తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నెంబర్లలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నంబర్‌ కూడా ఉండటంతో.. ఆయన స్టేట్‌మెంట్‌ను సిట్‌ రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్‌ ట్యాప్‌ అయినట్లు పోలీసులు తెలిపారు. సిట్ అధికారులు మంత్రి తుమ్మల ఇంటికెళ్లి.. ఆయన వినియోగించిన నంబర్‌ చూపి వివరాలు, స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకున్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో (2014-2023) సుమారు 4,000 నుంచి 6,000 వరకు ఫోన్లు అక్రమంగా ట్యాపింగ్‌కు గురయ్యాయని సిట్ (SIT) విచారణలో వెల్లడైంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులను, పలు పార్టీల నాయకులను, వ్యాపారులను సిట్ అధికారులు విచారించారు. అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లను, జడ్జీలు, జర్నిలిస్టులు, సెలబ్రెటీల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ విచారణలో వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ బాధితులైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్లను సిట్ తీసుకుంది. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను, ఓఎస్​డీగా ఉన్న రాజశేఖర్ రెడ్డిని, మాజీ మంత్రి హరీశ్ రావును, కల్వకుంట్ల కవితలను సైతం సిట్ విచారించింది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విరాళాలకు, ఈ ట్యాపింగ్ బెదిరింపులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో సిట్ విచారణ కొనసాగించింది.

పక్కాగా సాక్ష్యాలు..ఆధారాలు

కేసులో సమగ్ర దర్యాప్తు కోసం హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో డిసెంబర్ 18న సిట్‌‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే. టెలికాం సర్వీసెస్​అందించిన 618 ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా దాదాపు 450 మందికి పైగా స్టేట్‌‌మెంట్లను సిట్ రికార్డ్‌‌ చేసింది. తుది చార్జిషీట్‌ను సిద్ధం చేసే పనిలో పడింది. కేసులో బలమైన సాక్ష్యాలుగా 2,500 కు పైగా ఫోన్ ట్యాపింగ్‌‌ ఆధారాలు, ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ రిపోర్టులతో కూడిన అభియోగ పత్రం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దర్యాప్తులో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌, పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్ సహా కీలక నేతల స్టేట్‌‌మెంట్లను రికార్డ్‌‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌‌చార్జి శ్రీరాంరెడ్డి స్టేట్‌‌మెంట్‌‌ను గత నెల 25న రికార్డ్‌‌ చేసింది.

ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలను, ఇప్పుడు శనివారం మంత్రి తుమ్మల స్టేట్ మెంట్లను సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకోనున్నట్లుగా కనిపిస్తుంది. నెల రోజుల వ్యవధిలో60 మంది ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులను సిట్‌ అధికారులు విచారించారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరికొందరు రాజకీయ ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది. తుది చార్జిషీట్‌‌లో ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుసహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు,శ్రవణ్‌‌రావుతోపాటు మరికొంత మందిపై అభియోగాలు మోపనున్నట్టు తెలిసింది. ఇందులో కేసీఆర్ పేరును నిందితుడు గా చేరుస్తారా లేక సాక్షి గా ఉంచుతారా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఉన్నతాధికారులు అరెస్టయి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.

టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్ ఆధారాలతోనే కేసు ముందుకు..

గత బీఆర్ఎస్ హాయంలో ఎస్‌ఐబీ మాజీ అధికారి ప్రభాకర్‌రావు బృందం సాగించిన ఫోన్ ట్యాపింగ్ వివరాల విలువైన డేటాను శాసన సభ ఫలితాల వెలువడిన వెంటనే ధ్వంసం చేశారు. ట్యాపింగ్ వివరాలతో కూడిన 43 హార్డ్​డిస్క్​లను కట్టర్లతో ముక్కలుగా చేశారు. ఆ ముక్కలను మూసీ నదిలో పడేయడంతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను కాల్చేశారు. అలాగే ఆ బృందంలోని ప్రతి సభ్యుడి ఫోన్​, ల్యాప్​టాప్​ల్లోని డేటాను తొలగించి ఫార్మాట్​ చేశారు. అయినప్పటికీ దర్యాప్తు బృందానికి చిక్కకుండా వారు తప్పించుకోలేకపోయారు.

ముఖ్యంగా కేసులో టెలికాం సర్వీస్​ ప్రొవైడర్​లు(టీఎస్​పీలు) కొంత ఆలస్యంగా పంపించిన లేఖలే దర్యాప్తును ముందుకు నడిపిస్తున్నాయి. ప్రభాకర్​ రావు బృందం అక్రమంగా ట్యాప్​ చేసిన ఫోన్లకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖలను టెలికాం సర్వీస్​ ప్రొవైడర్స్​ – టీఎస్​పీలైన జియో, బీఎస్​ఎన్​ఎల్​, ఎయిర్​టెల్​ ఎస్​ఐబీ ఆఫీస్​కు పంపించాయి. అప్పటికే ప్రభాకర్​రావు బృందం ఎస్​ఐబీ నుంచి వెళ్లిపోవడంతో ఆ లెటర్స్ వారి చేతికి చిక్కలేదు. లేకపోతే ఆ ఆధారాలను సైతం మాయం చేసే వారని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు భావిస్తున్నారు.