దత్తపుత్రుడు జగన్ తెర తొలగింది : వైఎస్. షర్మిల
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీఏకు మద్దతిచ్చిన జగన్ బీజేపీ దత్తపుత్రుడని వైఎస్ షర్మిల విమర్శించారు. మహిళా బిల్లు పేరుతో రాజకీయ లబ్ధి కోసం కుట్ర జరిగిందన్నారు.
అమరావతి : లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లులపై ఎన్డీఏకు మద్దతుగా నిలబడిన వైసీపీ పార్టీ అధినేత, వైఎస్.జగన్ బీజేపీతో పెట్టుకున్న అక్రమ పొత్తు తేటతెల్లమైందని, విపక్షం ముసుగులో ఉన్న వైసీపీ సైతం ఆర్ఎస్ఎస్ పక్షమేనని నిజ నిర్ధారణ జరిగిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల మండిపడ్డారు. ఎంత అవసరాలు ఉన్నా..టీడీపీ, జనసేనల కంటే మోదీని ఇంతలా మోయాలా? అని, మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా ? అని జగన్ ను షర్మిల ప్రశ్నించారు. అక్రమ డీ లిమిటేషన్ బిల్లులపై ఎన్డీఏ పక్షాన నిలబడ్డందుకు బీజేపీ దత్తపుత్రుడు జగన్ మోహన్ రెడ్డి సిగ్గుపడాలి అన్నారు. మీ ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాలా? అని, కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? బీజేపీ బిల్లులకు గొర్రెలా గుడ్డిగా తలాడించాలా ? మోదీ మెప్పుకోసం సొంత కాకిలెక్కలు అల్లాలా? అని నిలదీశారు. ఇదేనా మీరు చెప్పే వైఎస్సార్ ఆశయాలు, వారసత్వం ? అని ప్రశ్నించారు. ఆ మహానేత వైఎస్సార్ సిద్ధాంతాలను మంట గలిపినందుకు..విలువలకు తూట్లు పొడిచినందుకు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి అని డిమాండ్ చేశారు.
జగన్ తీరుతో వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తుంది..
రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లును విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే.. ఏం సాధించారని ప్రశ్నించడం తీవ్ర హాస్యాస్పదం అని షర్మిల మండిపడ్డారు. దొంగ బిల్లులకు ఓటేసి ఇంతకు మీరేం సాధించారు? అని, కోట్లాది ఏపీ రాష్ట్ర ప్రజల గుండెలు గాయపరచడమా మీరు సాధించిన గొప్పతనం అని షర్మిల ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల భావోద్వేగాన్ని అర్థం చేసుకోకపోవడమా మీ రాజకీయం ? అని నిలదీశారు. ప్రతిపక్షంగా విపక్షానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? అని, జగన్ చేసిన నీచపు పనికి వైఎస్సార్ ఆత్మ నిజంగా ఘోషిస్తోంది అని షర్మిల వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును, డీ లిమిటేషన్ కి లింక్ పెట్టడం జగన్ అవివేకానికి నిదర్శనం అన్నారు. న్యాయం జరగలేదని, సాకారం కాలేదని మీరే అంటున్నారా లేక మోదీ మీచేత కూడా చెప్పించారా ? అని ప్రశ్నించారు. మహిళల 33 శాతం రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాదు అని, అవనికి అగ్రతాంబూలం అందిస్తుంటే అభ్యంతరం ఎవరికి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్యత ఒక్కటేనని రుజువైందన్నారు.
వ్యతిరేకం మహిళా బిల్లుకు కాదు..డీలిమిటేషన్ కు మాత్రమే
మహిళా బిల్లు పాస్ అయ్యింది 2023 లోనే అని గుర్తు చేశారు. రాజకీయ లబ్ది కోసం పెట్టిన డీ లిమిటేషన్ బిల్లును మాత్రమే కాంగ్రెస్ అడ్డుకుందని, నియోజకవర్గాల పునర్విభజనపై, మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ స్టాండ్ క్రిస్టల్ క్లియర్ గా ఉందని తెలిపారు. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలి అని, కులగణన ద్వారా SC, ST, OBC ల సంఖ్య తేలాలని, కులాల ఆధారంగా డీ లిమిటేషన్ లో రిజర్వేషన్లు పాటించాలని, వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రస్తుత 543 స్థానాలకు తక్షణం మహిళా రిజర్వేషన్లను పాటించాలని, చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకొని సమ్మతమైన పరిష్కారం చూపాలని, అధికారిక గణాంకాలు లేకుండా 50 శాతం పెంచి …దేశాన్ని ఉద్ధరిస్తున్నామని బీజేపీ చెప్తే గుడ్డిగా జగన్ సైతం నమ్మడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు- జగన్ – పవన్ అని షర్మిల విమర్శించారు. మూడు పార్టీలు మోదీ మెప్పుకోరే పార్టీలేనని, ఏపీలో ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం చారిత్రాక తప్పిదం : జయప్రకాశ్ నారాయణ్
డీలిమిటేషన్ బిల్లు వెనుక బీజేపీ కుట్ర: ఎంపీ ప్రియాంక గాంధీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram