హైలైట్స్:

  • ఛైర్మన్, కార్యదర్శిపై మొక్కుబడి చర్య
  • ఆగ్రహిస్తున్న విద్యావేత్తలు, తల్లిదండ్రులు
  • కొంపముంచిన టెండర్ నిబంధనల సవరణ
  • తెలంగాణలో 29 మంది చచ్చినా పట్టింపులేని సీబీఎస్ఈ

విధాత, హైదరాబాద్:

దేశంలో లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థుల మనోవేదన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వ్యవహరించిన ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా సదరు సంస్థ పై ఈగ వాలకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ తప్పిదానికి బాధ్యులు అంటూ సీబీఎస్ఈ ఛైర్మన్ రాహుల్ సింగ్ తో పాటు కార్యదర్శి హిమాంశు గుప్తాలపై కేంద్రం వేటు వేసి చేతులు దులుపుకొన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల మూల్యాంకనంలో తప్పిదాలకు పాల్పడి, 29 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు పురిగొల్పిన ఒక సంస్థకు మళ్ళీ సీబీఎస్ఈ బోర్డు ఓఎస్ఎం కాంట్రాక్టు ఇవ్వడాన్ని ఇప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత జరిగినా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ యజమాని దర్జాగా దేశంలో తిరుగుతున్నారని, కనీసం పోలీసు కేసు కూడా పెట్టకుండా వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తున్నదని విద్యార్థులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.

హైదరాబాద్ లోని మధురానగర్ కేంద్రంగా గ్లోబరీనా టెక్నాలజీస్ (కో ఎంప్ట్ ఎడ్యుటెక్) ప్రధాన కార్యాలయం ఉంది. ఈ సంస్థ 2019 లో తెలంగాణ లో 9 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల మూల్యాంకనం కాంట్రాక్టు దక్కించుకున్నది. ఇంటర్మీడియట్ అధికారులు, సంఘాల నాయకులు అభ్యంతరం చెప్పినా ఏ మాత్రం ఖాతరు చేయకుండా అప్పటి విద్యాశాఖ మంత్రి తో పాటు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరించి కాంట్రాక్టు అప్పగించారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ సాఫ్ట్ వేర్ లో లోపాల కారణంగా వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఫెయిల్ కావడం లేదా తక్కువ మార్కులు వచ్చాయని విమర్శలు ఉన్నాయి. ఈ తప్పుడు ఫలితాల కారణంగా విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధిత విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు భారీ ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాయి కూడా. గ్లోబరీనా ఫలితాలను చూసిన విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే మనస్థాపం, తక్కువ మార్కులు వచ్చాయంటూ ఒత్తిడి గురైన వారిలో 29 మంది ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనం రేపింది. ఈ ఆత్మహత్యలు రాష్ట్రాన్ని కుదుపు కుదిపాయి. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర పోరాటం చేశారు. గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయని, కాకినాడ లోని జే.ఎన్.టీ.యూ ఎగ్జామినేషన్ ఆటోమెషన్ కాంట్రాక్టు (విలువ రూ.268 కోట్లు) విషయంలో కూడా మోసం, అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపణలు కూడా చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుండడంతో అప్పటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీ విచారించి ప్రభుత్వానికి నివేదిక కూడా అందచేసింది. ఫలితాలు ఇవ్వడంలో మానవ తప్పిదాలు ఉన్నాయని, సాఫ్ట్ వేర్ డిజైన్ లో లోపాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ ఘటన పై తెలంగాణ ప్రభుత్వం బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోయింది. ఆ తరువాత ఈ వివాదం నుంచి తప్పించుకునేందుకు గ్లోబరీనా టెక్నాలజీస్ తన పేరును కో ఎంప్ట్ ఎడ్యుటెక్ గా మార్చుకున్న విషయం తెలిసిందే.

సీబీఎస్ఈ బోర్డు ఈ విద్యా సంవత్సరంలో 12వ తరగతి విద్యార్థులకు తొలిసారిగా ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) మూల్యాంకనం విధానాన్ని ప్రవేశపెట్టింది. మూల్యాంకనం ప్రక్రియలో కచ్చితత్వం, పారదర్శకత, వేగం కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ బాధ్యతను ప్రముఖ ఐటీ కంపెనీ కి కట్టబెట్టకుండా తమ చెప్పు చేతుల్లో ఉండే, ఆమ్యామ్యాలు ముట్టచెప్పే గోల్ మాల్ సంస్థకు అప్పగించడం, తప్పులు జరగడం, లక్షలాది మంది విద్యార్థుల ఫలితాలు తారుమారు కావడం తెలిసిందే. తొలిసారిగా ప్రవేశపెట్టిన ఓఎస్ఎం పై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మొత్తం 98 లక్షల జవాబు పత్రాల బుక్ లెట్లకు సంబంధించి 40 కోట్ల పేజీల స్కానింగ్ జరగ్గా, 68వేల పేజీల స్కానింగ్ లో నాణ్యత లోపించినట్లు గుర్తించినట్లు సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. టెండర్లు ఆహ్వానించే ముందు సీబీఎస్ఈ బోర్డు ఉన్నతాధికారులు నిబంధనలు సడలించారు. ప్రస్తుత ఏడాది కాకుండా గత ఏడాదిలో కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ పై ఎఫ్ఐఆర్ నమోదు అయినా, ప్రభుత్వాలు బ్లాక్ లిస్టులో పెట్టినా పర్వాలేదు అనే విధంగా టెండర్ నిబంధనల్లో సవరణలు చేశారు. తెలంగాణలో 29 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విధంగా సీబీఎస్ఈ నిబంధనలు సడలించడం శోచనీయమంటున్నారు. కీలకమైన నిబంధనలు సవరించినా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ పట్టించుకోలేదంటే ఆయన విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది సుస్పష్టమవుతుంది. ఈ నిబంధనల సడలింపులే లక్షలాది మంది 12వ తరగతి విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయి. 2019 లో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు నష్టపోయి, ఆత్మహత్యలు చేసుకున్న విధంగానే సీబీఎస్ఈ విద్యార్థుల పరిస్థితి తయారైందని విద్యావేత్తలు అంటున్నారు.

ఈ ఓఎస్ఎం టెండర్ ను దక్కించుకునేందుకు ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ రూ.950 కోట్లకు బిడ్ వేయగా, హైదరాబాద్ కు చెందిన కో ఎంప్ట్ ఎడ్యుటెక్ (గతంలో గ్లోబరీనా టెక్నాలజీస్) మాత్రం రూ.385 కోట్లకే చేస్తామంటూ కోట్ చేసింది. తక్కువ బిడ్ వేసిన కో ఎంప్ట్ కు కాంట్రాక్టు అప్పగించిన సీబీఎస్ఈ బోర్డు దేశంలోని 18.50 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఫణంగా పెట్టిందంటున్నారు. గమనించాల్సిన విషయం ఏమంటే తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలతో పరువు పోయిందని భావించిన గ్లోబరీనా టెక్నాలజీస్ తన పేరును కో ఎంప్ట్ గా మార్చుకున్నది. గ్లోబరీనా టెక్నాలజీస్ లో ఉన్న వీఎస్ఎన్ రాజు, సంస్థ పేరు మారిన తరువాత కో ఎంప్ట్ ఎడ్యుటెక్ సంస్థలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. తన ప్రయాణాన్ని ఆపకుండా ఏకంగా ఢిల్లీలోని సీబీఎస్ఈ బోర్డుపై కన్నేసి కాంట్రాక్టు దక్కించుకోవడంలో విజయం సాధించారని అంటున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే… కో ఎంప్ట్, గ్లోబరీనా ఒకటే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలియదంటున్నారు. మధురా నగర్ లో గ్రౌండ్ ప్లోర్ లో కో ఎంప్ట్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో 40 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, 4 డెస్క్ టాప్ కంప్యూటర్లు ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

గ్లోబరీనా దయ చూపిన నవీన్ మిట్టల్?

నవీన్ మిట్టల్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా ఉన్న సమయంలో 2023 నవంబర్ నెలలో బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డు మీటింగ్ లో గ్లోబరీనా టెక్నాలజీస్ కు రూ.5.70 కోట్లు బకాయిలు చెల్లించాలని ఎజెండా గా పెట్టాడని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంస్థ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కొందరు అధికారులు, ఉద్యోగ సంఘాల హెచ్చరించడంతో అప్పటి విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి వెనక్కి తగ్గారని సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సొంత అల్లుడి కన్నా ఎక్కువగా వీఎస్ఎన్ రాజు లాభపడ్డాడని ఇప్పటికీ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గ్లోబరీనా అక్రమాలను అప్పట్లో ప్రశ్నించిన తెలంగాణ ఇంటర్మిడియట్ బోర్డు జేఏసీ ఛైర్మన్ మధుసూధన్ రెడ్డి పై పరువు నష్టం దావా వేశారని గుర్తు చేసుకుంటున్నారు.

సీబీఎస్ఈ బోర్డు ఛైర్మన్ ను లోబర్చుకుని కాంట్రాక్టు?

సీబీఎస్ఈ చైర్మన్, కార్యదర్శులను లోబర్చుకుని టెండర్ దక్కించుకున్నారనే ఆరోపణలు కో ఎంప్ట్ సంస్థపై ఉన్నాయి. ఈ కాంట్రాక్టు దక్కించుకోవడంలో పదుల కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. సీబీఎస్ఈ బోర్డు ఛైర్మన్, కార్యదర్శి పై చర్యలు తీసుకున్నారు కాని కాంట్రాక్టు దక్కించుకున్న కో ఎంప్ట్ పై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతటి ఘోర తప్పిదాలకు పాల్పడి, లక్షలాది మంది విద్యార్థుల మానసిక వేదనకు కారణమైన కో ఎంప్ట్ డైరెక్టర్ వీఎస్ఎన్ రాజును అరెస్టు చేయాల్సి ఉండగా చేయలేదంటున్నారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి, దేశం విడిచి పోకుండా పాస్ పోర్టు సీజ్ చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ సంస్థలో మాజీ ఐపీఎస్ నారాయణ డైరెక్టర్ గా కూడా ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ రోజే తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి రాజును జైలులో వేసి ఉంటే ఢిల్లీలో సీబీఎస్ఈ కాంట్రాక్టు తీసుకునేవాడు కాదంటున్నారు. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ పెంచి పోషిస్తే ఈ రోజు ఢిల్లీలో చక్రం తిప్పుతూ లక్షలాది మంది విద్యార్థుల బతుకు ఆగం చేశాడంటున్నారు. మూల్యాంకనంలో అన్యాయం జరిగిందంటూ ఐదుగురు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన చిన్నదే అని చెబుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ వన్ మెన్ కమిషన్ వేశారు. తప్పిదం ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు రెండు ఐఐటీ లను రంగంలోకి దించారు. ఇదే ఘటన ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రంలో జరిగితే సుమారు ఒక వేయి మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేవారని ఒక విద్యావేత్త వ్యాఖ్యానించారు. సీబీఎస్ఈ విద్యార్థులు ధైర్యవంతులు కాబట్టి చనిపోకుండా ఓఎస్ఎం కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ అక్రమాలు, కుట్రలను ఆధారాలతో సహా తిప్పికొట్టారంటున్నారు.