హైలైట్స్:
- ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారికి ప్రతిపాదనలు
- కడప జిల్లాకు భారీగా ప్రయోజనం
- గణనీయంగా తగ్గిపోనున్న దూరం.. భారం..
- సరుకు రవాణా మరింత సులభం.. చౌక
- అటవీ, వైల్డ్ లైఫ్ క్లియరెన్స్
- పలు చోట్ల కొనసాగుతున్న పనులు
విజయవాడ నుంచి బెంగళూరు మధ్య ప్రయాణ దూరాభారాలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. రెండు నగరాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేను ప్రతిపాదించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకించి కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేయనున్నది. బెంగళూరు– కడప– విజయవాడ ఎకనమిక్ కారిడార్‌కు సంబంధించిన నేషనల్ హైవే –544జీలో ఇది ప్రధాన భాగమని ది హిందూ కథనం పేర్కొంటున్నది. దక్షిణ భారతదేశంలోని ఆర్థిక కేంద్రాలు, పారిశ్రామిక క్లస్టర్లను బలోపేతం చేసేందుకు ఈ రహదారిని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు నగరాల మధ్య కనీసం 110 కిలోమీటర్ల దూరం తగ్గడంతోపాటు.. ప్రయాణ సమయం కూడా మూడు నుంచి నాలుగు గంటలు తగ్గిపోనున్నది. అంతేకాకుండా.. ఈ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కూడా ఎంతో ఉపయగకరంగా మారనున్నది. సరుకు రవాణా వ్యయం కూడా తగ్గుతుంది. పైగా రహదారి సమీప ప్రాంతాల్లో పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు ఈ కారిడార్ కీలకంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎన్‌హెచ్–16తో ఎన్‌హెచ్ 44 అనుసంధానం
ఈ ప్రాజెక్టు కోడూర్ గ్రామం సమీపంలో కొందికొండ చెక్‌పోస్ట్ వద్ద ప్రారంభం అవుతుంది. శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్ కడప, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల మీదుగా సాగి.. అద్దంకి సమీపంలోని ముప్పవరం గ్రామం వద్ద ముగుస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎన్‌హెచ్–544జీ కింద 343.24 కిలోమీటర్ల పొడవున గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా.. ఇప్పటికే ఉన్న 190 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేసేందుకు బ్రౌన్‌ఫీల్డ్ పనులు కూడా చేపడుతున్నారు. ఇందులో బెంగళూరు–కొడికొండ చెక్‌పోస్ట్ మధ్య 90 కిలోమీటర్లు, అద్దంకి, విజయవాడ మధ్య 100 కిలోమీటర్ల రహదారులను విస్తరిస్తున్నారు. ఈ రెండు భాగాలు పూర్తయితే.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య వేగంగా ప్రయాణించేందుకు రహదారి మార్గం అందుబాటులోకి వస్తుంది.
కడప జిల్లాకు వరం..
ఈ హైవేతో కడప జిల్లాకు అత్యధికంగా ఉపయోగం కలుగనుంది. ఎందుకంటే.. ఈ ఒక్క జిల్లాలోనే హైవేను 123.5 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఇది.. పులివెందుల, వేముల, వేంపల్లి, వీఎన్ పల్లి, ఎర్రగుంట్ల, కమలాపురం, చాపాడు, మైదుకూరు, బీ మఠం, బీ కోడూరు, పోరుమామిళ్ల సహా మొత్తం 12 మండలాల మీదుగా వెళుతుంది. అంతేకాదు.. మొత్తం 17 ఇంటర్‌చేంజ్‌లకు గాను.. ఏడింటిని కడప జిల్లాలోనే ఏర్పాటు చేయనున్నారు. తద్వారా స్థానికులు ఈ హైవేపైకి సులభంగా చేరుకునేందుకు, దిగేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్టులో మొత్తం 18వే సైడ్ అమెనిటీస్ (రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, మరుగుదొడ్లు, ట్రక్ పార్కింగ్, ట్రైలర్ పార్కింగ్ సదుపాయాలు)లో నాలుగు కడప జిల్లాలోనే రానున్నాయి. జిల్లాలోని పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించారు. అంచనా వ్యయం 5,400 కోట్లు అని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో భూములు అవసరం పడుతున్నాయి. అయితే.. ఇప్పటికే 2,700 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇందులో 1020 హెక్టార్లు ఒక్క కడప జిల్లాలోనివే. ఈ హైవే ద్వారా హిందూపురం, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలు నేరుగా బెంగళూరుతో అనుసంధానం అవుతాయి.
అటవీ అనుమతులు
మొత్తంగా ఈ ప్రాజెక్టును 14 నిర్మాణ ప్యాకేజీలుగా విభజించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. 2025 మార్చిలోనే ఈ ప్రాజెక్టుకు కీలకమైన రెండో దశ అటవీ అనుమతులతోపాటు వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కూడా లభించింది. దీంతో నిర్మాణ పనులకు కీలక అడ్డంకులు తొలగిపోయినట్టయింది.
ఏటీఎంఎస్‌తో అనుసంధానం
ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే మొత్తాన్నీ అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్)తో అనుసంధానం చేయనున్నారు. దీని వలన ట్రాఫిక్ పర్యవేక్షణ సులభంగా మారడమే కాకుండా.. ప్రమాదల నియంత్రణ మరింత సమర్థవంతం కానుంది. ఈ మార్గంలో క్లోజ్డ్ టోల్ సిస్టమ్‌ను అమలు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. అంటే.. ఈ మార్గంలో ప్రయాణించిన దూరానికి మాత్రమే వాహనదారులు టోల్ చెల్లించాల్సి ఉంటుందన్నమాట.