డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం చారిత్రాక తప్పిదం : జయప్రకాశ్ నారాయణ్
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం చారిత్రక తప్పిదమని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు భవిష్యత్తులో భారీ రాజకీయ నష్టం చవిచూడవచ్చని హెచ్చరించారు.
మహిళా రిజర్వేషన్ తో ముడిపడిన డీలిమిటేషన్ 131 రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని అని ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకుడు, మాజీ ఐఏఎస్, లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. జనాభా సంఖ్యతో నిమిత్తం లేకుండా స్పష్టంగా ఇన్ని సీట్లు పెంచుతామని చెప్పి బంగారం లాంటి వరమిస్తే కాలదనుకున్నారని, ఇందుకు ప్రతిపక్షాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో ఒక చారిత్రాత్మక తప్పిదమని ఆయన పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకే నష్టం అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల రాజకీయాలకు దక్షిణాది రాష్ట్రాలు బలైపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిజానికి డీలిమిటేషన్ తో బీజేపీకి రాజకీయంగా పెద్దగా లాభం ఉండబోదని, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టులేదు అని గుర్తు చేశారు. ఓటరుకు, ప్రతినిధికి మధ్య సమతుల్యత ఉండాలని, డీలిమిటేషన్ దీనికి అత్యంత అవసరమని ఆయన వాదించారు.
2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ నిర్వహిస్తే…దక్షిణాది రాష్ట్రాలలో లోక్ సభ సీట్లు తగ్గుతాయి అని జేపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 25 నుంచి 20కి తెలంగాణలో 17 నుంచి 14 ఎంపీ సీట్లు తగ్గుతాయని, కర్ణాటకలో 28 నుంచి 26 కి, తమిళనాడులో 39 నుంచి 29కి, కేరళలో 20 నుంచి 13కి ఎంపీ సీట్లు, ఒరిస్సా 21నుంచి 17, పశ్చిమ బెంగాల్ 42నుంచి 38 కు తగ్గుతాయని, ఏడు రాష్ట్రాలు కలిపి మొత్తం 35ఎంపీ సీట్లు కోల్పోతాయని వెల్లడించారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఉత్తరాది రాష్ట్రాలు రేపు డిమాండ్ చేస్తే..అప్పుడు దక్షిణాది రాష్ట్రాల నాయకత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. జనాభా మేరకు డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు 35సీట్లు కోల్పోతే.. ఉత్తరాది నాలుగు రాష్ట్రాలలో 34సీట్లు పెరుగుతాయని చెప్పారు. రాజ్యాంగ సవరణ చేయకపోతే రాజ్యాంగం మేరకు జనాభా లెక్కల మేరకు డీలిమిటేషన్ తప్పదని, అప్పుడు దక్షిణాదికి అన్యాయం తప్పదని జేపీ తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి :
డీలిమిటేషన్ బిల్లు వెనుక బీజేపీ కుట్ర: ఎంపీ ప్రియాంక గాంధీ
భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోదీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram