Special Intensive Revision | ‘సర్’ మోగిస్తున్న మరణ మృదంగాలు! పని ఒత్తిడితో తాజాగా గుజరాత్‌లో బీఎల్‌వో బలవన్మరణం
కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా చేపడుతున్న స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ బీఎల్‌వోలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నది. ఈ క్రమంలోనే పలువురు పని ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా గుజరాత్‌లో అటువంటి విషాకర మరణం చోటు చేసుకున్నది.
Special Intensive Revision | ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR).. దేశవ్యాప్తంగా మరణ మృదంగాలను మోగిస్తున్నది. ప్రత్యేకించి ఈ విధుల్లో ఉంటున్న బీఎల్‌వోలు పని ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాలకు గురవుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే దేశంలో పలు చోట్ల ఇటువంటి ఘటనలు వెలుగు చూశాయి. మోయలేని పనిభారం, దాంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న కొందరు బూల్ లెవెల్ ఆఫీసర్స్.. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశంలోని పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను చేపడుతున్న విషయం తెలిసిందే.
తాజాగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన బీఎల్‌వో అరవింద్ ముల్జీ.. తన స్వగ్రామం దేవ్లీలో బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు ఆయన రాసిన లేఖ.. ఎస్‌ఐఆర్ నిర్వహణలో ఎంతటి ఒత్తిడి ఉంటున్నదో స్పష్టం చేస్తున్నది. అరవింద్.. కొడినార్‌లోని ఛారా కాన్యా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఉరిపోసుకున్నారు. ‘ఎస్‌ఐఆర్ వర్క్ చేయడం ఇక నా వల్ల కావడం లేదు. కొద్ది రోజులుగా బాగా అలిసిపోతున్నాను. మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. నువ్వు, బాబు జాగ్రత్త! మీ ఇద్దరంటే నాకు ఎంతో ప్రేమ. కానీ.. ఇప్పుడు ఈ ఆఖరి చర్య తప్ప నాకు మరో మార్గం లేదు’ అని తన లేఖలో అరవింద్ పేర్కొన్నారు. తన వద్ద ఉన్న ఎస్‌ఐఆర్ వర్క్ డాక్యుమెంట్లను స్కూలులో అందించాలని చివరలో కోరారు. ఆయన రాసిన ఆఖరి లేఖ.. రాష్ట్రంలోని విద్యాశాఖ, ఎన్నికల విభాగంలో తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు.. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అనేక మంది.. ఎస్‌ఐఆర్ అప్‌లోడ్స్ కంప్లీట్ చేయాలంటూ బీఎల్‌వోలను అర్థరాత్రిపూట కూడా ఒత్తిడి చేస్తూ అధికారులు ఇస్తున్న ఆదేశాలను వైరల్ చేశారు. ఇప్పటికే ఎస్‌ఐఆర్ పనిఒత్తిడితో సతమతం అవుతున్న టీచర్లను ఈ సందేశాలు మరింత భయకంపితులను చేస్తున్నాయి.
DK Shivakumar : సిద్దరామయ్యతో కలిసి పనిచేస్తాం
అరవింద్ బలవన్మరణం కేవలం చిన్న సంఘటన కాదని, వ్యవస్థీకృత అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడికి తీవ్ర పర్యవసానమని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలిండియా రాష్ట్రీయ శిక్షక్ మహాసంఘ్ డిమాండ్ చేసింది. అరవింద్ సూ(డ్)లేఖ గమనిస్తే ఉపాధ్యాయులపై ఎంత ఒత్తిడి ఉంటున్నదో స్పష్టంగా అర్థమవుతున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మితేష్ భట్ అన్నారు. అరవింద్ బలవన్మరణానికి కారణమైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ కారణంగా టీచర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడిని వివరిస్తూ ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని సమర్పించామని ఆయన తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో స్పందించిన గిర్ సోమనాథ్ కలెక్టర్ ఎన్‌వీ ఉపాధ్యాయ్.. తనకు మానసికంగా ఒత్తిడి ఉంటున్నదని అరవింద్ తమకు ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇప్పటికే ఆయన 43 శాతం పనిని పూర్తిచేశారని తెలిపారు. అర్థరాత్రి వరకూ పనిచేయాలని పంపిన మెసేజ్‌లు 20శాతం లోపు పని పూర్తి అయినవారి కోసమే ఇస్తున్నవని, అరవింద్‌ను టార్గెట్ చేసుకుని పంపినవి కావని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ప్రక్రియలో ఉన్న సంక్లిష్టత కారణంగా తాము తరచూ అర్ధరాత్రి వరకూ పనిచేయాల్సి వస్తున్నదని చెప్పారు. కేవలం బీఎల్‌వోలు మాత్రమే కాదని, అందరి మీదా అటువంటి సాధారణ పనిభారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఓటరు జాబితాలను అప్‌డేట్ చేసేందుకు, శుద్ధి చేసేందుకు ఎస్‌ఐఆర్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ.. అందుకు క్షేత్రస్థాయిలో చేపట్టిన విధివిధానాలు పలువురు ప్రభుత్వ ఉద్యోగుల మరణాలతో ఇప్పుడు ప్రశ్నార్థకమవుతున్నాయి. ఎస్‌ఐఆర్‌లో భాగంగా బీఎల్‌వోలు చాలా పనులే చేయాల్సి వస్తున్నది. డోర్ టూ డోర్ వెరిఫికేషన్, వివరాల సేకరణ, ఓటర్ రికార్డుల డిజిటైజేషన్.. ఇవన్నీ తక్కువ కాలంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి సంవత్సరాలు పట్టే ఈ ప్రక్రియను కొద్ది నెలలకు కుదించడం, సాధ్యం కాని టార్గెట్‌లు విధించడం వల్లే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కేరళలో ఇటువంటి బలవన్మరణాలు రికార్డయ్యాయి. ఈ అన్ని కేసులలోనూ మృతులు తమను సూపర్‌వైజర్లు వేధిస్తున్నారని, వ్యవస్థీకృత వైఫల్యాలు ఉన్నాయని తమ లేఖల్లో పేర్కొనడం గమనార్హం.
KTR : 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి
పశ్చిమ బెంగాల్‌లో మాల్‌బజార్‌లోని రంగమతి పంచాయతీలో శాంతిమొణి ఎక్కా అనే 48 ఏళ్ల అంగన్‌వాడీ వర్కర్ పని ఒత్తిడిని భరించేలేక బలవన్మరణానికి పాల్పడింది. మొత్తం బూత్‌కు ఆమే పూర్తి జవాబుదారీ అని, ప్రతి ఇంటికీ ఫారాలు పంపిణీ చేయడం, తిరిగి వాటిని కలెక్ట్ చేసుకోవడం కారణంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యారని ఆమె కుమారు బిషు ఎక్కా మీడియాతో అన్నారు. భాష కూడా ఒక సమస్యగా ఉందని తెలిపారు. ఫారాలన్నీ బెంగాలీలో ఉన్నాయని, కానీ.. తమ ప్రాంతంలో ఎక్కువ మంది హిందీవాళ్లు ఉన్నారని ఆమె భర్త సోకో ఎక్కా తెలిపారు. దీంతో వారికి అర్థమయ్యేలా చెప్పి, కరెక్షన్లు కూడా చేసుకోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. చనిపోవడానికి ముందు ఆమె తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించి, అధికారులకు రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించారని, కానీ అధికారులు దానిని తిరస్కరించారని చెప్పారు. ఇప్పటికే సిస్టమ్‌లో ఆమె పేరు ఉందని, ఇప్పుడు దానిని రద్దు చేయడం కుదరదని పై అధికారి చెప్పారని తెలిపారు. నవంబర్ 9వ తేదీన నమితా హన్స్‌దార్ అనే మరో బీఎల్‌వో పుర్బా బర్దమాన్‌లో ఇలానే పని ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముకేశ్ చంద్ జన్గిడ్ నవంబర్ 16వ తేదీన తనంతట తాను రైలు కిందపడి చనిపోయారు. ఆయన జేబులో దొరికిన లేఖలో తన చావుకు సూపర్ వైజర్ సీతారాం బుంకర్ కారణమని పేర్కొన్నాడు. తనను మానసికంగా వేధించాడని, సస్పెండ్ చేస్తానని బెదిరించాడని తెలిపారు. నవంబర్ 15వ తేదీ రాత్రి తన సూపర్‌వైజర్‌తో జన్గిడ్ సుదీర్ఘంగా మాట్లాడాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 9.30 గంటల సమయంలో తన తమ్ముడికి పత్రాలు అప్పగించి, వాటిపై పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అతికించాని చెప్పి, తన పనిలో నిమగ్నమయ్యాడని తెలిపారు. తెల్లవారుజామున 4.45 గంటలకు ఇంటి నుంచి వెళ్లాడని, రైలు పట్టాలపై ఆయన శవం దొరికిందని తమకు ఉదయం 6.45 గంటల సమయానికి ఫోన్ కాల్ వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. కేరళలోనూ ఒక బీఎల్‌వో ఇలానే చనిపోయారు. అనీశ్ జార్జ్ అనే 44 ఏళ్ల బీఎల్‌వో కన్నూరులోని పయ్యన్నూర్ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. జార్జ్ మరణానంతరం ఒక ఆడియో లీక్ అయింది. అందులో ఒక పై అధికారి టార్గెట్ సాధించకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని బెదిరించడం అందులో వినిపిస్తున్నది. జార్జ్ మరణం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దారి తీసింది.
Read Also |
Krishna River : కృష్ణా నదిలో పాముల పోలిన చేపలు..వైరల్ గా వీడియో!
Telangana Outsourcing Employees | రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 4,95,000! లెక్కతేలని 1.2 లక్షలమంది ఎక్కడ?
KTR : నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram