ఈ నెల 20నుంచి జరుగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిజినెస్ లిస్ట్‌ను లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటితో ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులను కూడా ఆమోదించుకునేందుకు జాబితా చేసింది.
అయితే గత సమావేశాలలో వీగిపోయిన 130వ , 131వ రాజ్యాంగ సవరణ బిల్లులు..మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లులు పార్లమెంట్ సభ్యులకు పంపిణీ చేసిన ప్రాథమిక అజెండాలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీటిని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC)లో చర్చించి నిర్ణయం తీసుకుంటారా, లేదా నేరుగా సభలో ప్రవేశపెడతారా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
సమావేశాల నిర్వహణలో భాగంగా ఎంపీల కోసం లోక్‌సభ సచివాలయం కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. సభలోకి స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాల వంటి నిఘా పరికరాలను అనుమతించరు. అలాగే, పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, రాజకీయ నిరసనలకు పూర్తి నిషేధం విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ 13వ తేదీతో ఈ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.
పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు..
కేంద్రం ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులో 1)ఆదాయపు పన్ను (సవరణ) బిల్లు–2026. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకురానున్నారు.
2) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య (సవరణ) బిల్లు–2026. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను భర్తీ చేసే బిల్లు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచేందుకు చట్ట సవరణ చేయనుంది.3)జనన–మరణాల నమోదు (సవరణ) బిల్లు–2026. జనన, మరణాల నమోదు చట్టంలో మార్పులు చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 4)జాతీయ గౌరవానికి అవమానం నివారణ (సవరణ) బిల్లు–2026. దీంతో జాతీయ గౌరవానికి సంబంధించిన చట్టంలో సవరణలు ప్రతిపాదించనున్నారు. జాతీయ గీతం ‘‘వందేమాతరం’’ ఆలాపనను అవమానించడం లేదా అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇందు కోసం 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టూ నేషనల్ హానర్ యాక్ట్‌లో సవరణ చేయనుంది
5)సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు–2026. దీంతో ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించిన చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. 6) విదేశీ విరాళాల నియంత్రణ (సవరణ) బిల్లు–2026. ఈ బిల్లును 2026 మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ఇప్పుడు సమావేశాల్లో పరిశీలనకు తీసుకురానున్నారు. 7)వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు–2025. 2025 డిసెంబర్ 15న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపగా, ఇప్పుడు తదుపరి చర్చకు ప్రభుత్వం తీసుకురానుంది. తీవ్రమైన నేరాభియోగాలతో వరుసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటూ బెయిల్ రాకపోతే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు తమ పదవులు కోల్పోయేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఈసారి కీలకం కానుంది.
బిల్లుల ఆమోదానికి ఏకాభిప్రాయం కోసం రంగంలోకి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
గత సమావేశాల్లో వీగిపోయిన 130వ , 131వ రాజ్యాంగ సవరణ బిల్లులు..మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లులను ఈ వర్షాకాల సమావేశాల్లో ఆమోదింపచేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఎన్డీయేలోని వివిధ పక్షాల నేతలతో శుక్రవారం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో భేటీ అయ్యారు. మరోవైపు రాజ్యాంగ సవరణ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన సమావేశంలో కాంగ్రెస్ తీర్మానించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇండియా కూటమి సమావేశం సోమవారం జరుగుతుంది.
ఆమోదానికే కేంద్రం పట్టు..కాంగ్రెస్ ససేమిరా?
లోక్‌సభ సీట్లను 2011 జనాభా లెక్కల ఆధారంగానే పెంచడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ నాయకత్వం పనిచేస్తోంది. 2/3వ వంతు ఆధిక్యత లేకపోవడంతో బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు వీగిపోవడం అధికారపక్షానికి ఇబ్బందికరంగా పరిణమించింది. అయితే ఇటీవల అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్ సభ, రాజ్యసభలలో ఎన్డీఏ బలం పెరిగిపోవడం కేంద్రానికి కలిసి వచ్చింది. తృణమూల్‌కు చెందిన 28 మంది లోక్‌సభ సభ్యుల్లో 20 మంది వేరుకుంపటి పెట్టుకొని అధికారపక్షానికి మద్దతు పలికారు. ఇండియా కూటమితో డీఎంకే తెగదెంపులు చేసుకుంది. ఈ పరిణామాలు కేంద్రానికి సానుకూలంగా మారాయి. ఇదివరకు డీలిమిటేషన్ బిల్లులో సీట్లపెంపు ప్రతిపాదన ఉన్నా దానికి ప్రాతిపదికతను అందులో పెట్టలేదు. ఈసారి అలాకాకుండా.. రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్లను 50% మేర పెంచుతామని, దానివల్ల లోక్‌సభలో ప్రాతినిధ్య నిష్పత్తి యథాతథంగా కొనసాగుతుందని భరోసా ఇవ్వడం ద్వారా రాజ్యంగ సవరణ బిల్లుల ఆమోదానికి కేంద్రం కసరత్తు చేస్తుండటం ఆసక్తికరం.