సంక్షేమ పథకాల అమలుపై ‘సర్’ దెబ్బ

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ‘సర్’ ప్రకారమే సంక్షేమ పథకాల లబ్ధిదారులను కొనసాగించాలని ఆదేశించింది. ‘సర్’లో తొలగించిన పేర్లను సంక్షేమ పథకాలలో కొనసాగించవద్దని తేల్చి చెప్పింది. బీహార్‌లోని బీజేపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి బ్యాంకు పాసు పుస్తకాలు కూడా రద్దు చేస్తామని ప్రకటించడంతో ప్రజల్లో భయం మొదలైంది. ఈ కార్యక్రమం ప్రజలకు కొత్త సమస్యలు తెచ్చేదిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంక్షేమ పథకాల అమలుపై ‘సర్’ దెబ్బ
  • పశ్చిమ బెంగాల్‌లో తొలి ఎఫెక్ట్‌
  • బీహార్‌లోనూ పాస్ పుస్తకాలు రద్దు
  • మున్ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు?

విధాత, హైదరాబాద్:

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) ప్రజల పాలిట శాపంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. బోగస్, నకిలీ, అనర్హుల ఓట్ల తొలగింపు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు రెండు విడతల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నిర్వహించింది. త్వరలో మూడో విడత సర్ కార్యక్రమం తెలంగాణలో కూడా ప్రారంభం కానున్నది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో బూత్ లెవెల్ అధికారులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. సుమారు ఆరు నెలల పాటు తెలంగాణలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం కొనసాగనున్నది. అయితే ఈ కార్యక్రమం ప్రజలకు కొత్త సమస్యలు తెచ్చేదిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ‘సర్’ ప్రకారమే సంక్షేమ పథకాల లబ్ధిదారులను కొనసాగించాలని ఆదేశించింది. ‘సర్’లో తొలగించిన పేర్లను సంక్షేమ పథకాలలో కొనసాగించవద్దని తేల్చి చెప్పింది. బీహార్‌లోని బీజేపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి బ్యాంకు పాసు పుస్తకాలు కూడా రద్దు చేస్తామని ప్రకటించడంతో ప్రజల్లో భయం మొదలైంది.

దేశవ్యాప్తంగా బోగస్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, నియోజకవర్గాలు మారిన వారి పేర్లు తొలగింపు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో చనిపోయిన ఓటర్ల పేర్లు, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం మారిన వారి పేర్లు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం మారిన వారు, రెండు మూడు నియోజకవర్గాల్లో పేర్లు ఉంటే ఒకటే పేరును కొనసాగించడం, బోగస్ సర్టిఫికెట్లతో ఓటు హక్కు పొందిన వారి పేర్లను తొలగించే ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నది. ఇదే పేరుతో అనేక మంది పేర్లను అనుమానాస్పద జాబితాల్లోకి చేర్చారు. ఇప్పటి వరకు గత ఏడాది అక్టోబర్ లో మొదటి సారి, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రెండోసారి సర్ ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లో 2.05 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో 83.86 లక్షలు, గుజరాత్‌లో 68 లక్షలు, మధ్యప్రదేశ్‌లో 34.25 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో 25 లక్షలు, రాజస్థాన్ 31 లక్షలు, తమిళనాడు 74 లక్షలు, కేరళం 9 లక్షలు, గోవా 1.28 లక్షలు, పుదుచ్చేరి 77వేలు, అండమాన్ నికోబార్ దీవులు 52వేలు, లక్షద్వీప్‌లో 206 ఓట్లు తొలగించారు. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం ఓటర్లు 50 కోట్ల 99 లక్షలు కాగా సర్ ప్రక్రియలో 5 కోట్ల 18 లక్షల పేర్ల తొలగింపు తరువాత 45 కోట్ల 81 లక్షల ఓటర్లు మాత్రమే మిగిలారు. మొత్తం ఓటర్లలో 10.2 శాతం ఓటర్లను తొలగించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో అత్యధికంగా తీసివేశారు. ఈ బోగస్, నకిలీ, అనర్హుల ఓటర్ల పేర్లు తొలగింపు మూలంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ఓటమి పాలయ్యారు. తమ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లను సర్ లో భాగంగా తొలగించినా మిన్నకుండి పోవడంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఏరివేత మొదలు…

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సువేందు అధికారి కఠిన చర్యలకు దిగారు. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మాణం కోసం ఆమోదం తెలిపారు. సరిహద్దు దాటి వచ్చే వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయాలని ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 7.69 కోట్ల ఓటర్లు ఉండగా సర్ తరువాత 83.86 లక్షల ఓటర్ల పేర్లు తొలగించడంతో ప్రస్తుతం 6.86 కోట్ల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇలా తొలగించిన వారి పేర్ల ను సంక్షేమ పథకాల జాబితా నుంచి కూడా తీసివేయాలని సువేందు అధికారి ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సర్ తరువాత రూపొందించిన ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. సర్ లో పేర్లు తీసివేయబడిన వారు సంక్షేమ పథకాలకు అర్హులు కారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అగ్నిమిత్ర పౌల్ కూడా స్పష్టంగా చెప్పారు. సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్టు (సీఏఏ) కింద పేర్లు నమోదు చేసుకున్న వారికి సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు.

బెంగాల్‌ను అనుసరిస్తున్న బీహార్

బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి రాష్ట్ర ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారికి ఇక నుంచి సంక్షేమ పథకాలు నిలిపివేయాలని ఆదేశించారు. రేషన్ సరకులు కూడా ఆపివేయాలన్నారు. బ్యాంకులలో పాసు పుస్తకాలు కూడా రద్దు అవుతాయని తెలిపారు. ఇప్పటికే రెండు బీజేపీ రాష్ట్రాలు ముందడగు వేయగా మున్ముందు బీజేపీ పాలిత రాష్ట్రాలు సర్ ను ప్రామాణికంగా చేసుకుని కఠిన చర్యలకు దిగే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే దేశంలో పెద్ద ఎత్తున బీదలు, సామాన్యులు, నిరక్షరాస్యులు సంక్షేమ పథకాలు అందక నష్టపోయే ప్రమాదముందని అంటున్నారు.

సంక్షేమ పథకాలు ఆపడం దారుణం… విపక్షాలు

పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సర్ ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం సరికాదని విమర్శిస్తున్నాయి. పౌరసత్వం ఆధారంగా ఓటర్ల జాబితాలో పేరు నమోదు, తొలగింపులు చేస్తారా అని నిలదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని విపక్షాలు కోరుతున్నాయి.

Read Also |

పొదుపు చర్యలు ప్రారంభించిన సుప్రీంకోర్టు
ప్రియురాలి మోసం..యువకుడి ఆత్మహత్య