నిధుల సమీకరణే లక్ష్యం..మరోసారి భారీగా భూముల వేలం!

హైదరాబాద్‌లో రూ.3,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా హెచ్‌ఎండీఏకి భారీ భూముల వేలానికి సిద్ధమైంది. కోకాపేట్‌ నియోపొలిస్‌లో ఎకరాకు రూ.120 కోట్ల కనీస ధర ఖరారు చేసింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 12, 2026, 2:54 pm IST
Read Time: 9 mins
నిధుల సమీకరణే లక్ష్యం..మరోసారి భారీగా భూముల వేలం!

భూముల విక్రయాల ద్వారా రూ.3000కోట్ల ఆదాయం సమీకరించడమే ధ్యేయంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)మరొసారి భారీ ఈ-వేలానికి సిద్దమైంది. ప్రస్తుతం జేబీఎస్‌–శామీర్‌పేట్, జేబీఎస్‌–డెయిరీ ఫామ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌లతో పాటు, రేడియల్‌ రోడ్లు, మెట్రో మొదటి దశ స్వాదీనానికి నిధుల సేకరణలో భాగంగా ఈ భూములను విక్రయించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ధఫా అత్యంత ఖరీదైన కోకాపేట్‌లోని నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలో ఉన్న విలువైన భూములతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్లాట్లను విక్రయించడానికి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల కోకాపేట్‌లో ఎకరానికి రూ.150 కోట్ల వరకు ధర రావడంతో ప్రస్తుతం కోకాపేట్‌లోని నియోపొలిస్, గోల్డ్‌మైల్‌ లే అవుట్‌లలోని భూములపై అధికారులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

నియోపొలిస్‌లో ఎకరానికి రూ.120 కోట్లు, గోల్డ్‌మైల్‌లో రూ.70 కోట్ల చొప్పున కనీస ధర నిర్ణయించారు.

గత డిసెంబర్ 2025లో నిర్వహించిన నియోపోలిస్ భూముల వేలంలో ఎకరానికి అత్యధికంగా రూ. 131 కోట్లు, రూ. 118 కోట్ల వరకు ధర పలికి హెచ్‌ఎండీఏకి సుమారు రూ. 1000 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు వివిధ దశల్లో చేపట్టిన వేలం పాటల ద్వారా సుమారు రూ. 3,708 కోట్లు వచ్చాయి. గతంలో నమోదైన రికార్డు ధరలను ప్రాతిపదికగా తీసుకుంటూ.. ప్రస్తుతం నియోపోలిస్ లేఅవుట్‌లోని 4.59 ఎకరాల భూభాగానికి కనీస ధరగా ఎకరానికి రూ. 120 కోట్లుగా నిర్ణయించారు. అలాగే గోల్డెన్ మైల్ లేఅవుట్‌లోని 0.70 ఎకరాల భూమికి ఎకరానికి రూ. 70 కోట్ల ప్రారంభ ధరను నిర్ణయించారు. నియోపొలిస్‌లోని 239, 240 సర్వే నంబర్లలో ప్రస్తుతం 4.59 ఎకరాలు అమ్మకానికి సిద్ధంగా ఉంది. అలాగే గోల్డ్‌మైల్‌లో 0.70 ఎకరాలను విక్రయించనున్నారు. ఈ లే అవుట్‌లలోని భూములకు ఈ నెల 25న ప్రీబిడ్డింగ్‌ సమావేశం నిర్వహించి సెప్టెంబర్‌ 9వ తేదీన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ నిర్వహించనున్నారు. బిడ్డింగ్‌లో పాల్గొనేవారు సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఈ వేలం ప్రక్రియ మొత్తం ఆగస్టు 24న ప్రారంభమై సెప్టెంబర్ 9 వరకు కొనసాగనుంది.

మోకిలాలో 35 ప్లాట్లు

కోకాపేట్ మాత్రమే కాకుండా నగర శివారులలో ఉన్న పలు రెసిడెన్షియల్ లేఅవుట్లలో కూడా భూములను హెచ్‌ఎండీఏ అమ్మకానికి ఉంచింది. కూకట్‌పల్లి సమీపంలోని హైదరాబాద్ నగర్, మోకిలా, బాచుపల్లి, కొత్తూర్ సమీపంలోని ఇన్ముల్‌నర్వ లేఅవుట్లతో పాటు బైరాగిగూడ, చందానగర్, సూరారం, కాప్రా, కిష్టారెడ్డిపేట్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను వేలంలో విక్రయించనున్నారు. మోకిలాలో 35 ప్లాట్లను విక్రయించేందుకు సెప్టెంబర్‌ 2వ తేదీన వేలం నిర్వహించనున్నారు. ఈ నెల 19న ప్రీబిడ్డింగ్‌ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కనిష్టంగా 300 చ.గజాల నుంచి గరిష్టంగా 500 చ.గ.ల వరకు విస్తీర్ణం కలిగిన ప్లాట్లు వీటిల్లో ఉన్నాయి. గతంలో గజం రూ.లక్షకు పైగా ధర పలికిన దృష్ట్యా ఈసారి అంతకంటే ఎక్కువ మొత్తంలోనే డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతంగజానికి రూ.55 వేల చొప్పున కనీస ధరను నిర్ణయించారు.

బాచుపల్లిలో కూడా..

బాచుపల్లిలో గతంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. దీంతో మరోసారి ఈ స్థలాలను వేలం వేయాలని నిర్ణయించారు. కనిష్టంగా 266 గజాల నుంచి గరిష్టంగా 499 గజాల వరకు మొత్తం 35 ప్లాట్లు ఉన్నాయి. ఈ స్థలాలకు రూ.45 వేల కనీస ధర నిర్ణయించారు. మోకిలా, బాచుపల్లి ప్లాట్లకు సెప్టెంబర్‌ 2వ తేదీన బిడ్డింగ్‌ నిర్వహించనున్నారు.

అలాగే సూరారంలో ఉన్న 2,420 చదరపు గజాల ల్యాండ్ పార్సెల్‌కు గజానికి రూ. 75 వేలు, మరో 4,840 చదరపు గజాల ప్లాట్‌కు గజానికి రూ. 55, వేలు అప్‌సెట్ ధరగా ఖరారు చేశారు. క్లియర్ టైటిల్స్ ఉన్న ఈ ప్రభుత్వ భూముల విక్రయానికి బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, ఫరూక్‌నగర్‌ మండలాల్లో ఉన్న ఇన్ముల్‌ నెర్వా హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో 60 ప్లాట్లను విక్రయించనున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేవిధంగా ఇక్కడ గజానికి రూ.15 వేల చొప్పున కనీస ధరను నిర్ణయించారు. కనిష్టంగా 152 గజాల నుంచి గరిష్టంగా 300 గజాల విస్తీర్ణం వరకు ప్లాట్లు ఉన్నాయి. సెప్టెంబర్‌ 3వ తేదీన బిడ్డింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ప్లాట్లకు ఈ నెల 22న ప్రీబిడ్డింగ్‌ ఉంటుందని అధికారులు తెలిపారు. కొనుగోలుదారులు సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

సరూర్‌నగర్‌, హైదర్ నగర్ సహా అక్కడ కూడా…

సరూర్‌నగర్‌లోని 4,355 గజాల స్థలానికి సెప్టెంబర్‌ 7వ తేదీన బిడ్డింగ్‌ ఉంటుంది. ఈ నెల 25న ప్రీబిడ్డింగ్‌ నిర్వహించనున్నారు. హెచ్‌ఎండీఏకు చెందిన ఈ స్థలం వ్యాపార, వాణిజ్య వర్గాలను, నిర్మాణ సంస్థలను ఆకట్టుకునే విధంగా ఉండడంతో గజానికి రూ.1,50,000 చొప్పున కనీస ధరను నిర్ణయించారు. అలాగే హైదర్‌నగర్‌లో మరో 3,454 గజాల స్థలాన్ని విక్రయించనున్నారు. ఇక్కడ గజానికి రూ.95 వేల చొప్పున కనీస ధర నిర్ణయించారు. ఈ స్థలాలతో పాటు గండిపేట్‌లోని బైరాగిగూడ (2,420 గజాలు), చందానగర్‌ (484 గజాలు), నార్సింగి (2,420 గజాలు), సూరారం (4,840 గజాలు) కాప్రా (484 గజాలు), అమీన్‌పూర్‌ ( 1,452 గజాలు)లోని భూ విభాగాలకు ఈ నెల 24న బిడ్డింగ్‌ నిర్వహించనున్నారు.