అంత్యక్రియల్లో ఆధిపత్య ‘రాజకీయమా’!? మృతుడు శంకర్ గౌడ్ కుటుంబం అవస్థలు

ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ అంత్యక్రియల సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆధిపత్య పోరుకు దిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కడపటి చూపులకు ఇంటి ముందు శవాన్ని పెట్టుకున్న కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టేలా వీరి వ్యవహారం సాగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • By: TAAZ |    telangana |    Published on : Apr 24, 2026 7:50 PM IST
అంత్యక్రియల్లో ఆధిపత్య ‘రాజకీయమా’!? మృతుడు శంకర్ గౌడ్ కుటుంబం అవస్థలు
  • పట్టువిడుపులు విస్మరించిన రాజకీయ నేతలు
  • రాజకీయ పక్షాల తీరు పై స్థానికుల విమర్శలు
  • ఆఖరికి అగ్నిపరీక్షగా మారిన అంత్యక్రియలు
  • అడ్డుకోవడంలో పోలీసులకు తప్పని ఇబ్బందులు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

ఆర్టీసీ సమ్మె… రెండున్నర దశాబ్దాలుగా డ్రైవర్‌గా పనిచేసే కోలా శంకర్ గౌడ్ (56) అనే కార్మికుని నిండు ప్రాణం బలితీసుకున్నది. ఆయనపైన్నే ఆధారపడిన ఆ కుటుంబం హక్కుల సాధనలో దిక్కులేనిదైంది. ఈ స్థితిలో అంత్యక్రియలకు హాజరైన రాజకీయ నాయకులు ఆయన కుటుంబానికి అండగా నిలువాల్సిన పరిస్థితిల్లో, తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడారనే అభిప్రాయం వ్యక్తమైంది. శంకర్ గౌడ్ ఆవేశంలో ఆత్మార్పరణం చేసుకున్నప్పటికీ, అందరి కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ కుటుంబానికి న్యాయం జరిగేందుకు ప్రయత్నించడం అస్సలు తప్పుకాదు. ఈ క్రమంలో కార్మిక సంఘాల కంటే రాజకీయ నేతలు తమ ఆధిపత్యం కోసం పట్టుబట్టడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కుటుంబం, ఆర్టీసీ కార్మికుల కంటే, అక్కడికి వచ్చిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు స్థానిక పోలీసులు వారించినా, పరిస్థితిని పదేపదే వివరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఖాతరు చేయకుండా డిపోకు తరలించాల్సిందేనంటూ భీష్మించుకుని కూర్చోవడం పట్ల స్థానికులు విమర్శించారు. పోలీసులు, కార్మిక, రాజకీయవర్గాల తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా కొందరునాయకులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

సానుభూతా? రాజకీయమా?

నిజంగానే ఈ రాజకీయ పక్షనేతలకు శంకర్ గౌడ్ కుటుంబం పై, ఆర్టీసీ కార్మికులపై ప్రేమ ఉందా? తమ రాజకీయ ఆధిపత్యం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించారా? అనే చర్చకు తావిచ్చారు. ఉదయం బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రయత్నం చేస్తే, తామేమి తక్కువా అంటూ బీజేపీ నాయకులు ప్రయత్నించారని స్థానికులు విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ మృతదేహాన్ని నర్సంపేటకు తరలించి తీరుతామంటూ ప్రకటించి, ప్రయత్నించడంపట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నర్సంపేటకు తరలిస్తే పెద్ద సంఖ్యలో వచ్చే జనాన్ని, పార్టీ వర్గాలను ఎవరు కట్టడిచేస్తారని పోలీసులు పరిస్థితిని వివరిస్తూ నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముత్తోజిపేటలో హైటెన్షన్ నెలకొంది.

ఉద్రిక్త పరిస్థితుల్లో మృతదేహం తరలిస్తే…?

ఒకవైపు నిత్యం తమతో కలిసిపనిచేసే కార్మికుడు సజీవదహనం చేసుకుని మృతిచెందిన సందర్భంలో ఆర్టీసీ కార్మికులు ఆగ్రహావేశాలతో భగ్గుమంటున్నారు. ఈ మృతికి నిరసనగా నర్సంపేట బంద్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మృతదేహాన్ని నర్సంపేటకు తరలిస్తే ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఎదురయ్యే పరిస్థితిని ఎవరు కట్టడిచేస్తారనేది పోలీసులు వేస్తున్న ప్రశ్న. అయినప్పటికీ సర్కారుపై ఆధిపత్యం కోసం రాజకీయ పక్షాలు గంటలకొద్దీ పట్టుపట్టడం చర్చనీయాంశంగా మారింది. కార్మికులు, రాజకీయనాయకులు అడిగినప్పుడు పోలీసులు అంగీకరిస్తే మృతదేహాన్ని తీసుకపోయి తిరిగి తీసుకరావడంలో తప్పులేదు. ఈ మేరకు తమ వంతుగా ప్రయత్నించడం మేరకు బాగానే ఉన్నా…. గంటల కొద్దీ అక్కడే బైఠాయించి మృతదేహాన్ని తీసుకపోయే దాకా కదిలేది లేదంటూ తమ హోదాలను అడ్డుపెట్టుకుని పోలీసులపై ఒత్తిడి తేవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో బండి సంజయ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కనీసం మానవత్వం లేకపోతే ఎట్లా? కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని, సహచర ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షను పట్టించుకోకపోతే ఎట్లా? లా అండ్ ఆర్డర్ బాధ్యత రాకుండా నేను చేసుకుంటా. డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు అనుమతించండి’’అని సంజయ్ కోరినప్పటికీ సానుకూలంగా స్పందించలేదు.

మృతుడి కుటుంబ పరిస్థితి దయనీయం

ఈ సమస్యలో కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందుల పాలు చేశారు. మృతదేహాన్ని నర్సంపేటకు తరలించేందుకు అంగీకరించకుంటే అంత్యక్రియలు ఎలా? చేస్తారంటూ కుటుంబ సభ్యులను తమ వాహనాల్లో నర్సంపేటకు తరలించడంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. పైగా మృతదేహం ఉన్న బాక్సుతో ఇరువర్గాలు ఆడుకున్నాయి. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాలు నడిరోడ్డుపై గంటలకొద్దీ ఆ మృతదేహం బాక్సు ఆటూ ఇటూ తోచుకున్నారు. ఈ సంఘటన అక్కడ ఉన్నవారిని కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేసింది. పరిస్థితి చేయిదాటుతుందని భావించిన పోలీసులు ససేమిరా అంటూ బలగాలను మోహరించడంతో కుటుంబ సభ్యుల ఇష్టమంటూ రాజకీయ నాయకులు చేతులెత్తేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో ఊపిరిపీల్చుకుని అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్మికుల డిమాండ్‌లో తప్పులేదు

శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆయన పనిచేసిన నర్సంపేట డిపోలోని సహచర కార్మికుల వద్ద తీసుకపోయి ఘనంగా నివాళులు అర్పించేందుకు సహచర ఆర్టీసీ కార్మిక నాయకులు ప్రయత్నించడంలో తప్పులేదు. ఆయన త్యాగాన్ని కొనియాడేందుకు ప్రయత్నించడమే కాకుండా మృతదేహంతో ధర్నా చేస్తే చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్ధతు లభిస్తోందని భావిండం న్యాయమైనదే. ఈ నిరసన వల్ల శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు కార్మికులు తమ వంతు ప్రయత్నం చేశారు. పరిస్థితుల రీత్యా పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్థితిలో కుటుంబ సభ్యులు ప్రేక్షపాత్రవహించడం తప్ప ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.

శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత:

ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు, బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కేంద్రమంత్రి బండి సంజయ్ తదితరులు ఉదయం కొందరు, మధ్యాహ్నం మరికొందరు శంకర్ గౌడ్ అంత్యక్రియలు నిర్వహించే ముత్తోజిపేటకు చేరుకున్నారు. ముందుగా ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరిపై మండిపడ్డారు. శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వంమే బాధ్యతవహించాలంటూ తేల్చిచెప్పారు. కొద్ది సేపు నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం పక్షాన ఆర్డీవో ఉమారాణి శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. 10లక్షల నష్టపరిహారం ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పక్షాన రూ. 5లక్షలు ప్రకటించారు.

పట్టువిడవని పోలీసులు

శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో స్థానిక పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేటకు మృతదేహాన్ని తరలించాలనే రాజకీయ, కార్మిక నాయకుల డిమాండ్ ను పోలీసులు అంగీకరించలేదు. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగి, ఒ దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పోలీసులు మాత్రం ససేమిరా అంటూ పట్టుబిగించారు. ఆర్టీసీ కార్మికులకు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు నచ్చచెప్పేందుకు తీవ్రంగా యత్నించారు. బండి సంజయ్ వరంగల్ సీపీ సన్ప్రీత్ పై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆయన మృతదేహాన్ని నర్సంపేట తరలించేందుకు అంగీకరించలేదు. నర్సంపేటకు మృతదేహాన్ని తరలిస్తే పరిస్థితులు చేయిదాటిపోతాయని స్పష్టం చేశారు. మరో వైపు ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో పోలీసులు కూడా అంగీకరించలేదని సమాచారం. దీంతో రాజకీయ పక్షాలు చేసేదేమిలేక కుటుంబ సభ్యుల ఇష్టమంటూ వారిపై నెపం నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో కాసింత ఉద్రిక్తత పరిస్థితుల మధ్యనే పోలీసుల జోక్యంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఈ సంఘటనతో ములుగు, నర్సంపేట ప్రధాన రహదారిపై గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు.

ఇవి కూడా చదవండి..

తెలంగాణ రోడ్లకు మహర్దశ.. 98వేల కోట్లతో అభివృద్ధి పనులు.. హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌
Viral Video | హోట‌ల్‌లో మూడు రోజులు బ‌స‌.. ట‌వ‌ల్స్, స్పూన్స్‌ను దొంగిలించిన టూరిస్టులు.. వీడియో
సిరులు కురిపిస్తున్న బంతి పూల సాగు..హెక్టార్ కు 1.80లక్షల ఆదాయం