Telangana Outsourcing Employees | రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 4,95,000! లెక్కతేలని 1.2 లక్షలమంది ఎక్కడ?
తెలంగాణ (telangana) ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,95,000 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు (contract outsourcing employees) ఉన్నట్టు లెక్క తేల్చారు. అయితే.. ఇందులో 1.2 లక్షల (one lakh twenty thousand) మంది వివరాలు ఆడిట్ (audit) సందర్భంగా అందుబాటులో లేకపోవడం అనేక (irregularities alleged) ప్రశ్నలను రేకెత్తిస్తున్నది.
- ఇప్పటి వరకు 3,75,000 మంది పేర్లు నమోదు
- ఇంకా 1 లక్షా 20వేల మంది వివరాలు ఎక్కడ?
- గత పదేళ్లుగా ఆడిట్ లేదు, రూ.15వేల కోట్ల లూటీ!
- జీతాలు పంచుకున్న అధికారులు, ఏజెన్సీలు!
- బోగస్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ జీతాలు పెండింగ్
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Telangana Outsourcing Employees | రాష్ట్రంలో ఏడాది కాలంగా తమను కాంగ్రెస్ సర్కార్ ముప్పుతిప్పలు పెడుతున్నదని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు (contract employees, outsourcing workers) వాపోతున్నారు. కొన్ని విభాగాలలో మూడు నెలలు, మరికొన్ని విభాగాలలో రెండు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా పెండింగ్‌లో (pending salaries) పెడుతున్నారని చెబుతున్నారు. జీతం గురించి నిలదీసి అడిగితే.. ఇంటికి వెళ్లండంటూ ఏజెన్సీలు బెదిరింపులకు దిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఉద్యోగుల పేరుతో పనిచేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని, బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్ల రూపాయలు చెల్లిస్తూ కమీషన్లు వెనకేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమలాంటి వారి పొట్టకొడుతున్నారని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీకి మించి కాంగ్రెస్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని, బడుగు, బలహీన వర్గాలపై కనికరం కూడా లేదని వారు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ కోఠిలో డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం ఎదుట నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఫ్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన తీవ్రత ను గమనించిన అధికారులు పది రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించారు. రాష్ట్రంలో మొత్తం 52 ప్రభుత్వ శాఖలు ఉండగా, వాటికి అనుబంధంగా కార్పొరేషన్లు, సంస్థలు వందల కొద్దీ ఉన్నాయి. తెలంగాణ మోడల్ స్కూల్‌లో 3 నెలలు, బీసీ కాలేజీ హాస్టల్స్‌లో 9 నెలలు, సాంకేతిక విద్యా శాఖలో రెండునెలలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 8 నెలలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 6 నెలలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా అవుతుంది. భూ భారతి ఆపరేటర్లకు పదిహేను నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో వారం పది రోజులకు ఒకసారి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనలు చేయడం సర్వ సాధారణంగా మారింది. నల్లకుంట సర్ రోనాల్డ్ రోస్ హాస్పిటల్‌లో 78 మంది ఔట్ సోర్సిగ్ ఉద్యోగులకు మూడు నెలల జీతాలు పెండింగ్‌లో పెట్టారని సమాచారం.
రాష్ట్రంలో మొత్తం 4,95,000 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ లెక్కలు తేల్చేందుకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. గత నాలుగు నెలల నుంచి ఈ ఉద్యోగుల ఆధార్ వివరాలు ఆన్‌లైన్‌లో సంబంధిత విభాగాలు, శాఖలు, సంస్థల నుంచి తెప్పించుకుంటున్నారు. తాజాగా ఆర్థిక శాఖకు అందిన సమాచారం ప్రకారం 3,75,000 మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మిగతా 1,20,000 మంది ఉద్యోగుల వివరాలు లభ్యం కావడం లేదని సమాచారం. ఆన్‌లైన్ వివరాలు సమర్పించని వారి జీతాలు నిలిపివేయాలని గత నెలలో ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఒక్కరికైనా ఆధార్ లింక్ చేయకుండా జీతాలు చెల్లిస్తే సంబంధిత అధికారి పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొన్ని శాఖల్లో హెడ్ ఆఫ్ అక్కౌంట్ నుంచి జీతాలు చెల్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో వెనక్కి తగ్గారంటున్నారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, నిమామకాలపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన కమిటీని జూలై నెలలో నియమించారు. ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ ఎన్.శివ శంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నుల కమిషనర్ రఘునందన్ రావు ఉన్నారు. ఈ కమిటీ ప్రతి నెలా సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాలు, కార్పొరేషన్లు, సంస్థల నుంచి వివరాలు ఆన్ లైన్ లో తెప్పించుకుని సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన లెక్కల గత పదేళ్లుగా ప్రతి నెలా ఒక లక్ష మంది బోగస్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించారనే అంచనాకు వచ్చారు. ఇలా పదేళ్లలో సుమారు రూ.15వేల కోట్లు ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలు కలిసి పంచుకున్నాయంటున్నారు. ఏజెన్సీల్లో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించారని అంటున్నారు. పది సంవత్సరాలలో బోగస్ ఉద్యోగుల పేరిట మెక్కిన రూ.15వేల కోట్లపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని సచివాలయ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో బోగస్ ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఏ ఒక్క శాఖలో కూడా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించడం లేదని అంటున్నారు. ప్రతి శాఖలో కనీసం రెండు నెలల నుంచి గరిష్ఠంగా ఆరు నెలల వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తున్నది. ఆధార్ తో లింక్ అయిన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతి నెలా ఉద్యోగాలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని నాయకులు గుర్తు చేస్తున్నారు.
Read Also |
Outsourcing Employees | తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు సర్కారీ మేత.. ఇదిగో లెక్క!
Outsourcing Agencies | తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నిలువు దోపిడీ?
Government Employees | ప్రభుత్వ ఉద్యోగులకు రూ.30వేల కోట్ల బకాయిల పాపం ఎవరిది?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram