మళ్లీ డీలిమిటేషన్..మహిళా రిజర్వేషన్ బిల్లు !

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్రం మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

మళ్లీ డీలిమిటేషన్..మహిళా రిజర్వేషన్ బిల్లు !

పార్లమెంటు గత సమావేశాల్లో వీగిపోయిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇక అటకెక్కిపోయిందనుకున్న అంచనాలను తారుమారు చేస్తూ..కేంద్రం మరోసారి ఆ బిల్లుల ఆమోదం కోసం చకచకా పావులు కదుపుతుంది. జూన్ రెండో వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సీట్ల పెంపు, డీలిమిటేషన్(నియోజకవర్గాల పునర్విభజన), 33శాతం మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులను తిరిగి ప్రవేశ పెట్టి ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తుంది. గతంలో ఆయా బిల్లుల ఓటింగ్ సందర్బంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాల మేరకు బిల్లులో పలు సవరణలు చేసి మరోసారి పార్లమెంటులో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది.

ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనకు తెరదించుతూ.. కేంద్రం ప్రతిపక్షాలకు హామీ ఇచ్చిన విధంగా లోక్ సభ, శాసన సభల సీట్లను 50శాతం పెంచేలా క్లాజులను బిల్లులో చేర్చి అందరి ఆమోదంతో బిల్లులను గట్టేక్కించాలని కేంద్రం భావిస్తుందని సమాచారం. బిల్లులలో మార్పులు, చేర్పులకు సంబంధించి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నోట్ సిద్దం చేసి, ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే కేబినెట్ సమావేశంలో ఆమోదం తీసుకోవాలని కేంద్రం యోచిస్తుంది. బిల్లులను పార్లమెంటులో తిరిగి ప్రవేశపెట్టే ముందే ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి మూడింటి రెండొంతుల మెజార్టీ సాధించాలని కేంద్రం తెరవెనుక మంత్రాంగం సాగిస్తుంది. ఇందుకు ఎన్డీఏ భాగస్వామ్య నేతలను కూడా పురమాయించడం గమనార్హం.

సజీవంగానే ఆశావహుల ఆశలు

గత పార్లమెంటు సమావేశాల్లో వీగిపోయిన లోక్ సభ, శాసనసభల సీట్ల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులను తిరిగి పార్లమెంటులో ప్రవేశ పెట్టనుండటంతో ఆశావహుల్లో మళ్లీ నూతనోత్సాహం వ్యక్తం అవుతుంది. సీట్లు పెరిగితే పోటీ చేయాలనుకున్న నేతలకు, వారి వారసులకు, అలాగే మహిళా రిజర్వేషన్ల స్థానాలలో పోటీపై ఆశలు పెట్టుకున్న మహిళా నాయకురాలులకు.. మరోసారి ఆయా బిల్లులు పార్లమెంటు ముందుకు రానుండటం, వారిలో మళ్లీ కదనోత్సాహాన్ని రగిలిస్తుంది. బిల్లులు ఆమోదం పొందితే..రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాల ఏర్పాటు ఎలా ఉండబోతుందీ..ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నదానిపై ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటుండటం విశేషం.

కేంద్ర – రాష్ట్రాల కేబినెట్ లలో భారీ మార్పులు?

రానున్న రోజుల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గాలలో భారీగా మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయన్న సమాచారం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవ్వనున్న నేపథ్యంలో కేబినెట్ లో మార్పులు, చేర్పులతో ప్రభుత్వ పనితీరుకు కొత్త శక్తిని, నూతనోత్సాహాన్ని అందించాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది.

ముఖ్యంగా 33శాతం మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రస్తుత మంత్రివర్గంలో మహిళా మంత్రులకు స్థానం కల్పించాలని మోదీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో మహిళలకు ముందెన్నడు లేని స్థాయిలో మంత్రి పదవులు దక్కబోతున్నాయన్న ప్రచారం బీజేపీ పరివార్ లో వినిపిస్తుంది. అదే సమయంలో నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను, కొడుకు ఫోక్సో కేసుతో చిక్కుల్లో పడ్డ బండి సంజయ్ లతో సహా పనితీరు సక్రమంగా లేని మంత్రులను దాదాపుగా 25మందికి పైగా తప్పించవచ్చని తెలుస్తుంది. సామాజిక, రాజకీయ సమీకరణలు, భవిష్యత్తు రాజకీయ అవసరాలు, రాష్ట్రాల ప్రాతినిధ్యం కోణంలో మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించవచ్చని సమాచారం. బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ తో సహా ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డా వంటి వారికి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

రేవంత్ మంత్రివర్గంలోనూ మార్పులు

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోనున్న క్రమంలో మంత్రివర్గ విస్తరణ, లేదా పునర్ వ్యవస్థీకరణకు కసరత్తు కొనసాగుతుంది. ప్రస్తుత మంత్రులలో పనితీరు సక్రమంగా లేని..సీఎం మాట లెక్క చేయని సీనియర్లను మంత్రివర్గం నుంచి తప్పించడం, లేక శాఖలలో మార్పులు చేస్తారని తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు పూర్తి చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం వినిపిస్తుంది.

రాష్ట్ర కేబినెట్ లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆ జిల్లాలకు ప్రాతినిథ్యంపై కల్పించే అవకాశం ఉంది. సామాజిక, రాజకీయ, జిల్లాల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సీఎం రేవంత్ రెడ్డి కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ , ఎమ్మెల్సీ విజయశాంతి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, బోధన్‌ ఎమ్మెల్యే మాజీ మంత్రి పీ. సుదర్శన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే తమ్మన్నగారి రాంమోహన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌ లు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా కోటా నుంచి మల్ రెడ్డి, రంగారెడ్డి, రాంమోహన్ రెడ్డిలు తాజాగా ఢిల్లీకి వెళ్లి మరి మంత్రి పదవుల కోసం లాబియింగ్ చేయడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టబోయే మంత్రివర్గ మార్పులు చేర్పులలో భాగంగా ఏ మంత్రుల పదవులు ఉంటాయో…ఎవరికి  కొత్తగా అమాత్య  యోగం దక్కనుందో త్వరలో తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి :

కీలక మలుపులో తమిళ రాజకీయం.. రేపోమాపో విస్తరణ.. అన్నాడీఎంకేకు చీలిక వర్గానికి నో ప్లేస్‌?
ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ స్థాయి సంస్థలు : సీఎం రేవంత్ రెడ్డి