హైడ్రా కమిషనర్ ను మార్చాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చాకా ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి డి.శ్రీధర్ బాబు తెలిపారు. సీఎంతో చర్చించాకే అసెంబ్లీ సమావేశాల తేదీలపై కూడా నిర్ణయం తీసుకుంటాం అని వెల్లడించారు. హైడ్రా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో విజయవంతంగా పనిచేసిందని, హైడ్రాపై బీఆర్ఎస్, బీజేపీ వాళ్లే పిటిషన్లు దాఖలు చేశారని, ఆ పార్టీలే హైడ్రాకు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్నాయని శ్రీధర్ బాబు విమర్శించారు.
హైడ్రా వేరు..కోర్టు ధిక్కరణ వేరు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాతో లాభమే తప్ప నష్టం లేదని..హైడ్రాను..కోర్టు ధిక్కరణ సమస్యలను వేర్వేరుగా చూడాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పలు స్టాండింగ్ కమిటీల సమావేశాలలో భాగంగా హామీల అమలు కమిటీ సమావేశానికి సభ్యుడైన అనిరుధ్ రెడ్డి హాజరయ్యారు.
అధికార పార్టీ సభ్యుడిగా తను ఏడాది క్రితమే ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్ లపై కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని కమిటీని అడుగడం జరిగిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులపై ఉన్న కోర్టు ధిక్కరణ వివరాలను నేనే అసెంబ్లీలో పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ చెరువుల పరిరక్షణకు కృషి చేశారన్నారు.