హైలైట్స్:
- రేవంత్ సర్కారుకు ఎదురుదెబ్బ
- తెలంగాణ బీజేపీ ఫిర్యాదుతో ఆగిన ప్రయత్నం
విధాత, హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను సర్ ప్రక్రియలో ధృవీకరణ పత్రంగా ఆమోదించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. జూలై 25, 2026కు ముందు జారీ అయిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను మాత్రమే సర్-2026 ధృవీకరణ కోసం పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ప్రజా ప్రతినిధుల వినతి మేరకు తెలంగాణ ప్రభుత్వం జూలై 25వ తేదీన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించిన రెండు రోజుల వ్యవధిలో మంజూరు చేయాలని మండల తహశీల్దార్లను ఆదేశించింది. దీని కోసం ప్రజలు పెద్ద ఎత్తున మీ సేవా కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాలకు క్యూ కట్టారు.
ఈ ఉత్తర్వుపై బీజేపీ తెలంగాణ శాఖ తీవ్ర అభ్యంతరం తెలియచేసింది. ఒక వర్గానికి చెందిన ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అక్రమంగా జీఓ జారీ చేశారని ఆరోపించింది. ఎట్టి పరిస్థితుల్లో సర్ ధృవీకరణలో లో ఈ సర్టిఫికెట్ ను ఆధారం చేసుకుని ఓటు హక్కు కల్పించవద్దని బీజేపీ ప్రతినిధి బృందం తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని కలిపి ఫిర్యాదు చేసింది. ప్రతినిధి బృందం అందచేసిన ఫిర్యాదును పరిశీలించిన తెలంగాణ సీఈఓ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ కుమార్ బుధవారం స్పందించారు. గతంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను మండల తహశీల్దార్ సంబంధిత డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించి, తనిఖీ చేసిన తరువాతే జారీ చేసేవారని తన లేఖలో ప్రస్తావించారు. సర్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మరో రూపంలో ఫ్యామిలీ రిజిష్టర్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నదన్నారు. ఎలాంటి తనిఖీలు లేకుండా కేవలం రెండు రోజుల వ్యవధిలో ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఫుడ్ సెక్యురిటీ కార్డులో ఉన్న డేటా ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తున్నారన్నారు. జీఓ ఎంఎస్ నెంబర్ 172 ప్రకారం ఎలాంటి ముందస్తు విచారణ, తనిఖీ లేకుండా మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. సర్ ప్రక్రియ ముగిసే వరకు ఈ సర్టిఫికెట్ ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కు, తాజాగా జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిష్టర్ సర్టిఫికెట్ కు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. ఫ్యామిలీ రిజిష్టర్ సర్టిఫికెట్ అంటే రేషన్ కార్డుతో సమానం అని, దాన్ని సర్ లో ఎలా ప్రామాణికంగా తీసుకుంటామని ఎన్నికల కమిషన్ అభ్యంతరం లేవనెత్తింది.