సీఎం రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం అని, నెల నెల రెన్యువల్ కావాలంటే.. కాంగ్రెస్ హైకమాండ్ కు పైసలు కట్టాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆ పార్టీలో పైసలు తీసుకొని పదవులు అమ్ముకుంటున్నారని చెప్పడం వాస్తవం అన్నారు. సీఎం పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి.. రాహుల్ గాంధీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడని కేటీఆర్ ఆరోపించారు. గతంలో పీసీసీ పదవిని రేవంత్ రెడ్డికి రూ.50కోట్లకు అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం చెప్పారని గుర్తు చేశారు.

హైడ్రాతో రేవంత్ రెడ్డి సాగిస్తున్న పేదోళ్ల ఇండ్ల కూల్చివేత చర్యలను ఆపేయాలని మీనాక్షి నటరాజన్‌ చెప్పినందుకే..ఆమెపై పగబట్టి.. ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దు అయ్యేట్లు కేసు వివరాలు లీక్ చేశాడని, సొంత పార్టీ వాళ్లకే న్యాయం చెయ్యనోడు.. రాష్ట్రానికి న్యాయం చేస్తాడంటూ కేటీఆర్ విమర్శించారు. ఎన్నడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి ఆయనే తెలంగాణ సాధించినట్లు మాట్లాడుతున్నాని, .. సమయం బాలేనప్పుడు వానపాములు కూడా నాగుపాముల లాగా బుస కొడతాయన్నారు. అమ్మ విలువ, అన్నం విలువ.. లేనప్పుడే తెలుస్తదని, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్, కేసీఆర్ విలువ అర్థమవుతుందన్నారు. రెండున్నరేళ్లలో రూ.4లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఒక్క మంచిపని చేయలేదని, ఎన్నికల హామీలు అమలు చేయలేదని విమర్శించారు. హిట్లర్ స్ఫూర్తి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి నుంచి ఇంతకంటే ఏం ఆశించలేమన్నారు. రాష్ట్రంలో రైతు బంధు బంద్ అయ్యిందని, కాని రాహుల్ బంధు కొనసాగుతుందన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం.. కాంగ్రెస్ పార్టీ అందరిని బురిడీ కొట్టించింది. సర్ జరిగిన ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించారని, పశ్చిమ బెంగాల్‌లో 95 లక్షలు, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తీసేశారని, అందుకే ఆయా రాష్ట్రాలలో ఎన్డీఏ గెలిచిందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో మాసీ సీఎం స్టాలిన్ నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగించడంతోనే, అయన 10 వేల తేడాతో ఓడిపోయారన్నారు. తెలంగాణలో జూన్ 25 నుండి సర్ ను తీసుకొస్తున్నారు.. మనం జాగ్రత్తగా ఉండాలని కేడర్ ను కోరారు.