తమిళనాడులో సీఎం విజయ్ సారధ్యంలోని టీవీకే ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి ఎన్.మేరీ విల్సన్ బడ్జెట్ లో పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మహిళలు, నవజాత శిశువుల సంక్షేమం కోసం దాదాపు రూ.1,000 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. పెళ్లి చేసుకోబోయే యువతులకు ‘అన్నన్ సీర్’ (అన్న ఇచ్చే సారె) పథకం కింద 8 గ్రాముల (1 తులం) బంగారు నాణెం, పట్టు చీరను అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.812 కోట్లు కేటాయించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు ‘తాయ్ మామన్ తంగ మోతిరం థిట్టం’ (మేనమామ బంగారు ఉంగరం పథకం) కింద 1 గ్రాము బంగారు ఉంగరాన్ని సీఎం విజయ్ కానుకగా అందించనున్నారు. సర్కార్ ఆసుపత్రుల్లో ప్రసవాలను మరింత పెంచడం, తల్లీపిల్లల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా తెచ్చిన ఈ ఉంగరం పథకానికి రూ.560 కోట్లు కేటాయించారు.
వీటితో పాటు నిరుపేద వితంతువులు, వదిలేయబడిన మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగుల ఆర్థిక చేయూత కోసం “వెట్రి మగళిర్ మేకల పెంపకం పథకం” కింద 30,000 మందికి 100 శాతం సబ్సిడీతో 5 మేకలు లేదా గొర్రెలను పంపిణీ చేయనున్నారు. గ్రామీణ మహిళల జీవనోపాధిని పెంచేందుకు ఏడాదికి 10,000 మంది అర్హులైన మహిళలకు ఉచితంగా పాడి ఆవులను అందించడానికి రూ.57 కోట్లు కేటాయించారు. మత్స్యకారుల వేట నిషేధ కాలపు భృతిని రూ.6,000 నుండి రూ.7,000కి పెంచడంతో పాటు చెన్నై రవాణా సంస్థ (MTC) కోసం 1,000 కొత్త ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు రూ.500 కోట్లను కేటాయిస్తూ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్, పారిశ్రామిక శిక్షణ సంస్థలకు చెందిన ఐదు లక్షల మంది విద్యార్థులకు, అధ్యాపకులకు లబ్ధి చేకూర్చేలా రూ.10 కోట్ల ప్రారంభ నిధితో తమిళనాడు విద్యార్థుల వసతిగృహాలు, మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి విజయ్ ఒక అన్నగా, తమ్ముడిగా ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.