విధాత, హైదరాబాద్ : ఇరాన్, అమెరికాల మధ్య పరస్పర సైనిక దాడులతో అంతర్జాతీయంగా నెలకొన్న బౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. రెండు రోజుల్లోనే 2.5 శాతానికి పైగా పతనమైన బంగారం ధరలు రెండు నెలల అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,130కి పడిపోయి రూ. 1,45,640కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,950 తగ్గి రూ. 1,33,500కు దిగివచ్చింది. కిలో వెండి ధర రూ.2,60,000వద్ద స్థిరంగా ఉంది.

అమెరికా ఫెడ్ విధానాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు రానున్న రోజుల్లో బంగారం దిశను నిర్ణయించనున్నాయి.ఇటీవల నమోదైన రికార్డు స్థాయిలతో పోలిస్తే బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ నెల 19నుంచి శుభకార్యాలు తిరిగి కొనసాగనున్న నేపథ్యంలో బంగారం కొనాలనుకునేవారికి ఇది అనుకూల సమయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే స్వల్పకాలంలో ధరల్లో మరింత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు.