విధాత : మనం బైక్ లేదా కారు కొన్నప్పుడు ఇన్సూరెన్స్ చేయించడం చట్టప్రకారం తప్పనిసరి. ఇన్సూరెన్స్ అనేది కేవలం పోలీసుల తనిఖీల నుండి తప్పించుకోవడానికి కాదు, అది ప్రమాద సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా రోడ్డున పడకుండా కాపాడే ఒక చట్టపరమైన రక్షణ కవచం.అందులో ముఖ్యంగా “థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్” అనేది ప్రతి వాహనానికి ఖచ్చితంగా ఉండాలి. అసలు ఈ థర్డ్ పార్టీ అంటే ఎవరు? ప్రమాదం జరిగితే చట్టం బాధితులకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందన్న వివరాలపై ఈ రోజుల్లో వాహనదారులందరికి అవగాహాన తప్సనిసరిగా ఉండాలంటున్నారు నిపుణులు.

ఇన్సూరెన్స్‌లో మూడు పక్షాలు (Three Parties):

​ఫస్ట్ పార్టీ (First Party): వాహన యజమాని. ​సెకండ్ పార్టీ (Second Party): ఇన్సూరెన్స్ కంపెనీ (భీమా కల్పించిన సంస్థ). ​థర్డ్ పార్టీ (Third Party): మీ వాహనం వల్ల రోడ్డుపై ప్రమాదానికి గురైన వ్యక్తి (బాధితుడు).

“థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్” చట్టపరమైన నిబంధనలు

​మోటార్ వాహనాల చట్టం, 1988 (Motor Vehicles Act) లోని సెక్షన్ 146 ప్రకారం.. భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా ఏ వాహనాన్ని అయినా పబ్లిక్ ప్లేస్‌లో నడపడం చట్టరీత్యా నేరం.
​ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ లేకపోతే సెక్షన్ 196 కింద ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానా లేదా 3 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్” కేవలం ఎదుటివారి నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది కాబట్టి దీని ప్రీమియం ధర చాలా తక్కువగా ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఎదుటి పక్షం నుండి వచ్చే కోర్టు కేసులు, చట్టపరమైన ఖర్చుల నుండి ఇది మీకు రక్షణ ఇస్తుంది. క్లెయిమ్‌ల కోసం కోర్టు విచారణలు మరియు న్యాయవాది ఫీజులను బీమా సంస్థ నిర్వహిస్తుంది.

“థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్” ముఖ్యాంశాలు..

క్లెయిమ్ పరిమితి (Liability Limits):

​మరణం లేదా శారీరక గాయాలు (Death or Bodily Injury): మీ వాహనం ఢీకొని అవతలి వ్యక్తి మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా.. ఇన్సూరెన్స్ కంపెనీ బాధితుడికి చెల్లించాల్సిన నష్టపరిహారానికి ఎటువంటి గరిష్ట పరిమితి (No Limit) లేదు. కోర్టు ఎంత ఖరారు చేస్తే అంత మొత్తాన్ని కంపెనీ చెల్లించాల్సిందే.

​ఆస్తి నష్టం (Property Damage): అవతలి వ్యక్తి వాహనం లేదా ఇల్లు ధ్వంసమైతే, గరిష్టంగా రూ. 7.5 లక్షల వరకు మాత్రమే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద లభిస్తుంది.

యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT)

​రోడ్డు ప్రమాదాల్లో నష్టపరిహారం కోరుతూ బాధితులు MACT (Motor Accident Claims Tribunal) కోర్టును ఆశ్రయించాలి. ​సెక్షన్ 166 కింద బాధితుడు లేదా అతని లీగల్ వారసులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో లేదా వారు నివసించే పరిధిలోని ట్రిబ్యునల్‌లో క్లెయిమ్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు.

​”థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్” పై అవగాహన కీలకం

​థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్” వాహనదారుడి ఆస్తిని కాపాడుతుంది. అనుకోకుండా మీ వాహనం వల్ల ఎవరైనా చనిపోతే, కోర్టులు వారి వయసు, సంపాదనను బట్టి లక్షల్లో లేదా కోట్లలో పరిహారం విధిస్తాయి. మీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే ఆ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే, ఆ కోట్లాది రూపాయల పరిహారాన్ని వాహన యజమాని తన సొంత ఆస్తులు అమ్మి అయినా సరే బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్ ముఖ్యం: మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ.. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవ్ చేసే వ్యక్తికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, లేదా మద్యం తాగి నడిపినా (Drunken Drive) ఇన్సూరెన్స్ కంపెనీ చేతులెత్తేస్తుంది. మొదట కంపెనీ కోర్టుకు డబ్బులు చెల్లించినా, ఆ తర్వాత ఆ మొత్తాన్ని యజమాని నుండి చట్టబద్ధంగా రికవరీ (Pay and Recover) చేసుకుంటుంది.