రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో కృష్ణానది తీరాన ఈ నెల 10నాగార్జున సాగర్ డ్యామ్ తీరంలోని విజయ్ విహార్ లో వరుణ యాగం నిర్వహించనున్నట్లుగా యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండి చైర్మన్ ఎం.ఎస్.ఎన్ రెడ్డి వెల్లడించారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, నిర్ణయించిన ముహూర్తం ప్రకారం యాగ క్రతువులు నిర్వహిస్తారు. యాదగిరిగుట్ట దేవస్థాన ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు మరియు అర్చక బృందం సమక్షంలో మహా వరుణయాగం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు చేస్తారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో ఈ వరుణ యాగం నిర్వహించబడుతుంది . సాయంత్రం జరిగే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.
క్షుద్ర పూజలకు..వరుణ యాగంతో కౌంటర్ ?
తెలంగాణలో వర్షాలు పడవద్దని, కరువు రావాలని, ప్రభుత్వం అస్థిరతకు గురవ్వాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత హరీశ్ రావు క్షుద్ర పూజలు చేయించారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం..తాజాగా వరుణ యాగానికి సిద్ద పడటం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వాళ్లు వానలు పడొద్దని పూజలు చేస్తే.తాము సమృద్దిగా వానలు పడాలని పూజలు చేస్తామన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వరుణ యాగానికి సిద్దపడినట్లుగా కనిపిస్తుంది.
క్షుద్ర పూజలతో వానలు ఆగుడు..యజ్ఞ, యాగాలకు వానాలు పడటం నిజంగా జరుగుతుందో లేదోగాని ఆశ్చర్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ రెండు కూడా ఆ మార్గాలనే ఎంచుకున్న తీరు విస్మయం రేపుతుంది. హేతువాదులు మాత్రం ఇవేమి రాజకీయాలు అన్న అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అధికార,ప్రతిపక్షాల మధ్య సాగుతున్న రాజకీయ పోరు..చివరకు పోటాపోటీ పూజల స్థాయికి చేరగా..ఈ వ్యవహారం ఇప్పుడు గ్రామాలలో రచ్చబండ చర్చల స్థాయికి చేరడం ఆసక్తికరం.