విధాత, హైదరాబాద్ : ఖైరతాబాద్ ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో అవకతవకలు జరిగాయంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ హౌసింగ్ బోర్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డు అధికారి గౌతమ్ తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని దానం నాగేందర్ విమర్శించారు. అధికారుల ప్రవర్తనతో 1000రోజుల కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందని పరిస్థితి నెలకొందన్నారు. అధికారుల తీరును అసెంబ్లీలో ప్రశ్నిస్తానని దానం స్పష్టం చేశారు.అధికారులు కనీసం ప్రోటో కాల్ కూడా పాటించకుండా ఇష్టా రాజ్యంగా చేస్తున్నారన్నారు. బీహార్ సహా ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు వస్తుంటారు..పోతుంటారని, మేం ఇక్కడ స్థానికంగా ఉండటోళ్లం అని, ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.
ప్రభుత్వంపై నాకు అసంతృప్తి లేదని, ప్రభుత్వం బాగానే పనిచేస్తుందని..అధికారులే తప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇందులో ఏదో కుట్ర జరుగుతుందని, ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సరైన పద్దతిలో సంక్షేమ పథకాలు అందాల్సి ఉందని దానం స్పష్టం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి కేటాయించాల్సిన 480 ఇళ్లలో 120 ఇళ్లే ఇచ్చి, నియోజకవర్గానికి సంబంధం లేని వారికి కేటాయించారని ఆయన ఆరోపించారు. ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలను చూస్తే అధికారులు భయపడి చెప్పిన పని చేస్తున్నారని, అదే మేం చెబితే వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలు అధికారుల గల్లా పట్టుకుంటారన్న భయంతో పనులు చేస్తున్నారని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రస్తుతం 500 ఇళ్లు, తర్వాత వరుసగా మరో 500 ఇళ్ల చొప్పున విడతల వారిగా నా నియోజకవర్గంలో 10వేల ఇళ్ల వరకు అందిస్తామని చెబుతుంటే..అధికారులు మాత్రం 120ఇళ్లు ఇచ్చారని, వారు వచ్చి మా ఇల్లు ఎక్కడుందో చూపించమంటున్నారని, వారికి చూపిస్తే మిగతా వారు వచ్చి మా గల్లా పట్టుకుంటారన్నారు. అందుకే అధికారుల పనితీరు సరిగా లేదంటున్నానని స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై నాకేం అసంతృప్తి… ఏదో కుట్ర జరుగుతోంది, నేను మాత్రం ఊరుకోను!
– Telugu360 తో ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే దానం నాగేందర్#DanamNagender #TelanganaPolitics #Congress pic.twitter.com/Ovy7ZaUh85
— Telugu360 (@Telugu360) September 1, 2026