National Highways | అమ్మకానికి 28 హైవేలు.. రూ.35 వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా కేంద్రం భారీ స్కెచ్!

జాతీయ ఆస్తుల నగదీకరణ పైప్‌లైన్ (NMP) 2.0 ప్రకారం 2025-26 నుంచి 2029-30 మధ్య జాతీయ రహదారుల ద్వారా రూ.4.42 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.35 వేల కోట్ల టార్గెట్‌ను నిర్దేశించుకుంది.

National Highways | అమ్మకానికి 28 హైవేలు.. రూ.35 వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా కేంద్రం భారీ స్కెచ్!

National Highways | కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమీకరించడమే లక్ష్యంగా భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయిస్తున్న కేంద్రం.. తాజాగా జాతీయ రహదారులను అమ్మేయాలని చూస్తున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 28 జాతీయ రహదారులను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా దాదాపు రూ.35 వేల కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

విక్రయించాలని అనుకుంటున్న రహదారుల మొత్తం పొడవు రూ.1800 కిలోమీటర్లకు పైగానే ఉండనుంది. ఇప్పటికే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నగదీకరణకు అనువైన హైవేలను గుర్తించినట్లు సమాచారం. వీటిలో అత్యధిక హైవేలు హర్యానా, యూపీలోనే ఉన్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ఆస్తుల నగదీకరణను ప్రభుత్వం పలు విధానాల ద్వారా చేపట్టనున్నది. ప్రభుత్వ, ప్రైవేటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ట్రస్ట్ (INVITS), టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (TOT) మోడళ్ల ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యి.. టోల్ వసూళ్లు జరుగుతున్న హైవేలను ప్రైవేటు సంస్థలకు నిర్వహణ హక్కులతో అప్పగించి, ముందస్తు ఆదాయం పొందే విధానాన్ని కూడా అనుసరించాలని చూస్తున్నది.

ఈ నగదీకరణలో రెండు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(BOT) ప్రాజెక్టులు, ఏడు ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ (EPC) ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేరుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ప్రాజెక్టులపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విధానం ద్వారా అయితే మూలధన వ్యయంపై రిస్క్ తక్కువగా ఉంటుందని.. తద్వారా పెట్టుబడిదారులు ఆసక్తి ఎక్కువగా చూపుతారని భావిస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ టోల్ రోడ్డు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే సావరిన్ హెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో రహదారి రంగంలో విదేశీ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రహదారుల నగదీకరణ ద్వారా కేంద్రానికి రూ.29వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా మరింత ఎక్కువగా నిధులు సమీకరించాలని టార్గెట్‌గా పెట్టుకుని నగదీకరణపై దృష్టిసారించింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన తొలి ప్రభుత్వ ఇన్విట్ ద్వారా నాలుగు రాష్ట్రాల్లో 260 కిలోమీటర్ల మేర విస్తరించిన ఐదు హైవేలను నగదీకరించి, రూ.9వేల కోట్లకు పైగా సమీకరించింది. జాతీయ ఆస్తుల నగదీకరణ పైప్‌లైన్ (NMP) 2.0 ప్రకారం 2025-26 నుంచి 2029-30 మధ్య జాతీయ రహదారుల ద్వారా రూ.4.42 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.35 వేల కోట్ల టార్గెట్‌ను నిర్దేశించుకుంది. అయితే ఇలా జాతీయ రహదారుల నిర్వహణపై ప్రైవేటు సంస్థల ఆధిపత్యం పెరగడంతో టోల్ చార్జీల పేరిట వాహనదారులపై భారీగా భారం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More:

హైదరాబాద్‌ నగరంలో 22 ప్రధాన రోడ్ల విస్తరణకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు