అమరావతి : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మొత్తంగా 10,060 పోస్టులతో 2026 జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 81ను జారీ చేసింది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్- 1లో 149 పోస్టులు, గ్రూప్- 2లో 673 ఉద్యోగాలు, విద్యాశాఖలో 2,995 పోస్టుల (టీచర్ పోస్టులు సహా)తో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశు సంవర్ధక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
మొత్తం నాలుగు దశల్లో 10వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయగా.. తొలి దశలో 1,523 పోస్టులకు ఉన్నత విద్యాశాఖ ద్వారా మే 15నే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ ప్రారంభించారు. రెండో దశలో 3,231 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇస్తారు. దీనికింద గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు, పోలీస్, అటవీ, పశుసంవర్ధక తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మూడో దశలో 2,311 పోస్టులకు అక్టోబరు 15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో భాగంగా గ్రూప్-2, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తారు. నాలుగో దశలో 2,995 పోస్టులకు అక్టోబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో టీచర్ పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారు.