ఏపీలో ఓ వైపు భోగాపురం ఎయిర్ పోర్టులో విమాన సర్వీసుల రాకపోకలు ప్రారంభంతో సంబరాల వాతావారణం నెలకొనగా..ఇంకోవైపు విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు తాత్కాలిక విరామం ప్రకటించడంతో అక్కడి సిబ్బందిలో ఆందోళనల వ్యక్తమైన భిన్న పరిస్థితులు ఆవిష్కృతమయ్యి. ఆదివారం అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు రద్దు చేయగా, చివరి విమానం రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. తర్వాత రెగ్యులర్ ఆపరేషన్స్ నిలిపివేశారు. ఇకపై ఈ విమానాశ్రయం పూర్తిగా భారత నావికాదళం ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. సాధారణ వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయినప్పటికీ.. సైనిక విమానాలు, ప్రభుత్వ అతిథులు, లీజ్డ్, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు ప్రత్యేక, అత్యవసర ల్యాండింగ్‌లకు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది.
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చివరి విమానం బయలుదేరిన సందర్బంగా ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న సిబ్బంది, ఇన్నాళ్లుగా సేవలందించిన కార్మికులు.. విశాఖ ఎయిర్ పోర్టుతో ఇన్నాళ్ల తమ అనుబంధాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విశాఖ ఎయిర్ పోర్టు ఉద్యోగులు ఇకమీదట తమ ఉద్యోగాల పరిస్థితి, తమ కుటుంబాల భవిష్యత్తు ఏమిటన్న దానిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఃవిశాఖ విమానాశ్రయానికి 80 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇన్నాళ్లుగా తమ పట్టణానికి తలమానికంగా నిలిచిన ఎయిర్ పోర్టు సేవలు నిలిపివేయడాన్ని కొందరు నగరవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో తొలి పౌర విమాన రాకపోకలు (సివిల్ ఆపరేషన్స్) 1954లో ప్రారంభం కాగా నాడు రాకపోకలకు చాలా తక్కువగా అనుమతులిచ్చారు. పూర్తిస్థాయి వాణిజ్య విమాన సర్వీసులు 1981లో మొదలయ్యాయి. అప్పటి నుంచి పూర్తి సివిల్ ఎయిర్‌పోర్టుగా ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. వ్యూహాత్మక భద్రతా కారణాలతో 1986లో భారత నావికాదళం చేతిలోకి ఈ ఎయిర్‌పోర్ట్ వెళ్లింది. 1991లో దీనికి ‘ఐఎన్‌ఎస్ డేగ’ అని నామకరణం చేశారు. అప్పటి నుంచి నేవీ నియంత్రణలో ఉంటూ పౌర విమాన సర్వీసులు నడుపుతున్నారు. 2007 జూన్ 15నుంచి బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ320 వంటి భారీ వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. 2009 ఫిబ్రవరి 20న సరికొత్త ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు.
2012లో ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్‌ఎస్) రాత్రివేళల్లో విమానాలు దిగే సాంకేతికత (నైట్ ల్యాండింగ్ అందుబాటులోకి వచ్చింది. అదే సంవత్సరం ఎయిర్ ఇండియా సింగపూర్‌కు మొట్టమొదటి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభించడంతో విశాఖ గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్‌లో నిలిచింది. ఇప్పుడు కొత్తగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కావాడంతో విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి షెడ్యూల్ విమాన సర్వీస్ లను నిలిపివేస్తున్నట్లుగా పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి VTZ కోడ్‌తో సహా అన్ని పౌర విమాన సర్వీసులు భోగాపురం మానాశ్రయానికి బదిలీ అయ్యాయి. ఇకమీదట భోగాపురం నుంచే పూర్తిస్థాయి పౌర విమాన రాకపోకలు కొనసాగనున్నాయి.
విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు తాత్కాలిక విరామం
ఈ అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు రద్దు
ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న సిబ్బంది, ఇన్నాళ్లుగా సేవలందించిన కార్మికుల్లో భావోద్వేగం
రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి వెళ్లే చివరి విమానం బయలుదేరనుంది. pic.twitter.com/5fWJGK1p0u
— Telugu Feed (@Telugufeedsite) August 17, 2026