భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం

భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన సర్వీసులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి తొలుత స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రాత్రి ఇక్కడి నుంచి సింగపూర్‌ బయల్దేరింది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో 6E 6408 తొలి విమానం ఇక్కడ ల్యాండ్ అవ్వగా, అధికారులు ఘనస్వాగతం పలికారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Aug 17, 2026, 11:21 am IST
Read Time: 3 mins
భోగాపురం  ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం

భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన సర్వీసులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి తొలుత స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రాత్రి ఇక్కడి నుంచి సింగపూర్‌ బయల్దేరింది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో 6E 6408 తొలి విమానం ఇక్కడ ల్యాండ్ అవ్వగా, అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికగా అందించారు. ఉదయం 7.30 గంటలకు ఈ విమానం తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ బయల్దేరింది. అనంతరం ఉదయం 8గంటలకు బెంగళూరుకు, 8.20కి ఢిల్లీకి, 8.50కి హైదరాబాద్‌కు సర్వీసులు బయలుదేరాయి. విశాఖ నుంచి భోగాపురం రావడానికి 20 విద్యుత్తు బస్సులను ఏర్పాటు చేశారు.

విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను అందజేశారు. భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలకు సర్వీసులు తిరగనున్నాయి. ఇండిగో, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ లాంటి దేశీయ విమాన సర్వీసులతోపాటు ఎయిర్‌ ఇండియా, స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా సింగపూర్‌కు, ఇండిగో ద్వారా అబుధాబికి కూడా వెళ్లే అవకాశం ఉంది. సోమవారం 31 సర్వీసులు రాకపోకలు సాగించనుండగా వీటిద్వారా సుమారు తొలిరోజు 6-7వేల మంది ప్రయాణించనున్నారు.