గోదావరిలో వరద ఉదృతి.. ధవళేశ్వరం గేట్లు ఎత్తివేత

ఎగువ రాష్ట్రాల వర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ కాగా, ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 01, 2026, 3:38 pm IST
Read Time: 4 mins
గోదావరిలో వరద ఉదృతి.. ధవళేశ్వరం గేట్లు ఎత్తివేత

ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులలో వరద ప్రవాహం పెరిగి ప్రాజెక్టులు తమ పూర్తి స్థాయి నీటి మట్టాలకు చేరుతున్నాయి. గోదావరిలో పెరిగిన వరద ఉదృతి కారణంగా తెలంగాణలో ప్రాజెక్టులన్ని నిండిపోవడంతో గేట్లు తెరిచిద దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులోకి 40,380 క్యూసెక్కుల వరద రావడంతో పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకుగాను, ప్రస్తుత నీటిమట్టం 1071.20 అడుగులకు చేరింది. నీటినిల్వ సామర్థ్యం 80.5టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 25.353టీఎంసీలుగా కొనసాగుతుంది.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగిపోయి 55.3 అడుగులకు చేరింది. అధికారులు మూడవ ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతితో భద్రాచలంలోని పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులకు గోదావరి వరద జోరు పెరిగింది. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీని గోదావరి వరద ముంచెత్తింది. కూనవరం మండలం వడ్డుగూడెం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతుంది. గోదావరి వరదతో పోలవరం ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నీటి ప్రవాహం పెరుగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.40 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటివరకు 9.38 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేశారు.

జూరాలకు కొనసాగుతున్న వరద!

జూరాలకు ఎగువ నుంచి వరద ఉదృతి కొనసాగుతుండటంతో 24 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 1.38 లక్షల క్యూసెక్కులను.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 34 వేల క్యూసెక్కుల వరదలు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా..1.77 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదు అవుతుంది. జూరాల నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 834.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 54.34 టీఎంసీలుగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.