హైలైట్స్:

  • మ‌ద్యం మ‌త్తులో సోలుతున్న గ్రామాలు
  • ఒక్కో ఊరికి నాలుగైదు బెల్ట్ షాపులు
  • ఏటేటా స‌ర్కారుకు పెరుగుతున్నఆదాయం
  • ఆర్థికంగా చితికి పోతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు
  • 50 శాతం జ‌నాభాను తాగుబోతులుగా మార్చిన పాల‌కులు
  • 11 ఏళ్ల‌లో మద్యంతో స‌ర్కారుకు నాలుగింత‌లు పెరిగిన ఆదాయం

(తిప్పన కోటిరెడ్డి)

తెలంగాణ‌లో మ‌ద్యం ఏరులై పారుతున్న‌ది. ఊరూరా విచ్చ‌ల విడిగా బెల్ట్ షాపులు వెలిశాయి. మ‌ద్యం విక్ర‌యాల ద్వారా వ‌చ్చేఆదాయంపైనే స‌ర్కారు అధికంగా ఆధారపడటంతో తెలంగాణ ప‌ల్లెలు, ప‌ట్నాలు మ‌ద్యం మ‌త్తులో జోరుగుతున్నాయి. స‌గ‌టు తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాలు ఆగ‌మ‌వుతున్నాయి. ప్ర‌జ‌లు ఆర్థికంగా,ఆరోగ్యప‌రంగా చితికిపోతుంటే సర్కారు ఖ‌జ‌నా వేల కోట్ల ఆదాయాన్ని లెక్కవేసుకుంటున్నది. మరోవైపు మ‌ద్యం ఉత్ప‌త్తిదారుల‌కు, విక్ర‌యదారుల‌కు భారీగానే గిట్టుబాటు అవుతున్న‌ది. అధికారుల‌కు, నేత‌ల‌కు మ‌ద్యం ముడుపులు కూడా బాగానే అందుతున్నాయ‌న్న‌టాక్ ఉన్న‌ది. బెల్ట్ షాపులు ఎన్ని వ‌చ్చినా ప‌ట్టించుకునే నాథుడే లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నది. ఒక అంచనా ప్రకారం.. ఏటా దాదాపుగా ఎన‌భై ల‌క్ష‌ల నుంచి ల‌క్ష కోట్ల రూపాయ‌ల విలువైన మ‌ద్యం విక్ర‌యాలు తెలంగాణలో జ‌రుగుతున్నాయి. దీని ద్వారా ప్ర‌భుత్వానికి ఎక్సైజ్ సుంకం, స్పెష‌ల్ ఎక్సైజ్ సెస్‌, అడిష‌న‌ల్ ఎక్సైజ్ లేవీ, రిటైల్ షాప్ ఎక్సైజ్ టాక్స్‌, లైసెన్స్ ఫీజు త‌దిత‌ర రూపాల‌లో ప్ర‌భుత్వానికి ఆదాయం సమకూరుతున్నది. మ‌ద్యం విక్ర‌యాల ద్వారా ఉత్ప‌త్తి దారుల కంటే స‌ర్కారుకే ఎక్కువ ఆదాయం వ‌స్తుంది. అందుకే ప్ర‌జ‌ల జీవితాలు ఛిద్ర‌మ‌వుతున్నా ప్ర‌భుత్వాలు ఏమాత్రం ప‌ట్టించుకోకుండా మ‌ద్యం విక్ర‌యాలు పెంచ‌డానికే తీవ్ర య‌త్నాలు చేస్తున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ గమనిస్తే.. తేడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. 2014-15 సంవ‌త్స‌రంలో ఎక్సైజ్ ఆదాయం స‌ర్కారుకు రూ.10 వేల కోట్లు ఉండ‌గా ఇప్పుడ‌ది రూ.40 వేల కోట్ల‌కు పెరిగింది.  అంటే ఇంచుమించు 400 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మొత్తం ఎక్సైజ్ శాఖ ఆదాయం (లిక్కర్‌ అమ్మకాలు+లైసెన్స్‌+ షాపు ఫీజులు+ ఇతర రుసుములు) కింది పట్టికలో చూడొచ్చు..

(లిక్కర్ విక్రయాల ద్వారా వ‌చ్చే ఆదాయం రూ.40,209 కోట్లు + లైసెన్సులు, షాప్ ఫీజులు, బార్ ఫీజులు మొదలైనవి క‌లిపి. (ఈ అర్థిక సంవ‌త్సరంలో 95,628 దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖ అదనంగా రూ. 2,869 కోట్లను ఆర్జించింది).

అడ్డగోలుగా బెల్ట్‌ షాపులు

తెలంగాణలో 2,620 ఏ4 మ‌ద్యం దుకాణాలు, 1,214 బార్లు ఉన్నాయి. మ‌ద్యం షాపులు ఎక్సైజ్ అధికారుల‌తో అన‌ధికార ఒప్పందాలు చేసుకొని స‌మీప గ్రామాలు, బ‌స్తీల‌లో అడ్డ‌గోలుగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విక్ర‌యాలు చేయిస్తున్నాయి. ఫ‌లితంగా మంచినీళ్లు దొర‌క‌ని గ్రామాల‌లో కూడా మ‌ద్యం (చీప్ లిక్క‌ర్‌) దొరుకుతోంది. రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో 382.91 ల‌క్ష‌ల కేసుల మ‌ద్యం (46 కోట్ల మ‌ద్యం పుల్‌ బాటిళ్లు, 387.34 ల‌క్ష‌ల కేసుల (46.48 కోట్ల బాటిళ్ల) బీర్ల‌ అమ్మ‌కాలు జ‌రిగాయి. రాష్ట్రంలో అమ్ముడు అయిన మ‌ద్యంలో రూ.1000 నుంచి రూ.10 వేల ధ‌ర ప‌లికేవి కూడా ఉన్నాయి. మ‌ద్యం అమ్మ‌కాల‌లో పెద్ద వాటా ప్ర‌భుత్వానికే వెళుతుంది. ఆ త‌రువాత‌నే ఉత్ప‌త్తిదారుడు, రిటైల్ షాప్ ఓన‌ర్ల‌కు వెళుతుంది. దీంతో మ‌ద్యం విక్ర‌యాల‌ను పెంచేందుకు అడ్డ‌గోలుగా బెల్ట్ షాప్‌లను వాడుకుంటున్నారన్న అభియోగాలు ఉన్నాయి. బెల్ట్ షాపుల్లో బాటిల్‌కు రూ.15 నుంచి 20 వ‌ర‌కు అదనంగా వసూలు చేస్తారని సమాచారం. వెరసి.. తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌తి ఏటా రూ.80 వేల కోట్ల నుంచి ల‌క్ష కోట్ల వ‌ర‌కు త‌మ ఆదాయాన్ని తాగుడుకే ఖ‌ర్చు చేస్తున్న దుస్థితి ఏర్ప‌డింది.

బ్రాండ్ 750 ఎంఎల్‌ (సుమారుగా) ప్రభుత్వం పొందే పన్నులు/లెవీ సుమారుగా

మెక్‌డోల్ నెంబ‌ర్ 1    రూ.700–₹900             రూ.350–₹550

రాయ‌ల్ స్టాగ్‌          రూ.900–₹1,200             రూ.450–₹750

సిగ్నేచ‌ర్‌               రూ.1,100–₹1,500            రూ.600–₹900

బ్లెండ‌ర్స్ ప్రైడ్‌          రూ.1,300–₹1,800           రూ.700–₹1,100

ఈ లెక్క‌ల్లో ప్ర‌భుత్వానికి, త‌యారీ దారుల‌కు, విక్ర‌య దారుల‌కు వ‌చ్చే ఆదాయం ఈ విధంగా… ఒక్క ఎమ్మార్పీ రేట్ల ద్వారానే లెక్క‌… కానీ చాలా చోట్ల ఎమ్మార్పీ కంటే అద‌నంగానే అమ్ముతున్నారన్న విమర్శలూ ఉన్నాయి.

అంశం                                            అంచనా మొత్తం

మొత్తం అమ్మకాల విలువ          రూ. రూ.80,000 నుంచి ల‌క్ష‌ కోట్ల వ‌ర‌కు

ప్రభుత్వ వాటా                            రూ.44,557 కోట్లు

తయారీదారుల వాటా                  రూ.15,000–రూ.24,000 కోట్లు

రిటైల్/హోల్‌సేల్ మార్జిన్లు       రూ.4,000–రూ.8,000 కోట్లు

మద్యం అధికంగా తాగే రాష్ట్రాల్లో తెలంగాణ

నేష‌న‌ల్ ఫ్యామిలీ హెల్త్ స‌ర్వే-5(2019-21) ప్ర‌కారం దేశంలో మ‌ద్యం తాగే వారి శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌టి. రాష్ట్రంలోని పురుషుల్లో 50 శాతం, మ‌హిళ‌ల్లో 4.9 శాతం మంది మ‌ద్యం తాగుతున్నారని ఈ నివేదిక తెలిపింది. అంటే ప్ర‌తి ఇద్ద‌రు పురుషుల్లో ఒక‌రు మ‌ద్యం తాగుతున్నారు. ఇలా తెలంగాణ సుమారు నాలుగు కోట్ల జ‌నాభా ఉంది. దీని ఆధారంగా పెద్ద‌ల జ‌నాభ లెక్కిస్తే తెలంగాణలో 70 నుంచి 90 ల‌క్ష‌ల మంది మ‌ద్యం తాగుతున్నారన్న అంచనాకు రావచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇందులో గ్రామాల్లో మ‌ద్యం తాగే పురుషులు 46 నుంచి 49 శాతం వ‌ర‌కు ఉండ‌గా, ప‌ట్ట‌ణాల్లో 34 నుంచి 36 శాతం వ‌ర‌కు ఉన్న‌ట్లు అంచ‌నా. ఈలెక్క‌న మ‌ద్యం తాగడం ప‌ట్ట‌ణాల కంటే గ్రామాల‌లోనే అత్య‌ధికంగా ఉంద‌ని నివేదిక‌లు చెపుతున్నాయి. రాష్ట్రంలో మ‌ద్యం తాగే టాప్ టెన్‌ జిల్లాల్లో గ్రామీణ ప్రాంత జిల్లాలు ఉండ‌గా, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి, రంగారెడ్డి, హ‌న్మ‌కొండ జిల్లాలు మ‌ద్యం తాగే వారిశాతం తక్కువగా న‌మోదైన జిల్లాలుగా ఉన్నాయి

మ‌ద్యం తాగ‌డంలో టాప్ టెన్ లో ఉన్న జిల్లాలు

1) కొమురంభీమ్ ఆసిఫాబాద్‌

2) అదిలాబాద్

3) నిర్మ‌ల్

4) జ‌య‌శంక‌ర్ భూపాల్ ప‌ల్లి,

5) ములుగు

6) భ‌ద్రాద్రి కొత్త‌గూడెం

7) మ‌హ‌బూబాబాద్

8) నాగ‌ర్ క‌ర్నూల్

9) జోగులాంబ గ‌ద్వాల్‌

10 నారాయ‌ణ‌పేట‌

చితికి పోతున్న కుటుంబాలు..

కుటుంబంలో ఒక‌రు మ‌ద్యానికి బానిసైతే ఆ కుటుంబం ఆర్థికంగా చితికి పోతున్న‌ది. మ‌ద్యానికి బానిస‌లుగా మారి ఉన్న ఆస్తుల‌ను తెగ‌న‌మ్ముకున్న ప‌రిస్థితులు కూడా ఉన్నాయి. ఒక వ్య‌క్తి రోజు రూ.200 మ‌ద్యం తాగితే ఏడాదికి రూ.73 వేలు న‌ష్ట‌పోతాడని అంచనా.. స‌హ‌జంగా రోజువారీ కూలీలే  ఎక్కువగా చీప్ లిక్క‌ర్ తాగుతారు. తాగుడుకు బానిసైన వ్య‌క్తి ప‌ని చేయ‌డు. దీని ద్వారా కుటుంబం ఆదాయం కోల్పోతున్న‌ది. దీంతో దొరికిన కాడ‌ల్లా అప్పులు చేయ‌డం, ఇంటి ఇల్లాలి పుస్తెలు, ఇంట్లో ఉన్న ఆస్తులు తాక‌ట్టు పెట్టి తాగ‌డం చేస్తుంటారు. దీని వ‌ల్ల ఆ కుటుంబం అన‌తి కాలంలోనే అప్పుల ఊబిలో కూరుకు పోతుంది.

ఉదాహరణకు ఒక వ్య‌క్తి రోజూ మ‌ద్యం తాగితే ఆర్థికంగా న‌ష్ట‌పోయే తీరు ఇలా ఉంటుంది.

మ‌ద్యం విలువ          ఏడాదికి                 10 ఏళ్ల‌కు

రూ.200               రూ.73,000           రూ.73 ల‌క్ష‌లు

రూ.300               రూ.1.09 లక్షలు       రూ.10.95 ల‌క్ష‌లు

రూ.500               రూ.1.82 ల‌క్ష‌లు       రూ.18.25 ల‌క్ష‌లు

(ఇది అస‌లుమాత్రమే.. దీనికి వ‌డ్డీ క‌లిపితే రెండింతలు, మూడింతలు అయ్యే అవకాశం కూడా  ఉంది. అప్పు ఇచ్చినవాడు వడ్డీ వసూలు చేస్తాడు కదా…)

ఈ లెక్క‌న నెల‌కు రూ.9 వేల రూపాయ‌లు మ‌ద్యం కోసం ఖ‌ర్చు చేసే కుటుంబం ఆ డ‌బ్బును పొదుపు చేస్తే ఏడాదికి రూ.1.08 ల‌క్ష‌ల చొప్సున 20 ఏళ్ల‌కు రూ.21.6 ల‌క్ష‌లు అవుతుంది. దీనిని పొదుపు ఖాతాలో జ‌మ చేస్తే రిజ‌ర్వ్ బ్యాంకు వ‌డ్డీ ప్ర‌కారం చూసినా 20 ఏళ్ల‌లో రూ.50 ల‌క్ష‌లు అవుతుంది. ఇదే సొమ్మును ఆస్తుల కొనుగోళ్ల‌పై వినియోగిస్తే కోటి రూపాయ‌ల‌కు పైగా అవుతున్న‌ది. అదే పిల్ల‌ల విద్య మీద ఖర్చు చేస్తే ఆ కుటుంబం ఉన్న‌త స్థానానికి ఎదుగుతుంది. ఇలా తెలంగాణ‌లో మ‌ద్యానికి బానిసైన కుటుంబాలు అభివృద్ది చెంద లేక ఆర్థికంగా చితికి పోతున్నాయి.