ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కార్మికులదే తుది నిర్ణయం.. బకాయిలు గత సర్కార్ పాపం..

ఆర్టీసీలో ఏ ఒక్క డ్రైవర్‌నూ తీసివేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభయమిచ్చారు. అందరం కలిసి ఆర్టీసీని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. సమ్మెకాలానికి జీతాలు చెల్లిస్తామని తెలిపారు. కేసులు సైతం ఎత్తివేస్తామని తనను కలిసిన ఆర్టీసీ నాయకులకు ముఖ్యమంత్రి చెప్పారు.

  • By: TAAZ |    telangana |    Published on : May 01, 2026 9:12 PM IST
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కార్మికులదే తుది నిర్ణయం.. బకాయిలు గత సర్కార్ పాపం..
  • ఒక్క డ్రైవర్ ఉద్యోగం కూడా తీసివేయం
  • 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు
  • ఆర్టీసీ సంఘాలతో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి

విధాత, హైదరాబాద్:

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికి ఉద్యోగుల బ‌కాయిలు తీర్చ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నామని, ఈ సారి ఉద్యోగుల‌కు రూ.1000 కోట్ల బ‌కాయిలు విడుద‌ల చేశామని, ఆర్టీసీ స‌మ‌స్య‌ల‌ను 100 శాతం ప‌రిష్క‌రిస్తామని, కార్మికుల‌తో ప్ర‌భుత్వం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంస్థ ఆగిపోతే ఊపిరిపోయిన‌ట్లేనని, న‌ష్టం జ‌రిగే ప‌నులు చేయోద్దని ఆయన కోరారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో శుక్రవారం ఆర్టీసీ కార్మిక సంఘాల నాయ‌కులు కలిశారు. త‌మ‌ స‌మ‌స్యల పరిష్కారం కోసం చొర‌వ చూపించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కార్మిక సంఘాల నేత‌లు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీలో బ‌కాయిలు తమ హ‌యాంలో పెట్టిన‌వి కావని, కానీ వాటిని చెల్లించడానికి ప్ర‌య‌త్నం చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన కారుణ్య నియామాల‌ను తాము చేపట్టామన్నారు.

విలీనంపై మీదే నిర్ణయం

యూనియన్లు, విలీనం లాంటి అంశాల‌పైన ప్ర‌ణాళిక బ‌ద్దంగా కార్మిక సంఘాలే చ‌ర్చించుకుని ఒక నిర్ణ‌యం చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు. ఆర్థిక అంశాల‌తో కూడా పీఆర్సీ లాంటి వాటి పైన ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శాశ్వ‌త ప‌రిష్కారం కోసం చ‌ర్చించుకుని ప్ర‌భుత్వం ముందు ఆప్ష‌న్స్ పెట్టాలన్నారు. రాజ‌కీయాల ప్ర‌భావానికి లోనైతే సంస్థ‌కు న‌ష్టం జ‌రుగుతుందని చెబుతూ, ఆర్టీసీ అప్పుల పైన ఉన్న వ‌డ్డీ భారాన్ని త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నామన్నారు.

ఆర్టీసీ కార్మికు హక్కులను ప్రభుత్వం కాపాడుతుంది

ఆర్టీసీలో ఒక్క డ్రైవ‌ర్ ను కూడా త‌గ్గించమని, ఆర్టీసీ ని బాగు చేసుకునే అవ‌కాశం కార్మికుల‌పైనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. కార్మికులు, ఆర్టీసీ యాజ‌మాన్యం మ‌ధ్య స్నేహా పూర్వ‌క వాతావ‌ర‌ణం ఉండాలని, ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల హ‌క్కుల‌ను కాపాడుతుందన్నారు. సంస్థ అభివృద్ధి, మ‌నుగ‌డ‌, గౌర‌వాన్ని పెంపొందించి ప్ర‌జ‌ల‌కు మంచి సేవ‌లు అందించ‌డానికి కార్య‌చ‌ర‌ణ  కోసం ముందుకు వ‌చ్చినందుకు అభినంద‌న‌లు తెలిపారు. నేను వేరు, మీరు వేరు అన్న భావ‌న నాకు ఎప్పుడు లేదు.. అంద‌రం క‌లిస్తేనే ప్ర‌భుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రావాల‌ని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారు.. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేం ఉన్నామని గుర్తు చేశారు. ఆర్టీసీలో బ‌స్సుల‌ను పెంచాం, నియామ‌కాలు పెంచాం, ఆదాయం పెంచామని పేర్కొన్నారు. నగర శివారు గాజుల‌రామారంలో బస్ ట‌ర్మిన‌ల్ కోసం 100 ఎక‌రాలు కేటాయించామని, శంషాబాద్ లో 150 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయి బ‌స్ టర్మిన‌ల్ నిర్మిస్తున్నామని తెలిపారు. 1000 ఈవీ బ‌స్సులు కొనుగోలు చేసి మెట్రో రైలుతో అనుసంధానం చేస్తున్నామని,  మినీ బ‌స్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అంద‌జేయాల‌నుకుంటున్నామన్నారు. డీజీల్ పైన ఆర్టీసీ ప్ర‌తి యేడాది చేస్తున్న రూ.2000 కోట్లు ఖ‌ర్చు భారంగా మారిందని, డీజీల్ ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి ఈవీ బ‌స్సుల‌ను తీసుకువస్తున్నామన్నారు. ఆదాయం పెర‌గాలంటే ఖ‌ర్చు త‌గ్గించుకోవాలి.. దీని కోసం ప‌క్కా ప్ర‌ణాళిక కావాలని, మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం పెట్ట‌డం ద్వారా రూ.8 వేల కోట్లు ఆర్టీసీకి ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

సమ్మెకాలానికి వేతనం, కేసుల ఎత్తివేత

ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. 3 రోజుల వేతనం ఇచ్చేందుకు, కేసుల ఎత్తివేతకు అంగీకరించారు. సమ్మె కాలంలో వేతనం, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నధికారులను ఆదేశించారు.