మాజీ మంత్రి షబ్బీర్ ఆలీకి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ పంపింది. మహేశ్ కుమార్ డబ్బులు తీసుకొని పదవులు అమ్ముకుంటున్నారనడంతో పాటు, మహిళలను కించిపరిచేలా షబ్బీర్ అలీ మాట్లాడిన ఓ ఆడియో లీక్ కావడం వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారంపై ఏఐసీసీ వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో సీరియ్ అయిన ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షబ్బీర్ ఆలీకి షోకాజ్ నోటీస్ పంపించడం గమనార్హం. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంపై వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను పబ్లిక్‌లో చర్చకు తీసుకురావడంపై కూడా ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

మరోవైపు.. కామారెడ్డి కాంగ్రెస్‌లో షబ్బీర్ అలీ వర్గం చంద్రశేఖర్ రెడ్డి వర్గం మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో టీపీసీసీ జనరల్ సెక్రటరి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య అయిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ తమపై సోషల్ మీడియాలో అనుచిత విమర్శలు చేస్తున్నారంటూ కామారెడ్డి జిల్లా ఎస్పీకి షబ్బీర్ అలీపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ పరిణామాలతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరింత రచ్చకెక్కాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గురించి షబ్బీర్ అలీ తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఇందుప్రియ హెచ్చరించారు. షబ్బీర్ అలీ అన్న కొడుకు తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాననే తన మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ అరాచకాల గురించి రాహుల్ గాంధీకి సైతం ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ కావడం విశేషం.