నల్గొండ జిల్లా త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన పురాతన శివలింగం, నంది, వినాయకుని విగ్రహాలను పురావస్తు శాఖ నల్గొండ జిల్లా అధికారులు గౌస్ బృందం బుధవారం పరిశీలించారు. విగ్రహాలు లభ్యమైన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి, వాటి ప్రస్తుత పరిస్థితి, స్థల చారిత్రక నేపథ్యం, గ్రామ పెద్దలు తెలిపిన వివరాలను నమోదు చేశారు.
విగ్రహాల ప్రాచీనత, చారిత్రక విశిష్టత, గ్రామ చరిత్రతో వాటికి ఉన్న అనుబంధంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి పరిశోధనల అనంతరం విగ్రహాల కాల నిర్ధారణతో పాటు వాటి చారిత్రక ప్రాధాన్యంపై అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల సందర్భంగా ఈ పురాతన విగ్రహాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. గ్రామస్తులు, గ్రామ పెద్దల సహకారంతో విగ్రహాలను భద్రపరిచి పునఃప్రతిష్ఠ చేసి నిత్యపూజలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
విగ్రహాల అస్తిత్వం, చారిత్రక విశిష్టత, గ్రామ చరిత్రపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని కోరుతూ గతంలోనే పురావస్తు శాఖకు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేసినట్లు సర్పంచ్ వివరించారు. పురావస్తు శాఖ అధికారులు గ్రామానికి వచ్చి పరిశీలనలు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమములో గ్రామ కార్యదర్శి సునీత, గ్రామ పెద్దలు పల్లపు రాములు,మాజీ ఉపసర్పంచ్ మదుపు సైదులు, పల్లపు ఎల్లయ్య, మదుపు వెంకటయ్య, p.సాయిదయ్య, బంగారి, మహేశ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.