కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క మృతి చెందడం సంచలన రేపింది. ఈనెల 6వ తేదిన అదృశ్యమైన జ్ఞానేశ్వరి వెంట వెళ్ళిన పెంపుడు కుక్క మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చింది. కుక్కలో వింత ప్రవర్తన, జ్ఞానేశ్వరి తల్లితో పాటుగా పలువురిని కరిచే ప్రయత్నం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. జ్ఞానేశ్వరి కోసం గాలిస్తున్న 12 పోలీస్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
గత శనివారం బాలికతో పాటు అదృశ్యమైన శునకం.. తోటలోని మకాం వద్దకు తిరిగొచ్చింది. అప్పటికే అక్కడ పెద్దసంఖ్యలో పోలీసులు, బాలిక కుటుంబ సభ్యులను చూసి మళ్లీ వెళ్లిపోయింది. ఐదు రోజుల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువకులు చాకచక్యంగా కుక్కను పట్టుకున్నారు. దర్యాప్తు క్రమంలో రెండవ సారి అడవిలోకి వెళ్లి వచ్చిన కుక్కను అధికారులు బంధించి మెడకు జ్ఞానేశ్వరి ఆచూకీని కనుగొనే క్రమంలో జీపీఎస్ అమర్చారు. అయితే కుక్క ఫామాయిల్ తోటలో, అడవిలో కొంత దూరం వెళ్లి వెనక్కి రావడం తప్ప చిన్నారి ఆచూకిపై క్లూస్ ఇవ్వలేకపోయింది. జీపీఎస్ అమర్చాక ఆ కుక్క 80 నిమిషాలపాటు పలు ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల మేర సంచరించి తిరిగి ఇంటికి చేరుకుంది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. దీంతో జ్ఞానేశ్వరి అన్వేషణలో పోలీసులకు కీలక ఆధారాన్ని కోల్పోయారు.