టెలివిజన్ అవార్డుల కమిటీ సభ్యులు సూచించిన విధంగా టెలివిజన్ అవార్డులకు మాజీ ప్రధానమంత్రి పీ.వీ. నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని సీఎం ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న టెలివిజన్ (టీవీ) అవార్డుల రూపకల్పన, మార్గదర్శకాలు, లోగో, అవార్డుల పేర్లు తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షతన టెలివిజన్ అవార్డుల కమిటీతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో టెలివిజన్ అవార్డులకు ప్రత్యేక లోగో రూపకల్పన, అవార్డులకు ప్రముఖ వ్యక్తి పేరును ప్రతిపాదించడం, వివిధ విభాగాల్లో అవార్డుల ప్రదానం, ఎంపిక విధానం, అవార్డుల ప్రదానోత్సవ వేదిక వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… బహుభాషా కోవిదుడైన పీ.వీ. నరసింహారావు దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన మహనీయుడని, అలాంటి మహోన్నత వ్యక్తుల పేర్లను పరిశీలించడంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు.
టెలివిజన్ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి
టెలివిజన్ అవార్డులకు సంబంధించిన మార్గదర్శకాలు, లోగో, అవార్డుల పేర్లు తదితర అంశాలను వీలైనంత త్వరగా సిద్ధం చేసి సమర్పించాలని కమిటీని మంత్రి ఆదేశించారు. అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మను, సంస్కృతిని, ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. టెలివిజన్ రంగం అత్యధిక వినోదాన్ని అందించే మాధ్యమమని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టెలివిజన్ కార్యక్రమాల పట్ల విశేష ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రదానం చేయనున్న ఈ టెలివిజన్ అవార్డులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, అవార్డు గ్రహీతల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలని కమిటీ చైర్మన్, సభ్యులకు మంత్రి సూచించారు. టెలివిజన్ రంగంలో ప్రతిభ కనబరిచిన అన్ని విభాగాల కళాకారులు, సాంకేతిక నిపుణులు, మంచి సామాజిక సందేశాలను అందించే సీరియళ్లు, కార్యక్రమాలు, బాలల చిత్రాలను రూపొందించే వారిని ప్రోత్సహించేలా అవార్డులను రూపొందిస్తామని తెలిపారు.
అవార్డుల నిర్వహణలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ముకుంద రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, అవార్డుల ప్రదానోత్సవానికి రెండు లేదా మూడు వేదికల ఎంపికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వచ్చిన అన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం టెలివిజన్ అవార్డులపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ ముకుంద రెడ్డి, టెలివిజన్ అవార్డుల కమిటీ చైర్మన్, సభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.