కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు స్మృతి ఇరానీకి అనూహ్య షాక్ ఎదురైంది. ఆమె నివసిస్తున్న గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా నుంచి ఆమె పేరు అదృశ్యమైంది. 2019లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథి నుంచి లోక్ సభకు ఎంపీగా ఎన్నికైన స్మృతి ఇరానీ ..ఆ తర్వాత ఇదే నియోజకవర్గం పరిధిలోని మేదాన్ మావయ్ గ్రామంలో సొంత ఇల్లు నిర్మించుకుని, అదే పంచాయతీలో తన ఓటును నమోదు చేసుకున్నారు.
ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ అక్కడి నుండే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా నుంచి స్మృతి ఇరానీ పేరు మాయమైంది. దీనిపై బీజేపీ నేతలు ఆమేథి జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేయగా..విచారణకు ఆదేశించారు. సర్ తో లక్షలాది మంది ఓటర్ల ఓట్లు తొలగిస్తున్నారన్న ప్రతిపక్షాలు ఓవైపు విమర్శిస్తున్న నేపథ్యంలో..ఏకంగా అధికార బీజేపీ మాజీ కేంద్ర మంత్రి ఓటు కూడా గల్లంతు కావడం చర్చనీయాంశమైంది.