయ పంటలను గ్రామాల వారీ కార్యాచరణ ప్రణాళికతో విస్తృతంగా ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను 75 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందించాలని సిఫార్సు చేయడం జరిగిందన్నారు. వరి సాగును నీటి లభ్యత ఆధారంగా పరిమితం చేయడంతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని, బ్రాడ్ బెడ్ అండ్ ఫరో, రిడ్జ్ అండ్ ఫరో, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, ఫార్మ్ పాండ్లు, భూగర్భ జలాల రీఛార్జ్ వంటి నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని నివేదిక సూచించామని ఆయన వెల్లడించారు. తక్కువ వ్యవధి కూరగాయల సాగు, ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, పట్టుపరిశ్రమ ఆధారిత సాగును ప్రోత్సహించాలని, డ్రిప్ ఇరిగేషన్, శాశ్వత పందిళ్లు, షేడ్‌నెట్ హౌస్‌లు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు సబ్సిడీలు అందించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జలాశయాల్లోని నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత కల్పించాలని తమ నివేదిక లో స్పష్టం చేసినట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు.

"వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గినందున, నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలకు బదులుగా కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, నూనెగింజలు, కూరగాయలు, పశుగ్రాస పంటలు వంటి ప్రత్యామ్నాయ పంటలను గ్రామాల వారీ కార్యాచరణ ప్రణాళికతో విస్తృతంగా ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను 75 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందించాలని సిఫార్సు చేశాం."

- జీ చిన్నారెడ్డి

అదేవిధంగా, సేంద్రియ ఎరువులు, జీవ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు, పంటలు, తాగునీరు, పశుగ్రాసం, విద్యుత్ సరఫరా, ప్రజారోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినట్టు చిన్నారెడ్డి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అవసరమైతే మార్కెట్ జోక్యంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాదించిన ఈ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తక్షణమే అమలు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి, రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రత, పశుగ్రాస లభ్యత, గ్రామీణ ఉపాధి పరిరక్షణతో పాటు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత స్థిరంగా నిలబెట్టవచ్చని నివేదికలో సూచించడం జరిగిందన్నారు. కార్యాచరణ ప్రణాళిక అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరమవుతాయని నివేదికలో అంచనా వేసినట్లు చిన్నారెడ్డి తెలిపారు.

"రాష్ట్రంలో సాధారణ నైరుతి రుతుపవనాల వర్షపాతం 740.60 మిల్లీమీటర్లు కాగా, జూలై 27 నాటికి 234.80 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదై, సాధారణంతో పోలిస్తే సుమారు 30 శాతం లోటు నమోదైంది. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో పాటు భూగర్భ జలమట్టం కూడా గణనీయంగా పడిపోయింది."

- జీ చిన్నారెడ్డి