“సర్” ప్రక్రియపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

" సర్(SIR)" ప్రక్రియతో బీజేపీ పార్టీ వ్యతిరేక ఓటర్లను తొలగించే కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంబర్‌పేటలో గెలిచే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ వారు కొన్ని ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.. కొత్త కథలు అల్లే ఆలోచనలో ఉన్నారని, బీజేపీ వ్యూహాల పట్ల గులాబీ సైనికులు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

“సర్” ప్రక్రియపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ : ” సర్(SIR)” ప్రక్రియతో బీజేపీ పార్టీ వ్యతిరేక ఓటర్లను తొలగించే కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంబర్‌పేటలో గెలిచే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ వారు కొన్ని ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.. కొత్త కథలు అల్లే ఆలోచనలో ఉన్నారని, బీజేపీ వ్యూహాల పట్ల గులాబీ సైనికులు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అంబర్‌పేటలో జరిగిన పార్టీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. సర్ ప్రక్రియలో జూలై 24 నుండి సెప్టెంబర్ 28వరకు ఆభ్యంతరాలు ఏమైనా ఉంటే రాతపూర్వకంగా తెలియజేయడానికి సమయం ఉంటుందని, అక్టోబర్ 1వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదలవుతుందని, అదే ఓటర్ల జాబితా రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు, ఆ తర్వాత జరిగే ఎమ్మెల్యే ఎన్నికలకు, ఎంపీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని గుర్తు చేశారు.

ఉచిత విద్యుత్తు రద్దు కోసమే కాంగ్రెస్ మోటార్లకు మీటర్లు

ఉచిత విద్యుత్తు రద్దు కోసమే కాంగ్రెస్ మోటార్లకు మీటర్లను పెడుతుంది అని, రాష్ట్రంలో ఉన్న ఉచిత విద్యుత్తును ఎగ్గొట్టి, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడని కేటీఆర్ ఆరోపించారు. నాడు మోదీ ఎంత ఒత్తిడి చేసినా , రూ. 30 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపినా..కేసీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు అని, కానీ రేవంత్ రెడ్డి.. మోదీ తానా అంటే తందానా అంటున్నాడని, ఇక ఈ కాంగ్రెస్ ఫ్యూజులు పీకాల్సిందేనని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి, పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తేసే కుట్ర చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుందని ఆనాడే హెచ్చరించాం అని, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయని, ఈ మేరకు నిన్న క్యాబినెట్‌లో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో, వ్యవసాయానికి ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ కరెంటు కుట్రలను ప్రజలు వ్యతిరేకించాలని కోరారు.

కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బలమైన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడుగడుగునా అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్‌కి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో సగం పూర్తయినా ఇప్పటిదాకా ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతి పైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.

సభ్యత్వ నమోదు అనంతరం శిక్షణ కార్యక్రమాలు..

త్వరలోనే సభ్యత్వ నమోదుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని కేటీఆర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది పార్టీ కార్యకర్తలకు ఈ శిక్షణ ఇస్తాము. దీనితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల పైన, అన్యాయాల పైన, ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న తీరు పైన కూడా అవగాహన కల్పిస్తాము అన్నారు. ఈసారి సభ్యత్వం పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ముందుగా సభ్యత్వ నమోదు, తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని కేటీఆర్ తెలిపారు.

సర్వే ఆధారంగానే టికెట్లు

హైదరాబాద్ నగర పరిధిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యల పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేసిన వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. కేవలం గెలుపే లక్ష్యంగా సర్వేల ఆధారంగా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు అవకాశం ఇస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల కాలంలో చేసిన అన్యాయాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రెండున్నర సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టని రేవంత్ రెడ్డి, అడ్డగోలుగా ‘హైడ్రా’ పేరుతో వేల ఇండ్లు కూలగొట్టారు అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్ల నిర్మాణం చేస్తే, కాంగ్రెస్ మాత్రం వేల ఇండ్లు కూలగొట్టింది అన్నారు.

ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి అడ్డగోలు మాటలు

ఉన్న నగరాన్ని పట్టించుకునే శక్తి లేదు కానీ, ‘ఫ్యూచర్ సిటీ’ అంటూ అడ్డగోలు మాటలు చెప్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఉన్న నగరాన్ని పట్టించుకోవడం చేతగాని ముఖ్యమంత్రి, ఫ్యూచర్ సిటీ పేరుతో పోజులు కొడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఉన్న హైదరాబాద్ నగరంలో కనీసం మోరి తీసి చెత్త ఎత్తే పరిస్థితిలో కూడా లేని మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ అంటే ఎవరూ నమ్మరన్నారు. ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతా అంటే పట్టించుకునేది ఎవరు అని ప్రశ్నించారు.

మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల దోపిడీకి ప్లాన్

మరోవైపు హైదరాబాద్ నగరంలో మూసీని ప్రక్షాళన చేస్తా అంటున్న ముఖ్యమంత్రి ఆలోచన పైన, ప్రణాళికల పైన కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలోనే సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు కట్టి, దాదాపుగా పూర్తయిన మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు. ఆల్రెడీ ముగిసిపోయిన మూసీ ప్రక్షాళన పైన రేవంత్ రెడ్డి కేవలం కాంట్రాక్ట్ కమిషన్ల కోసమే మాట్లాడుతున్నారు అన్నారు.

ఎలాంటి విధ్వంసం లేకుండా, ఎలాంటి ఇండ్ల తొలగింపు లేకుండా మూసీ ప్రక్షాళన చేయాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం వేలాది మంది ఇండ్లు కూలగొట్టి, మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షలాది మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం మూసీ పైన ఎస్టీపీల (STP) నిర్మాణము, బ్రిడ్జిల నిర్మాణము వంటివన్నీ ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు మళ్లీ లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన పేరుతో నాటకాలు ఎందుకు అని ప్రశ్నించారు.