• Telugu News
  • /Telangana

నల్లగొండలో హ్యామ్ రోడ్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

నల్గగొండ అసెంబ్లీ నియోజకవర్గం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రూ.13,006 కోట్లతో 6,092 కిలోమీటర్ల మేరకు చేపట్టనున్న 441 హ్యామ్ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రూ.83 కోట్లతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1 కు శంకుస్థాపన చేశారు. అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jun 28, 2026, 4:38 pm IST
Read Time: 4 mins
నల్లగొండలో హ్యామ్ రోడ్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

విధాత : నల్గగొండ అసెంబ్లీ నియోజకవర్గం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రూ.13,006 కోట్లతో 6,092 కిలోమీటర్ల మేరకు చేపట్టనున్న 441 హ్యామ్ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రోడ్స్ పైలాన్ ను రేవంత్ రెడ్డి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అక్కడ రూ.83 కోట్లతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1 కు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

కానరాని పున్నా, గుత్తాల ఫోటోలు..

సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రం పర్యటనలో భాగంగా మీడియాకు ఇచ్చిన అధికారిక ప్రచార ప్రచార ప్రకటనలలో ఎక్కడా కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటోలు పెట్టకపోవడం చర్చనీయాంశమైంది. ప్రోటోకాల్ కు విరుద్దంగా తనను అవమానించే రీతిలో స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యహరించడం పట్ల గుత్తా తీవ్ర అసహనానికి గురైనట్లుగా సమాచారం. అయితే ఇదేమి ఎరుగనట్లుగా గుత్తా మాత్రం రేవంత్ రెడ్డి పర్యటనకు హాజరుకావడం జరిగింది.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ జిల్లా కేంద్రం నల్లగొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు ఏర్పాటు చేసిన ఆహ్వాన ప్లెక్సీలలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఫోటో పెట్టకపోవడం కూడా వివాదస్పదమైంది. సీఎం సభకు మర్యాదపూర్వకంగా కూడా తనను పిలువ లేదని డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.