Bachupally Flyover | హైదరాబాద్ : ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న బాచుపల్లి ఫ్లై ఓవర్( Bachupally Flyover )ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. జూన్ 8వ తేదీన ఈ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) జాతికి అంకితం చేసే అవకాశం ఉందని హెచ్ఎండీఏ( HMDA ) చీఫ్ ఇంజినీర్ బీ రవీందర్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( CMC ) ఏర్పడిన తర్వాత ప్రారంభమవుతున్న తొలి ఫ్లై ఓవర్ ఇదే.
ఇరు వైపులా రాకపోకలు సాగించేందుకు మొత్తం ఆరు లేన్లతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. 1.3 కిలోమీటర్ల మేర రూ. 141 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. అయితే ఈ ఫ్లై ఓవర్‌కు 2022లో నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బాచుపల్లి ఎక్స్ రోడ్స్ వద్ద పునాది రాయి వేశారు. 2024 నాటికి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉండే. కానీ వివిధ కారణాల వల్ల నిర్మాణ పనుల్లో ఆలస్యమైంది. మొత్తానికి నాలుగేండ్ల తర్వాత ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తుంది.
వేలాది మంది ఐటీ ఉద్యోగులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..
బాచుపల్లి ఫ్లై ఓవర్ పూర్తయి ప్రారంభానికి సిద్ధమవడంతో వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. గండి మైసమ్మ, గాజులరామారం, బాచుపల్లి, నిజాంపేట్ నుంచి మియాపూర్, కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, మదీనాగూడ, గచ్చిబౌలి వైపు వెళ్లే ఐటీ ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఎంతో మేలు కలగనుంది.
గతంలో 20 నిమిషాలు.. ఇప్పుడు 5 నిమిషాలే..
మియాపూర్ – నిజాంపేట్ – బాచుపల్లి స్ట్రెచ్‌ను దాటేందుకు గతంలో 20 నిమిషాలకు పైగా పట్టేది. ఒక వేళ వర్షం వస్తే చాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయేవారు. కానీ ఇప్పుడు ఫ్లై ఓవర్ సిద్ధం కావడంతో.. 5 నుంచి 10 నిమిషాల్లో ఈ స్ట్రెచ్‌ను దాటి తమ గమ్యస్థానాలకు వీలైనంత త్వరగా చేరుకోవచ్చు.