పెద్దపులి మరణంపై విచారణకు ఆదేశం : పవన్ కల్యాణ్

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో పెద్దపులి మృతిపై పూర్తి స్థాయి విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. సహజ మరణమా, వేటగాళ్ల ప్రమేయమా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Aug 01, 2026, 4:37 pm IST
Read Time: 5 mins
పెద్దపులి మరణంపై విచారణకు ఆదేశం : పవన్ కల్యాణ్

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టీ.ఆర్.) పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పెద్ద పులి మరణించిన ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.

పులి మరణం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయడానికి సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరపాలని ఎన్.ఎస్.టీ.ఆర్. ఫీల్డ్ డైరెక్టర్‌ను ఆదేశించానని, అది సహజ మరణమా? లేక వేటగాళ్ల దుశ్చర్య, విషప్రయోగం వంటి మానవ ప్రమేయం ఏదైనా ఉందా? అనే కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని స్పష్టం చేసినట్లుగా వెల్లడించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించాల్సి ఉందన్నారు.

ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యం. అలాంటిది ఒక పులి ప్రాణం కోల్పోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. మన అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోందని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను తక్షణమే పెంచాలని, క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అటవీ సంపదను, ఇక్కడి జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడం మనందరి కర్తవ్యం. కూటమి ప్రభుత్వం అడవుల పరిరక్షణకు, వన్యప్రాణి రక్షణకు కట్టుబడి ఉంది. ఈ ఘటనలో ఎవరిదైనా తప్పు ఉన్నట్లు తేలితే చట్టప్రకారం అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని పవన్ స్పష్టం చేశారు.

పులి కాలి కాళ్లు, గోళ్ల మాయం

మార్కాపురం జిల్లా గుండ్లకమ్మ అటవీక్షేత్ర పరిధిలోని తెట్టమడుగు లో ఓ పెద్దపులి మృతిచెందింది. శ్రీశైలం వైల్డ్‌లైఫ్‌ వెటర్నరీ అధికారులు పులి కళేబరాన్ని పరిశీలించి ఎలా చనిపోయిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు.కణితి, జింకల కోసం వేటగాళ్లు చిన్నపాటి గుంతల్లో ఉన్న నీటి నిల్వల్లో యూరియా కలిపి ఉంచారు. ఆ నీటిని తాగి పులి చనిపోయిందా.. అన్న కోణంలో విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.మృతిచెందిన పులి కాళ్లు నరికి ఉండటం, కాళ్ల గోళ్లు లేకపోవడంతో, వేటగాళ్ల ప్రమేయముందా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కళేబరాన్ని పరిశీలిస్తే 10 రోజుల క్రితమే మృతి చెందినట్లు ఆనవాళ్లు కన్పిస్తున్నాయి.సాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో ఇటీవల 4 పులులు వివిధ కారణాలతో మృతి చెందడం అటవీ అధికారులకు సవాల్ గా తయారైంది.