ఓ యువకుడు బైక్ పెట్రోల్ ట్యాంక్ పైభాగంలో ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తూ వెళ్తున్న వీడియో వర్క్ ఫ్రమ్ బైక్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ సీపీ వీసీ. సజ్జనార్ సీరియస్ అయ్యారు.
ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే… ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోందంటూ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి… కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు అని హితవు పలికారు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండని, సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండని, మీకోసం ఇంటి వద్ద ఎదురుచూసే వారిని మీరే ఇబ్బందులు పాలు చేసే చర్యలకు పాల్పడవద్దని సజ్జనార్ యువతకు సున్నితంగా హెచ్చరించారు.