రేవంత్ సర్కార్ తో కమ్యూనిస్టులకు చెడిందా..?

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులను అవమానిస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం తప్పదని హెచ్చరించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 07, 2026, 12:55 pm IST
Read Time: 6 mins
రేవంత్ సర్కార్ తో కమ్యూనిస్టులకు చెడిందా..?

కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పార్టీకి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయా అన్న చర్చ తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. సీఎంరేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తాజాగా చేసిన సంచ‌లన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న చర్చను రగిలించాయి. పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించిన కూనంనేని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైన, కాంగ్రెస్ పార్టీపైన పదునైన వ్యాఖ్యలతో విరుచుక పడ్డారు.

మొక్క కదా అని పీకేస్తే..పీక కొస్తాం : కాంగ్రెస్ కు కూనంనేని స్ట్రాంగ్ వార్నింగ్

మిత్రపక్షంగా మేము స్నేహ ధర్మం పాటిస్తుంటే.. అవమానాలు ఎదురవుతున్నాయని..స్నేహ ధర్మానికి కట్టుబడి ఉన్నామని, అయితే మమ్మల్ని అవమానిస్తే ఊరుకోబోమని మిత్రపక్షం కాంగ్రెస్ కు కూనంనేని స్పష్టం చేశారు. కమ్యూనిష్టులను అవమానిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే మీకు పడుతుందని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీరు మమ్మల్ని వీడితే మిమ్మల్ని కాపాడే వాడే ఉండరు. మీ పతనానికి శిలాఫలకాన్ని మీరు రాసుకున్నట్లేనని.. మీ శివపేటికను మీరే తయారు చేసుకున్నట్టేనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలోనికి రానివ్వకూడదనే మీకు మద్దతు ఇచ్చాం అన్నారు.
కమ్యూనిస్టులతో ఏమవుతుందని.. మొక్కే కదా అని పీకేస్తే పోలా అనుకుంటే.. పీక కోస్తాం అని, కమ్యూనిస్టులు పదిమంది ఉన్నారనుకుంటే.. ఆ పదిమంది మీ సంగతి తేలుస్తారు అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదుఅని, పినిపాకలో పోటీ చేయాల్సి వస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నాం అని మిత్రపక్షం కాంగ్రెస్ కు కూనంనేని తేల్చి చెప్పారు.

విస్తరణ ప్రయత్నాలతోనే చిచ్చు..

సీపీఐ పార్టీకి పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలపై అసహనంతోనే కూనంనేని సాంబశివరావు ఆ పార్టీపై మండిపడినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు సీపీఐ భవిష్యత్తులో పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జోక్యం పెరిగిపోతుందని కూనంనేని ఆగ్రహంతో ఉన్నారని ఆ జిల్లా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టిలు కమ్యూనిస్టులను బలహీనపరిచే రాజకీయాలకు పాల్పడుతున్నారని..అందుకే కాంగ్రెస్ కు కూనంనేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. అదిగాక ప్రభుత్వం నుంచి కూడా తాము కోరిన పనుల మంజూరీ, నిధుల విడుదల జరుగడంలేదన్న అసహనం కూడా మిత్రపక్షంపై కమ్యూనిష్టుల ఆగ్రహానికి కారణమైనట్లుగా తెలుస్తుంది.