హైలైట్స్:
- టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతుతో మారిన సమీకరణలు
- కేంద్రంలో పరిణామాలతో ఏపీపై ఎఫెక్ట్ ఏంటి?
విధాత, హైదరాబాద్:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అన్ని విధాల కలిసి వస్తున్నది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పుణ్యమాని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బలం మరింత పెరిగింది. మమతా బెనర్జీ పార్టీకి చెందిన 28 మంది పార్లమెంటు సభ్యుల్లో 20 మంది వేరు కుంపటి పెట్టి, ఎన్డీఏకు మద్దతు పలుకుతూ లేఖ రాశారు. ఈ పరిణామాలతో ఇప్పటి వరకు ఎన్డీయేకు మద్దతు ఇస్తూ వస్తున్న ఏపీలోని టీడీపీ, జనసేన పార్టీల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఎంసీ ఎంపీల మద్దతుతో ఈ రెండు పార్టీలతో పాటు వైసీపీ మద్దతు కూడా బీజేపీకి అవసరం లేకుండా పోతుందనే చర్చలు సాగుతున్నాయి. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ తన దారి ఎటు అనేది తేల్చుకోవాల్సిన తరుణం ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికే ఆయనపై బీజేపీ పెద్దల ఒత్తిడి ఉందనే వార్తలు వస్తున్నాయి. పార్టీని బీజేపీలో విలీనం చేస్తే, 2029లో ఏపీకి ముఖ్యమంత్రిని చేసి చూపిస్తామనే గట్టి హామీ ఆయనకు లభించిందని అంటున్నారు. అదే జరిగితే అటు టీడీపీనీ, ఇటు వైసీపీని బీజేపీ టార్గెట్ చేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బలం లేక టీడీపీ, జనసేన, జేడీయూ మద్దతు…
గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు. దీంతో మిత్ర పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 543 ఎంపీ సీట్లకు గాను బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలుపొందింది. దీంతో అత్యధిక స్థానాలు గెలుపొందిన టీడీపీ (16), జనతా దళ్ యునైటెడ్ (12) సీట్లతో పాటు తక్కువ సీట్లు గెలుపొందిన లోక్ జనశక్తి, శివసేన, జేడీఎస్, ఆర్ఎల్డీ, జనసేన వంటి పార్టీల మద్దతు తీసుకొన్నారు. చిన్నా చితక పార్టీల మద్ధతు లభించడంతో 292 సభ్యులతో బీజేపీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
లోకేశ్ లాంచింగ్‌కు ఎఫెక్ట్?
మారిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వారసుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ బాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడం అంత సులువు కాదనే వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో తిరుగుతున్నాయి. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ అప్పట్లో తన ఆశీస్సులు కోరారని, తాను తిరస్కరించానని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ మాదిరి లోకేశ్‌ను కూడా వారసత్వ సీఎంగా చేసేందుకు మోదీ సమ్మతిస్తారా? అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీఎంసీ ఎంపీల మద్దతుతో బీజేపీ వద్ద బాబు పలుకుబడి మరింత తగ్గుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. బాబు చెప్పినట్లుగా కొంతమేరకు నిధులు, పనుల విషయంలో ఉదారంగా వ్యవహరించిన బీజేపీ ప్రభుత్వం.. ఇక నుంచి ఆచితూచి వ్యవహరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. లోక్‌సభలో టీడీపీ సభ్యులు 16 మంది కాగా, జనసేనకు ఇద్దరు సభ్యులు ఉన్నారు. టీఎంసీ నుంచి ఇరవై మంది సభ్యుల మద్దతు ఉండటంతో టీడీపీ, జనసేనలపై ఆధారపడే అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ టీడీపీని అంతగా విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత ఈడీ కేసులతో ఏటూ తేల్చుకోలేక బీజేపీకి లోపాయకారి మద్ధతు ఇవ్వక తప్పడం లేదు. వాస్తవానికి 2029 ఎన్నికల నాటికి లోకేశ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనబెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతున్నది. అందుకు తగ్గట్టుగానే పార్టీలో, ప్రభుత్వంలో లోకేశ్ అన్నీ తానై పనులు చక్కబెడుతున్నారు. ఆయన అనుచరులు కూడా లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ.. మారిన పరిణామాల్లో 2029 లేదా ముందస్తు ఎన్నికలు నిర్వహించే వరకూ చంద్రబాబే కొనసాగాల్సిన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయనే చర్చలు సాగుతున్నాయి. కేంద్రంలో ఎన్డీయేకు టీఎంసీ ఎంపీల రూపంలో మద్దతు లభించడంతో టీడీపీ కరివేపాకులా మారే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదు తాను చంద్రబాబుతోనే ఉంటానని పవన్ చెబితే.. జనసేన పార్టీకి సైతం అదే పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు.
ఏపీలోనూ తెలంగాణ సీన్ రిపీట్?
లోకేశ్‌ను సీఎంగా చేసేందుకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించకపోవచ్చనే వాదనలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణలో నిజామాబాద్ ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ తన కుమారుడిని సీఎం సీట్లో కూర్చోబెట్టేందుకు మోదీని సంప్రదించారని, ఈ ప్రతిపాదనకు తాను సమ్మతించలేదని మోదీ చెప్పారు. కేటీఆర్ ఏమైనా యువరాజా… ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం అని కేసీఆర్‌కు చెప్పానని ఆయనే వెల్లడించారు. దీంతో కేసీఆర్ సీఎంగా కొనసాగక తప్పలేదని, కేటీఆర్ ఆశ నెరవేరలేదని గుర్తు చేస్తున్నారు. ఏపీలోనూ ఇదే విధంగా మోదీ వ్యవహరిస్తే.. లోకేశ్ మంత్రిగానే కొనసాగాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.