తెలంగాణ రోడ్లకు మహర్దశ.. 98వేల కోట్లతో అభివృద్ధి పనులు.. హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌

తెలంగాణలో 98వేల కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నది. 300 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపర్చనున్నారు. 13వేల కోట్లతో 6వేల కిలోమీటర్ల రహదారులు కొత్త సొబగులు అద్దుకోనున్నాయి.

  • By: TAAZ |    telangana |    Published on : Apr 24, 2026 4:01 PM IST
తెలంగాణ రోడ్లకు మహర్దశ.. 98వేల కోట్లతో అభివృద్ధి పనులు.. హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌

తెలంగాణలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులను 98వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యం కలిగినదిగా చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. 2025 సంవత్సరంలో రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 6,500 మంది చనిపోయిన నేపథ్యంలో భద్రత విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం రోడ్ల నిర్మాణ సమయంలోనే ‘క్షేమంగా చేరుకోండి’ కార్యక్రమం సహా వివిధ భద్రతాచర్యలు తీసుకుంటోంది.

రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా హాజరయ్యారు. నవంబర్‌లో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. భారతదేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కాంట్రాక్టర్లు, నిపుణులు హాజరయ్యే ఈ సమావేశంలో రాష్ట్రానికి 20వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సైతం ఇంతటి భారీ ప్రాజెక్టును చేపట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రహదారుల మౌలిక సదుపాయాల విషయంలో 2028 చివరి నాటికి తెలంగాణను నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి వివరించారు.

కీలక ప్రాజెక్టులు..

98వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు వివరాలను తెలియజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అప్రోచ్‌ రోడ్ల కోసం 148 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. 300 గ్రామాలను ఈ రోడ్ల ద్వారా అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. రహదారుల ప్రాజెక్టులకు గత బీఆరెస్‌ ప్రభుత్వం నిధులు కేటాయించలేదని మంత్రి విమర్శించారు. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హామ్‌) కింద.. 6000 కిలోమీటర్ల రోడ్లను 13వేల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.

  • హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిని సుమారు 20వేల కోట్ల రూపాయలతో ఎనిమిది లేన్లతో విస్తరిస్తున్నారు.
  • ఇందులో ఆరు ప్రధాన లేన్లు, రెండు సర్వీసుల లేన్లు ఉంటాయి.
  • ఫలితంగా రహదారిపై ట్రాఫిక్‌ సజావుగా సాగిపోతుంది.
  • చౌటుప్పల్‌, చిట్యాల వంటి తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే చోట్ల ప్రత్యేకంగా భద్రతను మెరుగుపర్చేందుకు 500 కోట్లతో ఫ్లైవోవర్లు, వంతెనలు నిర్మించనున్నారు.

దీనికితోడు ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతిని కలుపుకొంటూ బందర్‌ వరకూ 20వేల కోట్ల రూపాయలతో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దానికి సమాంతరంగా బుల్లెట్‌ ట్రైన్‌ మార్గాన్ని కూడా ప్రతిపాదించారు. ఇదిలా ఉంటే.. మన్ననూర్‌ నుంచి శ్రీశైలం వరకూ 52 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ను 8వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇది ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

ట్రిపుల్‌ఆర్‌, ఇతర పనులు

  • భారీ ప్రాజెక్టుగా చేపడుతున్న రీజినల్‌ రింగ్‌రోడ్డుకు ప్రభుత్వం 36వేల కోట్లకు ఆమోదం తెలిపింది. దీనికోసం భూసేకరణ నిమిత్తం జాతీయ రహదారుల అథారిటీ (NHAI)కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 628 కోట్లు డిపాజిట్‌ చేసింది.
  • హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలను తప్పించేందుకు ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వరకు 941 కోట్లతో డబుల్‌ డెకర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇందులో 741 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందించనున్నది. మిగిలిన రెండు వందల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనున్నది.
  • ఇదే సమయంలో తగినంత కనెక్టివిటీ లేని గ్రామాలకు సైతం కొత్త రోడ్లను నిర్మిస్తారు.
  • ఇప్పటికే ఉన్న సింగిల్‌లేన్‌ రహదారులను డబుల్‌ లేన్‌గా మార్చుతారు.
  • ఈ అభివృద్ధి పనులతో రవాణా సదుపాయాలు మెరుగవుతాయని, పరిశ్రమలు వచ్చి, స్థానిక ప్రజలకు మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం భావిస్తున్నది.

Read Also |

సిరులు కురిపిస్తున్న బంతి పూల సాగు..హెక్టార్ కు 1.80లక్షల ఆదాయం
Heat Wave | దంచికొడుతున్న ఎండ‌లు.. 44 డిగ్రీల‌కు త‌గ్గ‌కుండా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు..!