హైలైట్స్:
- తీవ్ర ఆర్థిక సంక్షోభంతో 3 నెలల క్రితం డెసిషన్
- హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగులకు ఊరట
- ఉచితాలతో కుదేలవుతున్న రాష్ట్రాలు
అలవికాని సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీల కారణంగా రాష్ట్రాలు ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. అధికారమే పరమావధిగా నెరవేర్చుతున్న ‘ఉచిత హామీలు’ నిద్రహారాలు మాని సర్కారీ కొలువు సాధించిన ఉద్యోగులకు నిద్రలేని రాత్రులు కల్పిస్తున్నాయి. తొలుత తమిళనాడు ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైన ఉచిత పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ పథకాల మూలంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రతి వారం లేదా రెండు వారాలకు ఒకసారి రిజర్వ్ బ్యాంకు లేదా జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చుకుంటే కాని పరిపాలన సాగించలేని దుస్థితికి కొన్ని రాష్ట్రాలు చేరుకున్నాయి.
తొలిసారి హిమాచల్‌లో
దేశంలోనే మొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు కొద్ది నెలల క్రితం సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరిస్థితి దీనావాస్థలో ఉందంటూ చేతులు ఎత్తేశారు. దాని ఫస్ట్ ఎఫెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులపై పడింది. సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతినెలా ప్రభుత్వం చెల్లిస్తున్న జీతంలో ఎంత మేరకు కోత విధించుకుంటారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలనేది ఆ నోటిఫికేషన్ సారాంశం. దీనిపై ఉద్యోగ వర్గాలు ఒక్కసారిగా భీతిల్లిపోయాయి. ఇదేం నిర్ణయమంటూ భగ్గుమన్నాయి. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో సీఎం వెనక్కి తగ్గారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండటం, ఖజానాకు ఆదాయం పెరగటంతో గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
సీఎం నుంచి ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల వరకూ…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సుఖ్వీందర్ సుఖు ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులపాటు పాలన బాగానే సాగింది. కానీ రాబడికి, వ్యయానికి మధ్య భారీ వ్యత్యాసం పెరిగిపోయింది. తెచ్చిన అప్పులు కూడా సరిపోకపోవడంతో పొదుపు చర్యలకు ఉపక్రమించారు. గత మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. సర్కార్ ఉద్యోగులు తమ జీతాలు తగ్గించుకోవాలని, దీనిపై ఉద్యోగులే స్వయంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ (ఆర్.డీ.టీ) నిలిపివేయడం మూలంగా ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్య మూలంగా ప్రతి సంవత్సరం రూ.8వేల కోట్లు నష్టపోతున్నట్టు వివరించారు. చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే రూ.1 లక్ష కోట్ల అప్పుల భారంతో కూరుకుపోయిందన్నారు.
ముఖ్యమంత్రి సుఖు ఆదేశం మేరకు గత ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ జారీ కావడం, ముఖ్యమంత్రి తన జీతంలో 50 శాతం, మంత్రులు 30 శాతం తగ్గించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాత్రం తమ జీతాల కోతను పెండింగ్ లో పెట్టారు. ఎమ్మెల్యేలు కూడా 20 శాతం వేతనాలు తగ్గించుకోక తప్పలేదు. ప్రజా ప్రతినిధులే కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శులు, ముక్య కార్యదర్శులు, కార్యదర్శులు, డీజీపీ, అదనపు డీజీపీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్సు, అఖిల భారత సర్వీసు అధికారులందరూ తమ వేతనాల్లో 30 శాతం కోత విధించుకుని విలవిల్లాడిపోయారు. ఇదేమి విధానం అంటూ అఖిల భారత సర్వీసు అధికారులు లోలోపల మథనపడ్డారు కానీ బహిరంగంగా విమర్శలు చేయలేని దుస్థితి వారిది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ జీతాలను తగ్గించుకుని, ఎంత మేర తగ్గించాలనేది తెలియచేయాలని సూచించింది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. కాని ఏమి చేయలేని పరిస్థితి వారికి ఏర్పడింది. ఈ నిర్ణయం ఆరు నెలల పాటు అమలులో ఉంటుందని ప్రకటించారు.
వచ్చే నెల నుంచి అందరికీ పూర్తి జీతాలు…
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో వచ్చే నెల నుంచి అందరికీ పూర్తి జీతాలు చెల్లిస్తామని, కోతలు ఉండవని సీఎం సుఖ్వీందర్ సింగ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి దేవేశ్ కుమార్, ప్రత్యేక కార్యద్రశి సౌరభ్ జస్సాల్, సీఎం కార్యదర్శి ఆశిష్ సింఘమర్ పాల్గొన్నారు. ఆర్థిక పురోగతి పై తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని, ఆశాజనంగా ఆదాయం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 65 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న ఫించన్ దారులకు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన ఆర్థిక శాఖ ను ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఓల్డ్ ఫించన్ స్కీమ్ (ఓపీఎస్) ను పునరుద్ధరించడంతో కేంద్ర ప్రభుత్వం రూ.1,200 కోట్ల ఆర్థిక గ్రాంటును నిలిపివేసిందన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ పింఛన్‌దారుల జేఏసీ ప్రతినిధులు ఆదివారం సీఎం సుఖును కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రతి నెలా ఏ తేదీన పింఛన్‌దారులకు డబ్బులు ఇచ్చే తేదీలను స్పష్టంగా ప్రకటించాలని కోరారు. వారి కోరిక మేరకు ప్రతి నెలా ఏడు నుంచి 10వ తేదీ మధ్య పెన్షనర్లకు సొమ్మును ఆన్‌లైన్ ద్వారా ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు. ఇందుకోసం ప్రతి నెలా రూ.23 కోట్లు ప్రత్యేకంగా కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గత బీజేపీ పాలనలో మూడు నెలలకు ఒకసారి పెన్షన్ సొమ్ము విడుదల చేసేదని ఆయన గుర్తు చేశారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల కోసం తక్షణమే రూ.20 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని, జీతాలు, పెన్షన్ల చెల్లింపులో ఇక నుంచి సమస్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ ప్రతి సంవత్సరం రూ.1,500 కోట్ల వరకు ఆదాయం వస్తున్నదని, టిక్కెట్ల ద్వారా రూ.800 కోట్లు, ప్రభుత్వం రూ.720 కోట్ల గ్రాంట్ మంజూరు చేస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల బస్సులు నడుస్తున్నాయని, ఇంధన ధరల పెరుగుదలతో నిర్వహణ వ్యయం భారం అయ్యిందని, ఫలితంగా సంస్థపై భారం పెరగుతోందని సీఎం సుఖ్వీందర్ సుఖు ఆందోళన వ్యక్తం చేశారు.