స్వర్ణాంధ్ర విజన్ లో కీలక ముందడుగు భోగాపురం ఎయిర్ పోర్టు : ప్రధాని మోదీ

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఇది స్వర్ణాంధ్ర విజన్‌కు కీలక ముందడుగని పేర్కొంటూ రూ.18 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Aug 01, 2026, 3:28 pm IST
Read Time: 13 mins
స్వర్ణాంధ్ర విజన్ లో కీలక ముందడుగు భోగాపురం ఎయిర్ పోర్టు : ప్రధాని మోదీ

ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ లో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం కీలక ముందడుగు అని ప్రధాని మోదీ అభివర్ణించారు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ.18వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు.

పవిత్రమైన సింహాచలం అప్పన్న, పైడి తల్లి అమ్మవారు కొలువైన ఉత్తరాంధ్రకు రావడం నా అదృష్టం అని, ఇవాళ రెండు రికార్డులు సృష్టించామని ఒకటి ఎయిర్ పోర్టు అయితే రెండొది ఒకేసారి 13 వేల మంది గిరిజనులు థింసా నృత్యం చేయడం అన్నారు. ఇది సీఎం చంద్రబాబు విజన్‍కు సాక్ష్యం అన్నారు. థింసా నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించిందన్నారు. ప్రాజెక్టులు, రహదారులు, ఎయిర్ పోర్టులు ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంపొందిస్తాయని, అభివృద్దికి బాటలు వేస్తాయని అన్నారు. గతంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించినా ఒక్క కుటుంబం పేర్లే ఉండేవని,మేం అయోధ్యలో ఎయిర్‌పోర్టుకు వాల్మీకి పేరు, పంజాబ్‌లో సంత్‌ రవిదాస్‌ పేరు పెట్టాం అని, భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాం అని, ఆదివాసీల హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారని గుర్తు చేశారు. అల్లూరి ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్ వేగా, ఆంధ్రా యువత ఉజ్వల భవిష్యత్తుకు కొత్త లాంచ్‌పాడ్‌లా పనిచేస్తుందన్నారు.

కోస్టల్ ఎకనామిక్ కారిడర్ గా ఏపీ

గడిచిన పన్నేండేళ్లుగా దేశంలో విమానయాన రంగం అసాధారణమైన పురోగతిని సాధించిందని 2014 వరకు దేశంలో 74 ఎయిర్ పోర్టులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 166 కు పెరిగిందన్నారు. కేంద్రం ఉడాన్ పథకాలు ద్వారా అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. విమానం ఎక్కాలన్న పేద, మధ్యతరగతి కలలు సాకారం చేశాం. తమ ప్రాంతం నుంచే విమానం ఎక్కేలా కొత్త అనుభూతి తీసుకొస్తున్నామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది రెంట్టింపు వేగంతో దూసుకుపోతుందన్నారు. ఈ ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడర్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రాధాన పారిశ్రామిక కారిడర్లతో అనుసంధానం చేస్తున్నామన్నారు. పీఎం గతిశక్తితో రైల్, పోర్టు, ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. సాఫ్ట్ వేర్, ఐటీ, టెక్ రంగాల్లో ఏపీ యువత దూసుకుపోతున్నారని, ప్రతిభగల యువతకు అనేక అవకాశాలు అందిస్తున్నామన్నారు. విశాఖలో సెమీ కండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని ఏపీలో గ్రోత్ ఎకో సిస్టమ్ ని నిర్మించబోతున్నామన్నారు.

చంద్రబాబు సారథ్యంలో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‍గా ఏపీ మారుతోందన్నారు. ప్రపంచంలో అనేక ప్రముఖ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఏపీలో గ్రోత్‌ ఎకో సిస్టం నిర్మిస్తున్నాం. సెమీకండక్టర్‌, డేటా సెంటర్‌ రంగాల్లో వేగంగా పనులు జరుగుతున్నాయి. కేంద్రం నక్కపల్లిలో భారీ ఫార్మా కంపెనీ నిర్మిస్తోంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే డబుల్‌ స్పీడ్‌తో ఏపీ అభివృద్ధిఅని మోదీ తెలిపారు.

ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది : సీఎం చంద్రబాబు

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది పలికిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భోగాపురం విమానాశ్రయంతో ఈ ప్రాంతం దశ, దిశ మారతాయి అని, వేలాది ఉద్యోగాలు వస్తాయని, ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గి ఇతర ప్రాంతాల నుంచే ఇక్కడికి వచ్చే రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు గూగుల్‌, స్టీల్‌ కంపెనీతో పాటు చాలా సంస్థలు వచ్చాయి. వైసీపీ పాలనలో రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని చూశాం అని, కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్‌ ఇచ్చిన వ్యక్తి మోదీ అని, పోలవరం, రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడిన వ్యక్తి మోదీ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని అమరావతికి నిధులు ఇచ్చి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. గడచిన రెండేళ్లలో ప్రధాని మోడీ నాయకత్వంలో ఉత్తరాంధ్రలో 150కి పైగా ప్రాజెక్టులు ప్రారంభించామని, ఇవి పూర్తయితే 3 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. రూ.2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు. అలాగే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టుతో పాటు రాజధాని అమరావతి మొదటి విడత పనులను పూర్తి చేసి ప్రధాని మోడీ చేతుల మీదుగానే ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.

2047 విజన్ మోదీతోనే సాధ్యం

ప్రధాని మోదీ .. 12 ఏళ్లుగా దేశాన్ని సమర్థంగా నడిపిస్తున్నారని, ఈ దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పరిపాలనలో అవినీతి ఆరోపణలు లేకుండా ముందుకెళ్తున్నారని, రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నారని, సౌరశక్తి, గ్రీన్‌ హైడ్రోజన్‌ ద్వారా కాలుష్యం తగ్గిస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో తీవ్రవాదం, నక్సలిజం లేకుండా అరికట్టారని, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉంటోంది. ఇలాంటి నేతలను నా రాజకీయ జీవితంలో చూడలేదు. ప్రతి విషయంలో నేషన్ ఫస్ట్‌ .. అనే ప్రధానిని తొలిసారి చూస్తున్నానని, ప్రపంచ దేశాల్లో ప్రధాని మోడీ వంటి నాయకుడు లేరని, అందుకే ఆయనను రోల్ మోడల్ గా తీసుకుని రాష్ట్రాభివృద్దిలో ముందడుగు వేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లేకుంటే 2047 విజన్ సాధ్యం కాదని, మోదీ నాయకత్వంలో భారత్ 2047లోగా ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా మారుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

దేశానికి మోదీ నాయకత్వమే శ్రీరామ రక్ష: పవన్ కల్యాణ్

దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీని ఇటీవలఅనకూడని మాటలు అంటున్నారని, ఆ మాటలు వింటుంటే నాకు దుఃఖం వేస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం కష్టపడేవారికి ఇదేనా మనం ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. జంతర్ మంతర్ వద్ద తనను తిట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించిన వ్యక్తి మోడీ అని.. ఇది చూశాక మోడీ పాదాలకు నమస్కారం చేస్తున్నానన్నారు. నేటి యువతకు తల్లిదండ్రులు సరైన సంస్కారం నేర్పించాలన్నారు. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిందని సెలవు తీసుకోకుండా పని చేస్తున్న ప్రధానికి మనం ఏం ఇవ్వగలం అన్నారు. పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నట్లు పని చేస్తున్న మోడీనే విమర్శిస్తున్నారని అన్నారు.

నరేంద్ర మోడీ స్వయంగా తనంతట తానే అధికారం వద్దు అని అనుకుంటే వదలాలి తప్పా అప్పటి వరకు దేశ పరిపాలన పగ్గాలు మీ చేతుల్లోనే ఉండాలని అందుకు మేమంతా కృషి చేస్తామన్నారు. మోడీని మించిన నాయకుడు మరొకరు లేరన్నారు. మోడీ ఈ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారని, దేశాన్ని ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తున్న నేత మోడీ అని 140 మంది ప్రజల ఆకాంక్షలను మోడీ సాకారం చేస్తున్నారని చెప్పారు. కూటమి ఏర్పాటు కోసం నేను చాలా తపన పడ్డానని, దేశం కోసం పని చేస్తున్న వ్యక్తికి అండగా నిలబడితే ఏం జరుగుతుందో భోగాపురం ఎయిర్ పోర్టే నిదర్శనం అన్నారు. తెలుగు జాతి ఎవరికీ తలవంచదని అల్లూరి సీతారామరాజు గర్జించారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్ పోర్ట్ ఏపీ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం అని పవన్ పేర్కొన్నారు.